Maruti Brezza : ప్రసిద్ధ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ క్రేజీ ఎస్‌యూవీ బ్రెజ్జాను అనేక కొత్త అప్‌డేట్‌లతో 2026 బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ రూపంలో మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఈసారి కంపెనీ కేవలం కారు ఎక్స్‌టీరియర్ డిజైన్, ఫీచర్లను మాత్రమే కాకుండా ఇంజన్ ఆప్షన్లను కూడా భారీగా విస్తరించింది. కొనుగోలుదారుల అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకోవడానికి ఇప్పుడు గతంలో కంటే ఎక్కువ వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి. కొత్త బ్రెజ్జాలో పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్‌లతో పాటు, పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే కొత్త టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను కూడా పరిచయం చేశారు. మంచి పవర్ కావాలనుకునే వారికి టర్బో ఇంజన్ సరైన ఎంపికగా నిలుస్తుండగా, తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి సీఎన్‌జీ, రెగ్యులర్ పెట్రోల్ మోడళ్లు ఉపయోగపడతాయి. ఈ క్రమంలో కంపెనీ అన్ని వేరియంట్లకు సంబంధించిన అధికారిక మైలేజ్ గణాంకాలను విడుదల చేసింది.

టర్బో బ్రెజ్జా మైలేజ్ ఎంతంటే?

కొత్త బ్రెజ్జాలోని టర్బో-పెట్రోల్ ఇంజన్ అనేక వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అయితే వేరియంట్‌ను బట్టి మైలేజ్‌లో స్వల్ప తేడాలు ఉన్నాయి. ఎల్‌ఎక్స్ఐ టర్బో , విఎక్స్ఐ టర్బో వేరియంట్లు లీటరుకు 20.47 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తాయని కంపెనీ వెల్లడించింది. అలాగే కాస్త హైఎండ్ వేరియంట్లు అయిన జెడ్‌ఎక్స్ఐ టర్బో, జెడ్‌ఎక్స్ఐ+ టర్బో వేరియంట్లు లీటరుకు 19.96 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తాయి. ఈ రెండు వేరియంట్ల మైలేజ్ మధ్య పెద్దగా తేడా లేదు. కాబట్టి టర్బో ఇంజన్ పవర్ కావాలనుకుంటూనే మంచి మైలేజ్ ఆశించేవారికి LXi, VXi టర్బో వేరియంట్లు అద్భుతమైన ఆప్షన్లు అని చెప్పవచ్చు.

పెట్రోల్ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్ల మైలేజ్

సాధారణ పెట్రోల్ ఇంజన్, మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వచ్చే బ్రెజ్జా వేరియంట్లు కూడా మైలేజ్ విషయంలో చాలా బలంగా ఉన్నాయి. LXi MT, VXi MT వేరియంట్లు లీటరుకు ఏకంగా 21.09 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా, ZXi MT వేరియంట్ లీటరుకు 20.81 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అంటే రెగ్యులర్ పెట్రోల్ మాన్యువల్ మోడళ్లు ఇప్పటికీ లీటరుకు 20 కిలోమీటర్లకు పైగానే మైలేజ్ అందిస్తున్నాయి. మరోవైపు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇష్టపడే వారి కోసం విడుదల చేసిన VXi, ZXi మరియు ZXi+ ఆటోమేటిక్ వేరియంట్లు లీటరుకు 20.17 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తాయి. మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్ల మైలేజ్ మధ్య పెద్దగా వ్యత్యాసం లేకపోవడం ఆటోమేటిక్ కార్లు కోరుకునే వారికి పెద్ద ఊరట అని చెప్పవచ్చు.

మైలేజ్‌లో రాజాగా నిలిచిన సీఎన్‌జీ మోడల్

అన్నింటికంటే అతి తక్కువ రన్నింగ్ కాస్ట్, అత్యధిక మైలేజ్ కావాలనుకునే వారి కోసం సీఎన్‌జీ వేరియంట్లు అన్నింటికన్నా ముందు వరుసలో నిలిచాయి. LXi CNG, VXi CNG, ZXi CNG వేరియంట్లు కేజీ సీఎన్‌జీకి ఏకంగా 26.90 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తాయని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ప్రతి నెలా ఎక్కువ దూరం ప్రయాణించే వారికి లేదా ఇంధన ఖర్చులను భారీగా తగ్గించుకోవాలనుకునే వారికి బ్రెజ్జా సీఎన్‌జీ వర్షన్ అత్యుత్తమ ఎంపిక అవుతుంది.

రియల్ వరల్డ్ మైలేజ్ ఎలా ఉంటుంది?

కంపెనీ ప్రకటించిన ఈ మైలేజ్ గణాంకాలు ల్యాబ్ టెస్టుల ఆధారంగా ఇచ్చే అధికారిక డేటా మాత్రమే. రోడ్లపై వచ్చే అసలైన మైలేజ్ అనేది ట్రాఫిక్ పరిస్థితులు, రోడ్డు కండిషన్, డ్రైవింగ్ చేసే విధానం, కారులో కూర్చున్న ప్రయాణికుల సంఖ్య, లగేజీ బరువుపై ఆధారపడి ఉంటుంది. ఏదేమైనప్పటికీ, కొత్తగా టర్బో ఇంజన్ జోడించినప్పటికీ బ్రెజ్జా ఇంధన సామర్థ్యం పడిపోకపోవడం విశేషం. తక్కువ ఇంధన ఖర్చుతో ఎక్కువ మైలేజ్ కావాలనుకునే వారికి రెగ్యులర్ పెట్రోల్ మాన్యువల్, సీఎన్‌జీ మోడళ్లు బెస్ట్ ఛాయిస్.

PolitEnt Media

PolitEnt Media

Next Story