Maruti Ciaz: మారుతి సుజుకికి చెందిన లగ్జరీ సెడాన్ సియాజ్ స్టాక్ ఇంకా డీలర్ల దగ్గర మిగిలే ఉంది. ఈ కారు ఉత్పత్తిని కంపెనీ ఏప్రిల్‌లో నిలిపివేసినా పాత స్టాక్ ఉండటంతో అమ్మకాలు కొనసాగుతున్నాయి. గత నెల అంటే మేలో సియాజ్ కేవలం 458 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గతేడాది మే 2024లో అయితే 730 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే, స్టాక్ పూర్తిగా అయిపోయిందా లేదా అని కంపెనీ ఇంకా స్పష్టం చేయలేదు. మే నెలలో ఈ కారుపై ఏకంగా రూ.40,000 డిస్కౌంట్ కూడా ఇచ్చారు. 2014లో లాంచ్ అయిన సియాజ్ చాలా కాలం పాటు నెక్సాలో ఏకైక సెడాన్‌గా నిలిచింది. ఈ కారు ప్రారంభ ధర రూ.9.41 లక్షలు.

మారుతి సియాజ్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

మారుతి సుజుకి తమ లగ్జరీ సెడాన్ సియాజ్‌ను ఫిబ్రవరి 2024లో కొన్ని కొత్త సేఫ్టీ అప్‌డేట్స్‌తో విడుదల చేసింది. ఇందులో మూడు కొత్త డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. అవి బ్లాక్ రూఫ్‌తో పర్ల్ మెటాలిక్ ఆప్యులెంట్ రెడ్, బ్లాక్ రూఫ్‌తో పర్ల్ మెటాలిక్ గ్రాండ్యూర్ గ్రే, బ్లాక్ రూఫ్‌తో డిగ్నిటీ బ్రౌన్. కొత్త వేరియంట్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది.

ఇంజిన్‌లో మార్పు లేదు

సియాజ్ కొత్త వేరియంట్ ఇంజిన్‌లో కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో పాత 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్నే ఉపయోగించారు. ఇది 103bhp పవర్, 138Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ను 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ , 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. కంపెనీ ప్రకారం దీని మాన్యువల్ వెర్షన్ లీటరుకు 20.65 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 20.04 కి.మీ. వరకు మైలేజ్ ఇస్తుంది.

సేఫ్టీలోనూ టాప్

మారుతి సియాజ్‌లో 20కి పైగా సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు హిల్-హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP)ను అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా అందించారు. అంటే ఈ ఫీచర్లు అన్ని మోడల్స్‌లోనూ ఉంటాయి. ఇంకా ఈ కారులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD)తో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ సెడాన్‌లో ప్రయాణికులు గతంలో కంటే సురక్షితంగా ఉంటారని కంపెనీ చెబుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story