Maruti Suzuki: భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి గ్లోబల్ ఆటోమొబైల్ మార్కెట్‌లో తన సత్తా చాటుతోంది. మేడ్-ఇన్-ఇండియా ఎలక్ట్రిక్ వాహనాలకు అంతర్జాతీయంగా మైండ్ బ్లాకింగ్ డిమాండ్ కనిపిస్తోంది. ఆగస్టు 2025లో ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతులను ప్రారంభించిన మారుతి సుజుకి, ఇప్పటివరకు ఏకంగా 50 వేలకు పైగా ఈవీ కార్లను విదేశాలకు పంపించి సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం నాడు కంపెనీ ప్రతినిధులు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. బ్రిటన్, నార్వే, జర్మనీ, జపాన్, స్విట్జర్లాండ్ సహా సుమారు 50 ప్రపంచ దేశాలకు భారత్ నుంచి ఎలక్ట్రిక్ కార్లను ఎగుమతి చేస్తుండటం విశేషం.

యూరప్‌లోనే హవా.. 93 శాతం వాటా

మారుతి సుజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు యూరప్ ప్రధాన ఎగుమతి మార్కెట్‌గా అవతరించింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) గణాంకాల ప్రకారం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026 మధ్య కాలంలో భారతదేశం నుంచి ఎగుమతైన మొత్తం ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్లలో మారుతి సుజుకి వాటా ఏకంగా 93 శాతంగా నమోదైంది. ఇదే సమయంలో దేశం నుంచి జరిగిన మొత్తం ప్యాసింజర్ వాహనాల ఎగుమతుల్లో కంపెనీ సగానికి పైగా వాటాను కైవసం చేసుకుంది. ప్రస్తుతం మారుతి సంస్థ భారత్‌లో తయారు చేసిన 16 విభిన్న మోడళ్లను ప్రపంచవ్యాప్తంగా 120 దేశాలకు సరఫరా చేస్తోంది.

గుజరాత్ హన్సల్‌పూర్ ప్లాంట్ మైలురాయి

గుజరాత్‌లోని హన్సల్‌పూర్ ప్లాంట్‌లో ఇ-విటారా మోడల్ ఉత్పత్తి శరవేగంగా సాగుతోంది. ఈ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఏకంగా 10 లక్షల వాహనాలకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఒకే ప్రదేశంలో ఇంత భారీ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించిన తొలి సుజుకి తయారీ కేంద్రంగా ఇది చరిత్ర సృష్టించింది. ఈ ప్లాంట్‌పై కంపెనీ ఇప్పటివరకు రూ. 25,288.7 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో మారుతి చేసిన మొత్తం విదేశీ కార్ల సరఫరాలో దాదాపు సగం వాటా ఈ ఒక్క ప్లాంట్ నుంచే రావడం గమనార్హం.

రికార్డు స్థాయి విక్రయాలు.. రాబోయే కొత్త మోడళ్లు

కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ హిసాషి టకేవుచి మాట్లాడుతూ భారతదేశాన్ని గ్లోబల్ ఈవీ హబ్‌గా మార్చే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి ఏకంగా 4.47 లక్షల కంటే ఎక్కువ వాహనాలను విదేశాలకు ఎగుమతి చేసి 34 శాతం వృద్ధిని నమోదు చేసింది. మరోవైపు రాబోయే రోజుల్లో ప్రముఖ స్పోర్టీ ఎస్‌యూవీ ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను స్ట్రాంగ్-హైబ్రిడ్ టెక్నాలజీ, లెవెల్ 2 నావిగేషన్ ఫీచర్లతో పరిచయం చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

Next Story