ఒక ఎమోషన్..సెకనుకు ఐదు కార్లు సేల్

Maruti Suzuki : భారతదేశ ఆటోమొబైల్ రంగానికి రారాజు ఎవరో మారుతి సుజుకి మరోసారి నిరూపించింది. 2025 క్యాలెండర్ ఏడాదిలో ఈ స్వదేశీ దిగ్గజం సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. కేవలం 356 రోజుల్లోనే ఏకంగా 19.55 లక్షల కార్లను భారతీయుల ఇళ్లకు చేర్చి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇది ఒక ఏడాదిలో మారుతి నమోదు చేసిన అత్యధిక దేశీయ అమ్మకాలు కావడం విశేషం. కేవలం ఇండియాలోనే కాదు, విదేశాలకు కార్లను ఎగుమతి చేయడంలో కూడా మారుతి రికార్డులను తిరగరాసింది.

2025 ఏడాదిని మారుతి సుజుకి ఘనంగా ముగించింది. డిసెంబర్ నెలలో మొత్తం 1,78,646 వాహనాలను విక్రయించి, గతేడాది డిసెంబర్‌తో పోలిస్తే 37.3% భారీ వృద్ధిని నమోదు చేసింది. పండుగ సీజన్ ముగిసినా, కొత్త ఏడాది రాకముందే కార్లు కొనడానికి జనం షోరూమ్‌లకు పోటెత్తారు. నవంబర్ 2025తో పోల్చినా అమ్మకాల్లో 4.49% పెరుగుదల కనిపించడం మారుతి బ్రాండ్ పవర్ ఏంటో చాటిచెబుతోంది.

మారుతి అమ్మకాలను నిశితంగా పరిశీలిస్తే.. సామాన్యుడి కార్లైన ఆల్టో, ఎస్-ప్రెస్సోల విక్రయాలు గతేడాది కంటే రెట్టింపు అయ్యాయి. గత నెలలో ఈ సెగ్మెంట్లో 14,225 కార్లు అమ్ముడయ్యాయి. ఇక స్విఫ్ట్, బలేనో, డిజైర్, వ్యాగన్ ఆర్ వంటి కాంపాక్ట్ కార్ల సెగ్మెంట్లో 78,704 యూనిట్లు అమ్ముడై కంపెనీకి పెద్ద ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. మునుపటి కంటే ఇప్పుడు మారుతి ఎస్‌యూవీల (Brezza, Grand Vitara, Fronx) హవా కూడా పెరిగింది. యూటిలిటీ సెగ్మెంట్లో 73,818 యూనిట్ల విక్రయాలతో హ్యుందాయ్, టాటాలకు గట్టి పోటీనిచ్చింది.

మారుతి సుజుకి కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచ దేశాల్లోనూ తన జెండా ఎగురవేస్తోంది. 2025 ఏడాదిలో కంపెనీ మొత్తం 3,95,648 కార్లను విదేశాలకు ఎగుమతి చేసింది. దీంతో వరుసగా ఐదవ ఏడాది కూడా భారతదేశపు నంబర్-1 ప్యాసింజర్ వాహనాల ఎగుమతిదారుగా మారుతి సుజుకి నిలిచింది. దేశీయ అమ్మకాలు మరియు ఎగుమతులు కలిపి చూస్తే 2025లో మారుతి సుజుకి మొత్తం 23,51,139 వాహనాలను విక్రయించి గ్లోబల్ మార్కెట్లో తన ఉనికిని చాటుకుంది.

చాలా కంపెనీలు వ్యాన్ సెగ్మెంట్ పై దృష్టి పెట్టకపోయినా, మారుతి ఈకో మాత్రం సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతోంది. కేవలం డిసెంబర్ నెలలోనే 11,899 మంది ఈ కారును కొనుగోలు చేశారు. మధ్యతరగతి కుటుంబాలకు, చిన్న వ్యాపారస్తులకు ఈకో ఒక వరప్రదాయినిలా మారింది. తక్కువ ధరలో ఎక్కువ మంది కూర్చునే సౌకర్యం ఉండటమే దీని విజయ రహస్యం.

మారుతి సుజుకికి ఈ ఏడాది కేవలం అమ్మకాల పరంగానే కాదు, టెక్నాలజీ పరంగా కూడా ఎంతో కీలకం. కంపెనీ తన కార్లలో సేఫ్టీ ఫీచర్లను పెంచడంతో పాటు, సీఎన్‌జీ, హైబ్రిడ్ టెక్నాలజీతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. 2026లో మారుతి నుంచి మరిన్ని ఎలక్ట్రిక్ కార్లు (eVX వంటివి) రాబోతుండటంతో, వచ్చే ఏడాది అమ్మకాలు 25 లక్షల మార్కును దాటుతాయని ఆటోమొబైల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story