Maruti Suzuki : భారతదేశంలో కార్ల అమ్మకాలకు సంబంధించిన మే 2026 నెలవారీ డేటా విడుదలైంది. ఎస్‌యూవీల హడావుడి నడుస్తున్నా.. చిన్న కార్ల మార్కెట్ ఐన హ్యాచ్‌బ్యాక్ విభాగంలో అమ్మకాలు జోరుగా సాగాయి. మే 2026 లో దేశవ్యాప్తంగా మొత్తం 92,837 హ్యాచ్‌బ్యాక్ కార్లు అమ్ముడయ్యాయి. మే 2025 లో అమ్ముడైన 74,100 యూనిట్లతో పోలిస్తే ఇది 25.29 శాతం ఎక్కువ. అయితే ఏప్రిల్ 2026లో అమ్ముడైన 95,907 యూనిట్లతో పోలిస్తే స్వల్ప తగ్గుదల కనిపించింది. ఈ మొత్తం మార్కెట్లో మారుతి సుజుకి తన పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ.. టాప్-9 బెస్ట్ సెల్లింగ్ కార్లలో 6 మోడళ్లను తన ఖాతాలోనే వేసుకుంది. హ్యాచ్‌బ్యాక్ అమ్మకాల్లో కంపెనీ ఏకంగా 75 శాతానికి పైగా మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది.

నెంబర్-1 స్థానంలో నిలిచిన మారుతి బాలెనో

మే 2026 లో దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్‌బ్యాక్ కారుగా మారుతి బాలెనో నిలిచింది. గత నెలలో బాలెనో ఏకంగా 18,396 యూనిట్ల సేల్స్ సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గతేడాదితో పోలిస్తే ఈ కారు అమ్మకాల్లో 58.34 శాతం భారీ వృద్ధి నమోదైంది. ఈ ఒక్క కారు మాత్రమే మొత్తం హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో సుమారు 20 శాతం వాటాను కలిగి ఉంది. ఇక రెండవ స్థానంలో 18,076 యూనిట్ల అమ్మకాలతో మారుతి వ్యాగన్ఆర్ నిలవగా.. మూడవ స్థానంలో 17,519 యూనిట్లతో మారుతి స్విఫ్ట్ నిలిచింది. ఈ మూడు కార్లు కలిసి మొత్తం 54 వేల యూనిట్లకు పైగా అమ్ముడై, మొత్తం మార్కెట్లో 58 శాతం వాటాను ఆక్రమించాయి.

ఆల్టో, ఎస్-ప్రెస్సో కార్ల రికార్డు అమ్మకాలు

బడ్జెట్ కార్ల విభాగంలో ఎప్పటికీ క్రేజ్ తగ్గని మారుతి ఆల్టో తన అమ్మకాలను దాదాపు రెట్టింపు చేసుకుంది. ఆల్టో సేల్స్ 4,970 యూనిట్ల నుండి ఏకంగా 9,887 యూనిట్లకు పెరిగి, 98.93 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే అందరినీ ఆశ్చర్యపరిచేలా మారుతి ఎస్-ప్రెస్సో రికార్డు బ్రేకింగ్ అమ్మకాలను సాధించింది. మే 2025 లో కేవలం 1,806 యూనిట్లు అమ్ముడైన ఎస్-ప్రెస్సో.. మే 2026 నాటికి ఏకంగా 6,388 యూనిట్లకు చేరింది. అంటే విక్రయాల్లో 253.71 శాతం రికార్డు వృద్ధి నమోదైంది. మరోవైపు మారుతి సెలెరియో కూడా 3,018 యూనిట్ల అమ్మకాలతో 62.17 శాతం వృద్ధిని సాధించింది.

మిగతా కంపెనీల కార్ల పరిస్థితి ఇదీ

మారుతి సుజుకి కాకుండా ఇతర కంపెనీల విషయానికి వస్తే.. హ్యుందాయ్ ఐ20 అత్యధికంగా అమ్ముడైన నాన్-మారుతి కారుగా నిలిచింది. ఇది 4,749 యూనిట్ల అమ్మకాలతో 16.11 శాతం వృద్ధిని కనబరిచింది. అయితే హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ అమ్మకాలు 32.78 శాతం తగ్గి 2,920 యూనిట్లకు పడిపోయాయి. టాటా టియాగో, టియాగో ఈవీల ఉమ్మడి అమ్మకాలు 34.79 శాతం క్షీణించి 4,178 యూనిట్లుగా నమోదయ్యాయి. టొయోటా గ్లాంజా అమ్మకాలు కూడా 32.72 శాతం తగ్గి 3,198 యూనిట్లకు పరిమితమయ్యాయి. టాటా ఆల్ట్రోజ్ మాత్రం 4.89 శాతం స్వల్ప వృద్ధితో పర్వాలేదనిపించింది.

ఈవీలు మరియు చిన్న కార్ల లేటెస్ట్ ట్రెండ్

ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ఎంజీ కామెట్ ఈవీ గత నెలలో 869 యూనిట్లు అమ్ముడైంది. ఇది గతేడాదితో పోలిస్తే 5.59 శాతం, ఏప్రిల్ 2026 తో పోలిస్తే 44.59 శాతం ఎక్కువ. ఇక అత్యధిక శాతం వృద్ధిని సిట్రోయెన్ సి3 నమోదు చేసింది. దీని విక్రయాలు 256.36 శాతం పెరిగి 392 యూనిట్లకు చేరాయి, కానీ మొత్తం సంఖ్య పరంగా ఇది చాలా తక్కువ. కాగా ఫ్రెంచ్ కంపెనీ రెనో క్విడ్ అమ్మకాలు దారుణంగా 44.44 శాతం పడిపోయి కేవలం 300 యూనిట్లకు పరిమితమయ్యాయి. అలాగే సిట్రోయెన్ ఈసీ3 ఈవీ కేవలం 32 యూనిట్లు మాత్రమే అమ్ముడై రేసులో బాగా వెనుకబడింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story