Maruti Eeco: రూ.5.21 లక్షల కారు సరికొత్త రికార్డు.. 15 లక్షల మైలురాయి దాటిన మారుతి వ్యాన్
మారుతి వ్యాన్

Maruti Eeco: భారతీయ రోడ్లపై తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న మారుతి సుజుకి ఈకో మరో అరుదైన ఘనతను సాధించింది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల దాకా ప్రతిఒక్కరి అవసరాలను తీరుస్తూ ఏకంగా 15 లక్షల యూనిట్ల సేల్స్ మార్క్‌ను అధిగమించి ఆటోమొబైల్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. జనవరి 2010లో భారత విపణిలోకి అడుగుపెట్టిన మారుతి ఈకో మొదటి 5 లక్షల కార్ల అమ్మకాలను సాధించడానికి దాదాపు 8 సంవత్సరాల సుదీర్ఘ సమయం పట్టింది. తర్వాతి 5 లక్షల మార్క్‌ను కేవలం ఐదేళ్లలోనే అందుకుని తన సత్తా చాటింది. ఆశ్చర్యకరంగా ఆఖరి 5 లక్షల కార్ల విక్రయాలు కేవలం మూడేళ్లన్నర కాలంలోనే పూర్తయ్యాయి. రోజురోజుకూ ఈ వ్యాన్ ప్రజాదరణ ఏ స్థాయిలో పెరుగుతోందో ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, అత్యధిక రీసేల్ వాల్యూ ఉండటం ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
సరికొత్త స్టార్ ఎడిషన్ ఆవిష్కరణ
ఈ చారిత్రాత్మక 15 లక్షల మైలురాయిని పురస్కరించుకుని మారుతి సుజుకి సంస్థ ఈకో స్టార్ ఎడిషన్ పేరుతో ప్రత్యేక మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇందులో కార్ బయటి రూపంతో పాటు లోపలి కేబిన్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే 18 రకాల అదనపు యాక్సెసరీలను చేర్చారు. బాడీ కలర్ బంపర్లు, ఆకర్షణీయమైన డిజైన్ ఎలిమెంట్లతో వస్తున్న ఈ స్టార్ ఎడిషన్ లుక్స్ పరంగా ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. మెకానికల్ మార్పులు ఏవీ చేయకుండా కేవలం విజువల్ అప్‌గ్రేడ్స్‌తో కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
పల్లెటూర్లలోనే అత్యధిక క్రేజ్
మారుతి ఈకో అమ్మకాలలో గ్రామీణ ప్రాంతాల పాత్ర అత్యంత కీలకమైనది. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన మొత్తం విక్రయాల్లో దాదాపు 65 శాతం కొనుగోళ్లు పల్లెల నుంచే రావడం విశేషం. మొదటిసారి కారు కొనేవారి సంఖ్య ఏకంగా 55 శాతంగా ఉండగా, 51 శాతానికి పైగా స్వయం ఉపాధి పొందే చిన్న వ్యాపారవేత్తలు ఈ కారును ఎంచుకున్నారు. కుటుంబ ప్రయాణాలతో పాటు సరుకుల రవాణాకు కూడా ఇది అత్యంత అనుకూలంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.
విభిన్న అవసరాలకు 13 రకాల వేరియంట్లు
ప్రస్తుతం మార్కెట్‌లో మారుతి ఈకో రూ.5.21 లక్షల నుంచి రూ.6.46 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరల్లో లభిస్తోంది. 5-సీటర్, 6-సీటర్ ఆప్షన్లతో పాటు కార్గో, అంబులెన్స్, టూర్-వి వంటి ఏకంగా 13 భిన్నమైన వేరియంట్లలో అందుబాటులో ఉంది. పెట్రోల్ తో పాటు ఎస్-సిఎన్‌జీ ఆప్షన్ కూడా ఉండటంతో వ్యాపారులకు ఇంధన ఖర్చులు బాగా కలిసి వస్తున్నాయి. మొత్తం విక్రయాల్లో సిఎన్‌జీ మోడళ్ల వాటానే 48 శాతంగా ఉండటం విశేషం.

