Maruti Suzuki Fronx : భారతీయ కార్ల లవర్స్ లోనే కాకుండా విదేశీ కస్టమర్లలో కూడా మారుతి సుజుకి బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. 2026 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (ఏప్రిల్ నుంచి జూన్) లో భారత దేశం నుంచి విదేశాలకు అత్యధికంగా ఎగుమతి అయిన కార్ల జాబితాలో మారుతి సుజుకి పాపులర్ క్రాస్ ఓవర్ ఎస్‌యూవీ ఫ్రాంక్స్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ వ్యవధిలో మారుతి ఫ్రాంక్స్ ఏకంగా 3.17 శాతం వార్షిక వృద్ధితో 23,803 యూనిట్ల కార్లను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసింది. గతేడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 23,071 యూనిట్లుగా నమోదైంది.

టాప్-3 స్థానాల్లో మారుతి హవా

కార్ల ఎగుమతుల జాబితాలో రెండవ స్థానంలో మారుతి సుజుకి జిమ్నీ నిలిచింది. జిమ్నీ ఏకంగా 46.45 శాతం వార్షిక వృద్ధితో 21,840 యూనిట్లను ఎగుమతి చేసి సంచలనం సృష్టించింది. ఇక మూడో స్థానంలో మారుతి సుజుకి సరికొత్త ఎలక్ట్రిక్ కారు ఈ-విటారా 15,210 యూనిట్ల ఎగుమతులతో నిలిచింది. నాల్గో స్థానంలో హ్యుందాయ్ గ్రాండ్ i10 కారు 9.23 శాతం వృద్ధితో 14,282 యూనిట్లను విదేశాలకు తరలించింది.

టాప్-10 లో నిలిచిన కార్లు ఇవే

ఐదో స్థానంలో మారుతి సుజుకి బలేనో 11,163 యూనిట్లతో నిలవగా, ఆరో స్థానంలో ఉన్న మారుతి డిజైర్ సెడాన్ ఏకంగా 30.84 శాతం ఎగుమతుల వృద్ధిని సాధించి 10,798 యూనిట్లను నమోదు చేసింది. ఏడో స్థానంలో నిస్సాన్ మాగ్నైట్ (10,765 యూనిట్లు), ఎనిమిదో స్థానంలో మారుతి స్విఫ్ట్ (9,598 యూనిట్లు) ఉన్నాయి. తొమ్మిది మరియు పదవ స్థానాల్లో వరుసగా హ్యుందాయ్ వెర్నా (9,554 యూనిట్లు), హ్యుందాయ్ ఆరా (8,670 యూనిట్లు) నిలిచాయి.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ ప్రత్యేకతలు

విదేశీయులను సైతం కట్టిపడేస్తున్న మారుతి ఫ్రాంక్స్ ఎంతో స్పోర్టీ లుక్ అండ్ డిజైన్‌తో వస్తుంది. ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 1.2-లీటర్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఆప్షన్లతో పాటు డ్యూయల్-ఫ్యూయల్ సీఎన్‌జీ వేరియంట్ కూడా లభిస్తుంది. ఈ కారు పెట్రోల్ మోడ్‌లో లీటరుకు 20 నుంచి 22.89 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుండగా, సీఎన్‌జీ వర్షన్‌లో కేజీకి 28.5 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

ధర, ప్రీమియం సేఫ్టీ ఫీచర్లు

మారుతి ఫ్రాంక్స్‌లో కస్టమర్లను ఆకట్టుకునేలా 9-ఇంచుల హెచ్‌డీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, సురక్షిత ప్రయాణం కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. భారత్‌లో మారుతి సుజుకి ఫ్రాంక్స్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.85 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్ రూ. 11.98 లక్షల వరకు అందుబాటులో ఉంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు, అదిరిపోయే మైలేజ్ ఇవ్వడం వల్లే అంతర్జాతీయ మార్కెట్‌లో దీనికి తిరుగులేని ఆదరణ లభిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story