Maruti Fronx: భారత్‌లో తయారైన కార్లకు అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకికి చెందిన కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫ్రాంక్స్ ఎగుమతుల్లో సంచలన రికార్డు సృష్టించింది. అత్యంత వేగంగా 2 లక్షల యూనిట్ల ఎగుమతుల మార్కును దాటిన భారతీయ ఎస్‌యూవీగా నిలిచి సరికొత్త చరిత్ర తిరగరాసింది. మారుతి సుజుకి సంస్థ గ్లోబల్ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన ఫ్రాంక్స్ మోడల్ ఎగుమతుల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. జూన్ 2023లో తొలిసారిగా విదేశాలకు రవాణా అయిన ఈ కారు, కేవలం 38 నెలల వ్యవధిలోనే ఏకంగా 2 లక్షల ఎగుమతుల మైలురాయిని చేరుకుంది. మొదట్లో ఒక లక్ష యూనిట్ల ఎగుమతికి 25 నెలల సమయం పట్టగా, తదుపరి లక్ష యూనిట్లు కేవలం 13 నెలల వ్యవధిలోనే విదేశాలకు తరలిపోవడం ఈ కారుకు ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా చూపుతోంది.

గుజరాత్ నుంచి ప్రపంచానికి ప్రయాణం

గుజరాత్‌లోని హన్సల్‌పూర్ ప్లాంట్‌లో తయారవుతున్న ఈ ఎస్‌యూవీని ఆటోమొబైల్ రంగానికి పుట్టినిల్లయిన జపాన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టు కింద తయారవుతున్న ఈ కారు, ప్రపంచ వినియోగదారుల మనసులను గెలుచుకోవడంలో పూర్తి విజయం సాధించింది. నాణ్యత, స్టైలిష్ డిజైన్, నమ్మకమైన పెర్ఫార్మెన్స్ కారణంగా విదేశీ మార్కెట్లలో ఫ్రాంక్స్‌కు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది.

మేక్ ఇన్ ఇండియా వ్యూహానికి నిదర్శనం

ఈ ఘనతపై మారుతి సుజుకి మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హిసాషి టేకుచి హర్షం వ్యక్తం చేశారు. మన దేశీయ ఉద్యోగుల కష్టం, ప్రతిభ విదేశీ రహదారులపై కార్ల రూపంలో పరుగులు తీస్తోందని కొనియాడారు. భారతీయ తయారీ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా కంపెనీ కృషి చేస్తోందని వివరించారు. ప్రస్తుతం ల్యాటిన్ అమెరికా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఆసియా ప్రాంతాల్లోని దాదాపు 120 దేశాలకు మారుతి తన కార్లను రవాణా చేస్తూ అంతర్జాతీయంగా బలమైన ముద్ర వేసింది.

గ్లోబల్ ఆటోమొబైల్ హబ్‌గా భారత్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత్ నుంచి అత్యధికంగా ఎగుమతి అయిన టాప్-3 ప్యాసింజర్ కార్లలోనూ మారుతి కార్లే మొదటి స్థానాల్లో నిలవడం విశేషం. విదేశాల్లో భారతీయ ఉత్పత్తులకు పెరుగుతున్న ఈ ఆదరణ దేశీయ తయారీ రంగానికి కొండంత బలాన్నిస్తోంది. రాబోయే రోజుల్లో భారత్ ప్రపంచ ఆటోమొబైల్ దిగ్గజాలకు ప్రధాన ఎగుమతి కేంద్రంగా మారడానికి ఈ రికార్డులు ఎంతగానో దోహదపడనున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story