Maruti Suzuki : భారత ఆటోమొబైల్ రంగంలో కింగ్ ఎవరంటే టక్కున వినిపించే పేరు మారుతి సుజుకి. ఇప్పుడు ఆ పేరు మరోసారి మారుమోగిపోతోంది. 2027 కొత్త ఆర్థిక సంవత్సరాన్ని మారుతి సుజుకి అదిరిపోయే రేంజ్‌లో మొదలుపెట్టింది. ఏప్రిల్ 2026 నెలలో కంపెనీ ఏకంగా తన పాత రికార్డులన్నింటినీ తుడిచేస్తూ, మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక విక్రయాలను నమోదు చేసింది. అసలు అమ్మకాల లెక్కలు చూస్తుంటే కళ్లు తిరగడం ఖాయం.

గంటకు 265 కార్లు - ఆల్ టైమ్ రికార్డు

మారుతి సుజుకి ఏప్రిల్ 2026 నెలలో మొత్తం 2,39,646 యూనిట్ల విక్రయాలను నమోదు చేసి చరిత్ర సృష్టించింది. గత ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఇది ఏకంగా 33.29 శాతం వృద్ధి. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ నెలలో సగటున ప్రతి గంటకు 265 కంటే ఎక్కువ కార్లు అమ్ముడయ్యాయి. అంటే నిమిషానికి సుమారు 4-5 కార్లు రోడ్డెక్కాయి. దేశీయంగా విక్రయించిన 1,91,122 యూనిట్లు కంపెనీ చరిత్రలోనే ఒక నెలలో నమోదైన అత్యధిక విక్రయాలుగా నిలిచాయి.

తిరిగి పుంజుకున్న చిన్న కార్ల డిమాండ్

ఎస్‌యూవీల ట్రెండ్ పెరగడం వల్ల చిన్న కార్ల విక్రయాలు తగ్గిపోతాయని అందరూ భావించారు. కానీ మారుతి ఆ అంచనాలను తలకిందులు చేసింది. ఎంట్రీ లెవల్ కార్లయిన ఆల్టో, ఎస్-ప్రెస్సో అమ్మకాలు ఏకంగా 153 శాతం పెరిగి 16,066 యూనిట్లకు చేరాయి. మధ్యతరగతి ప్రజలు ఇప్పటికీ తమ మొదటి కారుగా మారుతి చిన్న కార్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.

ఎస్‌యూవీలు మరియు కాంపాక్ట్ కార్ల జోరు

కేవలం చిన్న కార్లే కాకుండా, కాంపాక్ట్ సెగ్మెంట్‌లో బాలెనో, స్విఫ్ట్, డిజైర్, వ్యాగన్-ఆర్ మోడళ్లు 80,659 యూనిట్ల విక్రయాలతో దూసుకుపోతున్నాయి. అటు ఎస్‌యూవీ విభాగంలో బ్రెజ్జా, ఎర్టిగా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా వంటి వాహనాలు కూడా 77,892 యూనిట్ల అమ్మకాలతో కంపెనీకి పెద్ద ఎత్తున ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఎగుమతుల్లో కూడా 40,054 యూనిట్లతో మారుతి తన గ్లోబల్ పవర్‌ను చాటుకుంది.

సవాళ్లు ఉన్నా తగ్గేదేలే

కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మాట్లాడుతూ.. కొత్త ఆర్థిక సంవత్సరం ఇంత గొప్పగా ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అయితే, అంతర్జాతీయంగా (ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో) నెలకొన్న ఉద్రిక్తతల వల్ల పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉందని, అది భవిష్యత్తులో అమ్మకాలపై కొంత ప్రభావం చూపవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, కస్టమర్లకు నచ్చిన మోడళ్లను, మెరుగైన సర్వీస్‌ను అందిస్తూ మార్కెట్ లీడర్‌గా కొనసాగుతామని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story