Maruti Suzuki : భారత ఆటో మార్కెట్లో మారుతి సుజుకి కొత్త హవా.. త్వరలోనే 4 పవర్ఫుల్ ఎస్‌యూవీల ఎంట్రీ
త్వరలోనే 4 పవర్ఫుల్ ఎస్‌యూవీల ఎంట్రీ

Maruti Suzuki : భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తన మోడళ్లను అప్‌డేట్ చేస్తూ మార్కెట్లో దూసుకుపోతోంది. ఇటీవల మార్కెట్లోకి ఫ్లెక్స్ ఫ్యూయల్ వ్యాగన్ఆర్ కారును తెచ్చిన ఈ ఆటోమొబైల్ దిగ్గజం.. ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న ఎస్‌యూవీ సెగ్మెంట్‌ను పూర్తిగా ఆక్యుపై చేయడానికి ఒక మెగా ప్లాన్ సిద్ధం చేసింది. రాబోయే రోజుల్లో నాలుగు సరికొత్త, అప్‌డేటెడ్ ఎస్‌యూవీ కార్లను లాంచ్ చేయడానికి లైన్ క్లియర్ చేసింది. ఆ క్రేజీ కార్ల వివరాలు, వాటిలో రాబోతున్న మార్పులు ఏంటో వివరంగా తెలుసుకుందాం.
కొత్త రూపుతో రాబోతున్న మారుతి బ్రెజ్జా
మారుతి సుజుకి కార్లలో అత్యంత పాపులర్ అయిన మోడల్ బ్రెజ్జా. ఈ సబ్-4 మీటర్ ఎస్‌యూవీని కంపెనీ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ రూపంలో తీసుకురాబోతోంది. గత కొన్ని రోజులుగా ఈ కారుకు సంబంధించిన టెస్ట్ మోడల్స్ రోడ్లపై ట్రయల్స్ రన్ చేస్తూ కనిపించాయి. కారు బయటి డిజైన్‌లో పెద్దగా మార్పులు లేకపోయినా.. కొత్త బంపర్లు, అప్‌డేటెడ్ ఫాగ్ ల్యాంప్స్, సరికొత్త అలాయ్ వీల్స్‌ను జోడించబోతున్నారు. కారు లోపల ప్రీమియం ఫీచర్లు అయిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు రానున్నాయి.
బ్రెజ్జాలో బిగ్ చేంజ్.. తగ్గనున్న జీఎస్టీ
ఈ కొత్త బ్రెజ్జాలో రాబోతున్న అతిపెద్ద మార్పు దాని ఇంజిన్. ప్రస్తుతం ఈ కారులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వస్తోంది. అయితే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ఫ్రాంక్స్ కారులో వాడే 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను పెట్టబోతున్నారు. ఇంజిన్ సైజ్ తగ్గడం వల్ల ఈ కారుపై పడే జీఎస్టీ టాక్స్ 40 శాతం నుంచి ఏకంగా 18 శాతానికి తగ్గిపోతుంది. దీనివల్ల కారు ధర కస్టమర్లకు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు స్పేస్ కలిసివచ్చేలా అండర్-బాడీ సీఎన్‌జీ ట్యాంక్‌ను కూడా ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం బ్రెజ్జా ధర రూ. 8.25 లక్షల నుంచి రూ. 13.01 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండగా.. కొత్త మోడల్ ధరలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.
మైలేజ్ సునామీ.. మారుతి ఫ్రాంక్స్ హైబ్రిడ్
మారుతి సుజుకి పోర్ట్‌ఫోలియోలో లాంచ్ అయిన అతి తక్కువ సమయంలోనే బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది ఫ్రాంక్స్ క్రాస్‌ఓవర్. ఇప్పుడు ఈ కారుకు ఒక పెద్ద అప్‌డేట్ ఇవ్వడానికి కంపెనీ రెడీ అయింది. కొత్త డిజైన్ చేసిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు, సరికొత్త ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, టెయిల్‌లైట్లు, కొత్త అలాయ్ వీల్స్‌తో ఈ కారు రాబోతోంది. కేబిన్ లోపల లెవెల్ 2 అడాస్ (ADAS) సేఫ్టీ టెక్నాలజీ, వెంటిలేటెడ్ సీట్లు ఉండబోతున్నాయి. అన్నింటికంటే హైలైట్ ఏంటంటే.. ఇందులో స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను వాడుతున్నారు. ఇందులో ఉండే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కేవలం జనరేటర్‌లా పనిచేస్తూ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది.. ఆ బ్యాటరీ ఇచ్చే ఎలక్ట్రిక్ పవర్‌తో కారు చక్రాలు నడుస్తాయి. దీనివల్ల కారు నెక్స్ట్ లెవెల్ మైలేజ్ ఇవ్వనుంది.
పండుగ సీజన్‌లో గ్రాండ్ విటారా ఫేస్‌లిఫ్ట్
మారుతికి మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మంచి గుర్తింపు తెచ్చిన గ్రాండ్ విటారా కూడా సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో లాంచ్ కాబోతోంది. ఈ ఏడాది పండుగ సీజన్ (దసరా, దీపావళి) నాటికి ఈ కారు మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇందులో కొత్త ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్లు, అప్‌డేటెడ్ ఎల్‌ఈడీ లైటింగ్, 17 ఇంచుల స్టైలిష్ అలాయ్ వీల్స్ ఉండబోతున్నాయి. కారు లోపల 10.1 ఇంచుల పెద్ద ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి లెవెల్ 2 అడాస్ సేఫ్టీ ఫీచర్లు ఇస్తున్నారు. ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు లేకుండా మైల్డ్-హైబ్రిడ్, స్ట్రాంగ్-హైబ్రిడ్, సీఎన్‌జీ ఆప్షన్లలో ఇది లభించనుంది.
పెద్ద ఫ్యామిలీస్ కోసం గ్రాండ్ విటారా 7-సీటర్
చివరిగా.. మారుతి సుజుకి తన ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా గ్రాండ్ విటారా బేస్డ్ సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీని తయారు చేస్తోంది. ఆటోమొబైల్ మార్కెట్లో దీనికి 'Y17' అనే కోడ్‌నేమ్ పెట్టారు. ఇప్పటికే రోడ్లపై టెస్టింగ్ చేస్తూ దొరికిపోయిన ఈ కారులో పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, 360-డిగ్రీ కెమెరా, హెడ్-అప్ డిస్‌ప్లే (HUD), లెవెల్ 2 అడాస్, స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లను ఇవ్వబోతున్నారు. ఈ 7-సీటర్ కారు కూడా గ్రాండ్ విటారా లాగే మైల్డ్-హైబ్రిడ్, స్ట్రాంగ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో రానుంది. ఈ కారును కూడా ఈ ఏడాది పండుగ సీజన్ నాటికే లాంచ్ చేయడానికి మారుతి వేగంగా అడుగులు వేస్తోంది.

