Maruti Suzuki : మైలేజ్ ప్రియులకు మారుతి సుజుకి బంపర్ ఆఫర్.. మార్కెట్లోకి 5 సరికొత్త హైబ్రిడ్ కార్లు
మార్కెట్లోకి 5 సరికొత్త హైబ్రిడ్ కార్లు

Maruti Suzuki : భారతదేశంలో పర్యావరణహిత, ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి రాబోయే ఐదేళ్లలో సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి తెచ్చి, హైబ్రిడ్ కార్ల విభాగంలో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఇందుకోసం కంపెనీ సొంతంగా స్ట్రాంగ్ హైబ్రిడ్ (కోడ్‌నేమ్: HEV) పవర్‌ట్రెయిన్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. ప్రీమియం, పెద్ద సైజు వాహనాల కోసం టయోటా సంస్థకు చెందిన సిరీస్-పారలల్ హైబ్రిడ్ సిస్టమ్‌ను కొనసాగిస్తూనే, సామాన్యులు కొనే బడ్జెట్ కార్లలో మారుతి తన స్వంత హైబ్రిడ్ పవర్‌ను ఉపయోగించనుంది.
35 కిమీ మైలేజ్‌తో రానున్న సరికొత్త ఫ్రాంక్స్
మీడియా నివేదికల ప్రకారం.. మారుతి సుజుకి స్వంతంగా తయారు చేసిన సిరీస్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో రాబోతున్న మొట్టమొదటి మోడల్ మారుతి ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్. ఈ క్రేజీ కార్ 2027లో మార్కెట్లోకి లాంచ్ కానుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న టయోటా హైబ్రిడ్ సిస్టమ్స్ చాలా ఖరీదైనవి. కానీ మారుతి అభివృద్ధి చేసిన ఈ కొత్త టెక్నాలజీ అత్యంత చౌకైనది కావడంతో కార్ల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండనున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఈ సరికొత్త సిస్టమ్ ద్వారా ఫ్రాంక్స్ కారు లీటరుకు ఏకంగా 35 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఎలా పనిచేస్తుంది ఈ సరికొత్త హైబ్రిడ్ ఇంజిన్?
మారుతి సుజుకి తీసుకురాబోయే ఈ సరికొత్త హై-ఎండ్ హైబ్రిడ్ కార్లలో Z12E సిరీస్‌కు చెందిన 3-సిలిండర్ పవర్‌ఫుల్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించనున్నారు. ఈ సరికొత్త సెటప్‌లో, చిన్న పెట్రోల్ ఇంజిన్ నేరుగా కారు చక్రాలను తిప్పకుండా కేవలం ఒక జనరేటర్‌లాగా మాత్రమే పనిచేస్తుంది. ఇది కారులో ఉండే 1.5kWh నుండి 2kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను నిరంతరం చార్జ్ చేస్తుంది లేదా ఎలక్ట్రిక్ మోటారుకు పవర్ సప్లై చేస్తుంది. దీనివల్ల ఇంధనం చాలా తక్కువగా ఖర్చవుతుంది. ఇదే అడ్వాన్స్‌డ్ హైబ్రిడ్ ఇంజిన్‌ను 2027లో రాబోయే నెక్స్ట్ జనరేషన్ మారుతి బలేనోలో కూడా వాడనున్నారు.
ఈ ఏడాది చివరలోనే కొత్త గ్రాండ్ విటారా, 7-సీటర్ ఎస్యూవీ
మారుతి సుజుకి ప్రస్తుతం తన మోస్ట్ పాపులర్ మోడల్ గ్రాండ్ విటారా ఫేస్‌లిఫ్ట్, దాని ఆధారంగా రూపొందుతున్న సరికొత్త 7-సీటర్ ఎస్యూవీని ఇండియన్ రోడ్లపై నిరంతరం టెస్టింగ్ చేస్తోంది. ఈ రెండు మోడళ్లు 2026 చివరి నాటికి మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొత్త గ్రాండ్ విటారా ఫేస్‌లిఫ్ట్ లో లుక్స్ పరంగా స్వల్ప మార్పులు, ఇంటీరియర్ లో కొన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లను అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఇక కొత్తగా వచ్చే 7-సీటర్ ఎస్యూవీ పూర్తిగా గ్రాండ్ విటారా ప్లాట్‌ఫారమ్, ఇంజిన్ ఫీచర్లపైనే పనిచేస్తుంది, అయితే ఇది 5-సీటర్ మోడల్ కంటే పొడవుగా ఉండి, లోపల ఎక్కువ స్థలాన్ని (బూట్ స్పేస్) ఆఫర్ చేస్తుంది.
మారుతి ఇన్విక్టో వేరియంట్లలో మార్పులు
మారుతి సుజుకి లైనప్‌లోనే అత్యంత లగ్జరీ, ఖరీదైన కారుగా పేరు తెచ్చుకున్న మారుతి ఇన్విక్టోలో కూడా కంపెనీ కీలక మార్పులు చేయబోతోంది. మనకు తెలిసినట్లుగా ఇన్విక్టో కారు పూర్తిగా టోయోటా ఇన్నోవా హైక్రాస్ మోడల్ ఆధారంగా రూపొందింది. అయితే 2027 నాటికి ఇన్విక్టో ఎంపీవీలో కొన్ని తక్కువ స్పెసిఫికేషన్లు, తక్కువ ధర కలిగిన సరికొత్త హైబ్రిడ్ వేరియంట్‌లను ప్రవేశపెట్టాలని మారుతి ప్లాన్ చేస్తోంది. దీనివల్ల లగ్జరీ హైబ్రిడ్ కారును తక్కువ బడ్జెట్ లోనే సొంతం చేసుకునే అవకాశం కస్టమర్లకు లభిస్తుంది.

