Maruti Suzuki : భారతీయ ఆటోమొబైల్ రంగానికి అప్రతిహత మహారాజుగా వెలుగొందుతున్న మారుతి సుజుకి విక్రయాలలో సరికొత్త చరిత్ర సృష్టించింది. 2026 మే నెలలో ఈ కార్ల దిగ్గజం ఎవరూ ఊహించని రీతిలో ఆల్-టైమ్ బెస్ట్ మంత్లీ సేల్స్ పర్ఫార్మెన్స్‌ను నమోదు చేసి పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. తన ప్యాసింజర్ కార్లు, ఎస్‌యూవీ మోడళ్ల అద్భుతమైన డిమాండ్ కారణంగా కంపెనీ ఈ ఘనత సాధించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాలలో భారీ వృద్ధి కనిపించింది. గడచిన మే నెలలో మారుతి సుజుకి సంస్థ మొత్తం 2,42,688 వాహనాలను విక్రయించింది. 2025 మే నెలలో అమ్ముడైన 1,80,077 యూనిట్లతో పోలిస్తే ఇది ఏకంగా 34.8 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఒకే ఒక్క నెలలో ఈ స్థాయిలో కార్లను అమ్మి రికార్డు సృష్టించడం మారుతి సుజుకి చరిత్రలోనే ఇదే తొలిసారి.

మన దేశీయ మార్కెట్ లో మారుతి సుజుకి బ్రాండ్ ఇమేజ్ ఎంత బలంగా ఉందో ఈ గణాంకాలు చూస్తేనే అర్థమవుతుంది. డొమెస్టిక్ ప్యాసింజర్ వెహికల్ విభాగంలో కంపెనీ గత నెలలో 1,90,337 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో అమ్ముడైన 1,35,962 యూనిట్లతో పోలిస్తే ఇది 40 శాతం భారీ గ్రోత్. వీటికి కమర్షియల్ వాహనాలు మరియు ఇతర ఓఈఎమ్ సప్లైలను కూడా జోడిస్తే.. మారుతి మొత్తం దేశీయ విక్రయాలు 2,00,774 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది ఈ సంఖ్య కేవలం 1,48,858 గా మాత్రమే ఉంది.

మారుతి సుజుకి సాధించిన ఈ అసాధారణ వృద్ధిలో మెజారిటీ వాటా యూటిలిటీ వెహికల్స్ అనగా ఎస్‌యూవీ, ఎమ్‌పీవీ సెగ్మెంట్‌దేనని చెప్పాలి. మార్కెట్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న బ్రెజ్జా, ఎర్టిగా, సరికొత్త ఇ-విటారా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, ఇన్విక్టో, జిమ్నీ, ఎక్స్ఎల్6 వంటి మోడళ్లు మే నెలలో విపరీతంగా అమ్ముడై కంపెనీ ఖాతాలో భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. చిన్న కార్లు, హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మారుతి సుజుకికి పోటీ ఇచ్చే వారే లేరని మరోసారి రుజువైంది. స్విఫ్ట్, బాలెనో, వ్యాగన్ఆర్, డిజైర్, సెలెరియో, ఇగ్నిస్, సియాజ్ వంటి మోడళ్లు అన్నీ కలిసి 2026 మే నెలలో ఏకంగా 97,830 యూనిట్ల అమ్మకాలను జరిపాయి. గతేడాది ఇదే సమయంలో ఈ సెగ్మెంట్ లో 68,736 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

మరోవైపు ఎంట్రీ లెవల్ కార్లయిన ఆల్టో, ఎస్-ప్రెస్సో మోడళ్లు రెండు కలిపి 16,275 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇక నిత్యం డిమాండ్ ఉండే మారుతి ఈకో వ్యాన్ కూడా గతేడాది అమ్మకాలైన 12,327 యూనిట్ల నుంచి స్వల్పంగా వృద్ధి చెంది 13,240 యూనిట్ల అమ్మకాలతో దూసుకుపోయింది. మారుతి సుజుకి కార్ల క్రేజ్ కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు, విదేశీ మార్కెట్లలోనూ ఈ కార్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. 2026 మే నెలలో కంపెనీ రికార్డు స్థాయిలో 41,914 యూనిట్లను విక్రయించి ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. 2025 మే నెలలోని 31,219 యూనిట్లతో పోలిస్తే ఇది 34.3 శాతం అద్భుతమైన వృద్ధిని సూచిస్తుంది.

ప్రస్తుత కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 లోని మొదటి రెండు నెలల్లోనే (ఏప్రిల్ - మే) మారుతి సుజుకి ఏకంగా 4,82,334 యూనిట్ల మార్కును దాటేసింది. గతేడాది ఇదే రెండు నెలల కాలంలో ఈ విక్రయాల సంఖ్య కేవలం 3,59,868 యూనిట్లు మాత్రమే. ఈ రెండు నెలల్లో దేశీయ ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 3,78,041 యూనిట్లు కాగా.. ఎగుమతులు 81,968 యూనిట్లుగా నమోదయ్యాయి. దీన్ని బట్టి హ్యాచ్‌బ్యాక్, సెడాన్, ఎస్‌యూవీ ఇలా ఏ సెగ్మెంట్ చూసినా మన దేశంలో మారుతి సుజుకి బ్రాండ్‌కు ఎదురులేదని స్పష్టమవుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story