Maruti Suzuki : 5,500 సర్వీస్ టచ్పాయింట్లతో మారుతి సుజుకి సరికొత్త రికార్డు
మారుతి సుజుకి సరికొత్త రికార్డు

Maruti Suzuki : భారతదేశంలో నంబర్ 1 కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, తమ డీలర్ల మద్దతుతో ఒక కొత్త రికార్డును నెలకొల్పింది. దేశవ్యాప్తంగా తమ 5,500వ సర్వీస్ టచ్‌పాయింట్‌ను ప్రారంభించినట్లు మారుతి సుజుకి ప్రకటించింది. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఉన్న ఈ కొత్త సర్వీస్ సెంటర్‌ను కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామ్ సురేష్ అకెలా, యాసుహిరో కవాయి ప్రారంభించారు.
ఉదయపూర్‌లో కొత్త వర్క్‌షాప్‌తో కలిపి మారుతి సుజుకి సర్వీస్ నెట్‌వర్క్‌లో సర్వీస్ బేల సంఖ్య దాదాపు 40,000కు చేరుకుంది. ఈ పెద్ద నెట్‌వర్క్ ద్వారా సంవత్సరానికి 3 కోట్ల మంది కస్టమర్ల వాహనాలకు సర్వీసింగ్ చేయగల సామర్థ్యం ఉంది. ఆర్థిక సంవత్సరం 2024-25లో మారుతి 2.7 కోట్ల కంటే ఎక్కువ వాహనాలకు సర్వీసింగ్ చేసింది. ఇది ఒక ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు చేసిన అత్యధిక సంఖ్య.
కొత్త సర్వీస్ టచ్‌పాయింట్‌ను కస్టమర్లకు అంకితం చేస్తూ, మారుతి సుజుకి మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హిసాషి తకేయుచి మాట్లాడుతూ.. "కొత్త కారు కొనేటప్పుడు చాలా మంది కస్టమర్లు తమకు దగ్గర్లో, సౌకర్యవంతంగా ఉండే సర్వీస్ వర్క్‌షాప్ ఉండాలని చూస్తారు. ఇది సరసమైన ధరకు నమ్మదగిన సర్వీస్‌ను అందిస్తూ, వారికి పూర్తి మనశ్శాంతిని ఇవ్వాలి. ఈ అవసరాన్ని తీర్చడానికి మేము మా డీలర్ల భాగస్వామ్యంతో 2,764 నగరాల్లో 5,500 సర్వీస్ టచ్‌పాయింట్‌లను ఏర్పాటు చేయగలిగాము" అని అన్నారు.
ఆర్థిక సంవత్సరం 2024-25లో మేము 460 కొత్త సర్వీస్ టచ్‌పాయింట్‌లను చేర్చాము, అంటే ప్రతిరోజూ ఒకటి కంటే ఎక్కువ టచ్‌పాయింట్‌లను ప్రారంభించాము. ఈ ప్రయత్నాలను కొనసాగించాలని మేము ప్లాన్ చేస్తున్నాము. ఈ ఆర్థిక సంవత్సరంలో 500 కొత్త సర్వీస్ టచ్‌పాయింట్‌లను జోడించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం, వాటిలో ఇప్పటికే 91 ఏర్పాటు చేశాం" అని తెలిపారు.
