Maruti Suzuki: మారుతి నుంచి తొలి 7-సీటర్ ఎలక్ట్రిక్ కారు.. రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించిన మోడల్
రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించిన మోడల్

Maruti Suzuki: భారతీయ ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తున్న మారుతి సుజుకీ సంస్థ త్వరలోనే ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి సంచలనాత్మకంగా అడుగుపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. కంపెనీ రూపొందిస్తున్న మొట్టమొదటి 7-సీటర్ ఎలక్ట్రిక్ మల్టీ ప్రపస్ వెహికల్ ఇటీవల రోడ్లపై పరీక్షలు నిర్వహిస్తుండగా మళ్లీ కనిపించింది. ప్రస్తుతం YMC అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చేస్తున్న ఈ వాహనం కొత్త స్పై చిత్రాలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. వీటి ఆధారంగా వాహనం వెనుక భాగం డిజైన్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆటోమొబైల్ వర్గాల నివేదికల ప్రకారం ఈ ఎలక్ట్రిక్ కారు 2027 నాటికి భారత మార్కెట్లో అధికారికంగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఆకర్షణీయమైన బ్యాక్ డిజైన్
తాజాగా విడుదలైన స్పై ఫొటోల ప్రకారం.. మారుతి వైఎమ్‌సీ ఎలక్ట్రిక్ కారు వెనుక భాగంలో అనుసంధానించబడిన టెయిల్ లైట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. స్క్వేర్ షేప్ డిజైన్‌తో కూడిన టెయిల్‌గేట్, శార్క్ ఫిన్ యాంటెన్నా, హై-మౌంట్ స్టాప్ ల్యాంప్, వెనుక వైపర్-డిఫాగర్ వంటి ఆధునిక హంగులు ఉన్నాయి. ఈ నూతన వాహనాన్ని మారుతి ఈ-విటారాలో ఉపయోగించిన అత్యాధునిక Heartect-e లేదా 27PL ప్లాట్‌ఫామ్‌పైనే తయారు చేస్తున్నట్లు సమాచారం. దీనివల్ల రెండు వాహనాల టెక్నాలజీ, డిజైన్ అంశాలలో పోలికలు ఉండే అవకాశం ఉంది. ఇందులో 18 అంగుళాల అలాయ్ వీల్స్, ఎల్ఈడీ లైటింగ్ అమర్చనున్నారు.
కేబిన్ సౌకర్యాలు అలాగే లేటెస్ట్ ఫీచర్లు
ఈ నూతన ఎలక్ట్రిక్ ఎంపీవీ కేబిన్ వివరాలు ఇంకా బయటకు రానప్పటికీ, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా 7-సీటర్ తో పాటు 5-సీటర్ ఆప్షన్లో కూడా ఇది లభించే అవకాశం ఉంది. డ్రైవింగ్ అనుభవాన్ని సురక్షితంగా, సులభంగా మార్చేందుకు లెవెల్-2 అడాస్ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, డిజిటల్ టిఎఫ్టి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, లగ్జరీ ఇంటీరియర్స్ వంటి ఫీచర్లు ఇందులో అందించవచ్చు. మారుతి తమ సరికొత్త టెక్నాలజీలను ఈ కారులో జోడించడం ద్వారా ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది.
బ్యాటరీ సామర్థ్యం, 500 కిలోమీటర్ల రేంజ్
పవర్‌ట్రెయిన్ వివరాలను పరిశీలిస్తే, ఈ వాహనంలో 61kWh కెపాసిటీ గల పవర్ ఫుల్ బ్యాటరీ ప్యాక్ ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. ఫ్రంట్-వీల్ డ్రైవ్ మోటార్‌తో వచ్చే ఈ కారు దాదాపు 172bhp పవర్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేయగలదని భావిస్తున్నారు. ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ చేస్తే దాదాపు 500 కిలోమీటర్ల దూర ప్రయాణం చేయవచ్చని అంచనా వేస్తున్నారు. దీర్ఘకాలిక ప్రయాణాలకు అనువుగా ఉండేలా వేగవంతమైన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా ఇందులో జోడించనున్నారు. ప్రొడక్షన్ వేగవంతం అవ్వడంతో రాబోయే రోజుల్లో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.

