2 లక్షల కార్ల వెయిటింగ్ కు చెక్ పెట్టేందుకు రెడీ

Maruti Suzuki : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ప్రస్తుతం ఒక విచిత్రమైన సమస్యను ఎదుర్కొంటోంది. అదేమిటంటే.. కార్లకు విపరీతమైన డిమాండ్ ఉండటం. వినడానికి ఇది సంతోషకరమైన వార్తే అయినా, కంపెనీకి మాత్రం ఇది పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతం మారుతి సుజుకి వద్ద దాదాపు 2 లక్షల కార్ల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. అంటే లక్షలాది మంది కస్టమర్లు తమ అభిమాన కారు ఎప్పుడు డెలివరీ అవుతుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించేందుకు కంపెనీ ఇప్పుడు నడుం బిగించింది. వచ్చే నెల నుంచి ఉత్పత్తిని భారీగా పెంచాలని నిర్ణయించుకుంది.

మారుతి సుజుకి తన వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏకంగా 5 లక్షల యూనిట్లకు పెంచేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఈ విస్తరణ రెండు దశల్లో జరగనుంది. మొదటి దశలో హర్యానాలోని ఖార్‌ఖోడా ప్లాంట్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రెండో అసెంబ్లీ లైన్‌ను ప్రారంభించనున్నారు. దీనివల్ల ఏటా 2.5 లక్షల అదనపు కార్లు తయారవుతాయి. రెండో దశలో గుజరాత్‌లోని హన్సల్‌పూర్ ప్లాంట్‌లో నాలుగో ప్రొడక్షన్ లైన్‌ను జోడిస్తారు. దీనివల్ల మరో 2.5 లక్షల యూనిట్ల సామర్థ్యం పెరుగుతుంది. ఈ రెండు ప్లాంట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, ప్రతి నెలా అదనంగా 20,000 కార్లు మార్కెట్లోకి వస్తాయి.

ఉత్పత్తిని ఇంతలా పెంచడానికి ప్రధాన కారణం ఎస్‌యూవీ విభాగంలో వస్తున్న 12 శాతం వృద్ధి, బుకింగ్స్‌లో కనిపిస్తున్న 20 శాతం పెరుగుదల. ప్రస్తుతం మారుతి ప్రతి నెలా దాదాపు 2.30 లక్షల కార్లను తయారు చేస్తోంది. ఇందులో 1.80 లక్షల యూనిట్లు మన దేశీ మార్కెట్ కోసం కాగా, మిగిలిన 50,000 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేస్తోంది. అయితే డీలర్ల వద్ద స్టాక్ కేవలం 12 రోజులకు సరిపడా మాత్రమే ఉంది. సాధారణంగా ఇండస్ట్రీలో 30 రోజుల స్టాక్ ఉండాలి. కానీ డిమాండ్ ఎక్కువగా ఉండటంతో డీలర్ పాయింట్ల వద్ద కార్లు రాకముందే అమ్ముడైపోతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో కూడా మారుతి సుజుకి హవా కొనసాగుతోంది. ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాల్లో మన కార్లకు విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుజుకి మోటార్ కార్పొరేషన్ అమ్మకాలలో మన దేశం నుంచే దాదాపు 56 శాతం వాటా వస్తోంది. దీన్ని బట్టి గ్లోబల్ స్థాయిలో మారుతి సుజుకికి భారత్ ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఉత్పత్తి పెంచకపోతే, వెయిటింగ్ పీరియడ్ భరించలేక కస్టమర్లు వేరే కంపెనీల వైపు వెళ్లే ప్రమాదం ఉందని గ్రహించిన మారుతి, హ్యాచ్‌బ్యాక్ నుంచి ఎస్‌యూవీల వరకు అన్ని సెగ్మెంట్లలో ప్రొడక్షన్ స్పీడ్ పెంచాలని ఫిక్స్ అయ్యింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story