Maruti Suzuki : మారుతి సుజుకికి కన్స్యూమర్ కోర్టు గట్టి షాక్.. కస్టమర్‌కు కొత్త కారు ఇవ్వాలని సంచలన తీర్పు
కస్టమర్‌కు కొత్త కారు ఇవ్వాలని సంచలన తీర్పు

Maruti Suzuki : ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకి ఇండియాకు వినియోగదారుల ఫోరమ్ (కన్స్యూమర్ కోర్టు) నుంచి ఊహించని షాక్ తగిలింది. E20 పెట్రోల్ వాడకం కారణంగా కారు ఇంజన్ పాడైపోయిందంటూ ఒక కస్టమర్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సంచలన తీర్పు ఇచ్చింది. బాధితుడికి 45 రోజుల్లోగా అదే మోడల్‌కు చెందిన సరికొత్త E20 కంపాటబుల్ కారును ఉచితంగా అందజేయాలని కోర్టు మారుతి సంస్థను ఆదేశించింది.
45 రోజుల్లోగా కొత్త కారు ఇవ్వాలి
కోర్టు తన ఆదేశాల్లో కస్టమర్‌కు జరిగిన నష్టానికి కంపెనీ బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. నిర్ణీత 45 రోజుల గడువులోగా కంపెనీ కస్టమర్‌కు కొత్త కారును ఇవ్వకపోతే, ఆ వాహనం అసలు ధరతో పాటు ఇతర ఖర్చులను కలుపుకుని మొత్తం రూ.20,50,494 (రూ.20.50 లక్షలు) బాధితుడికి తిరిగి చెల్లించాల్సి ఉంటుందని కోర్టు గట్టిగా హెచ్చరించింది. కస్టమర్ల హక్కుల రక్షణ విషయంలో కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది.
కోర్టు తీర్పుపై మారుతి సుజుకి రియాక్షన్
వినియోగదారుల కోర్టు ఇచ్చిన ఈ సంచలన తీర్పుపై మారుతి సుజుకి ఇండియా అధికారికంగా స్పందించింది. రాయ్‌పూర్ జిల్లా కోర్టు ఇచ్చిన ఆర్డర్ తమ దృష్టికి వచ్చిందని కంపెనీ తెలిపింది. అయితే ఈ ఆదేశాలను తాము అంగీకరించడం లేదని, చట్టప్రకారం దీనిని ఉన్నత న్యాయస్థానంలో (హైకోర్టు లేదా జాతీయ కన్స్యూమర్ ఫోరమ్) సవాలు చేయనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. తమ కంపెనీ ఎల్లప్పుడూ కస్టమర్ల భద్రత, నాణ్యమైన ఇంజనీరింగ్ ప్రమాణాలకు కట్టుబడి ఉంటుందని పేర్కొంది.
పెట్రోల్‌లో కల్తీ ఉన్నట్లు ఆధారాలు దొరికాయి
ఈ వివాదంపై మారుతి సుజుకి తన వాదనను బలంగా వినిపించింది. సదరు కస్టమర్ వినియోగించిన కారు పూర్తిగా E20 ఇంధనానికి అనుకూలమైనదేనని, ఈ విషయాన్ని కారుతో పాటు ఇచ్చే ఓనర్ మాన్యువల్‌లో కూడా స్పష్టంగా పేర్కొన్నామని కంపెనీ తెలిపింది. కారు ఇంజన్ పాడవడానికి కంపెనీ లోపం కారణం కాదని, ఆ వాహనం నుండి సేకరించిన ఇంధన నమూనాలను పరిశీలించగా అందులో కల్తీ జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయని మారుతి వాదించింది. కోర్టు ఈ కీలకమైన వాస్తవాలను, సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా తీర్పు ఇచ్చిందని కంపెనీ ఆరోపించింది.
అసలు ఏంటి ఈ E20 పెట్రోల్ వివాదం?
బాధిత కస్టమర్ కథనం ప్రకారం.. అతను తన మారుతి కారులో E20 పెట్రోల్ వేయించడం ప్రారంభించినప్పటి నుంచి కారు ఇంజన్‌లో సమస్యలు మొదలయ్యాయి. కారు పికప్ తగ్గిపోవడంతో పాటు మైలేజ్ కూడా ఘోరంగా పడిపోయింది. ఈ విషయమై కస్టమర్ పలుమార్లు కంపెనీ అథరైజ్డ్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి రిపేర్లు చేయించినప్పటికీ ఇంజన్ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. కంపెనీ వాళ్లు సమస్యను శాశ్వతంగా పరిష్కరించకపోవడంతో విసిగిపోయిన కస్టమర్, చివరికి న్యాయం కోసం వినియోగదారుల కోర్టును ఆశ్రయించగా ఈ తీర్పు వెలువడింది.

