అదిరిపోయే ఫీచర్లతో విటారా కంటే తక్కువ ధరకే కొత్త కారు

Maruti Escudo : భారతదేశంలో అత్యధిక కార్లను విక్రయించే కంపెనీ మారుతి సుజుకి త్వరలో ఒక పెద్ద సంచలనం సృష్టించబోతోంది. మారుతి సెప్టెంబర్ 3న ఒక కొత్త కారును లాంచ్ చేయనుంది. అయితే, ఇది ఏ మోడల్ అనేది కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, ఇది మారుతి ఎస్క్యూడో అనే కాంపాక్ట్ ఎస్‌యూవీ కావచ్చని అందరూ భావిస్తున్నారు. ఈ కారు మార్కెట్లోకి వస్తే ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఎస్క్యూడోను ప్రీమియం డీలర్‌షిప్ అయిన అరీనా ద్వారా విక్రయిస్తారు. దీని ప్లాట్‌ఫారమ్, ఫీచర్లు గ్రాండ్ విటారాను పోలి ఉంటాయని అంచనా.

ఎస్క్యూడో గురించిన అధికారిక సమాచారం లాంచ్ సమయంలోనే వెల్లడి అవుతుంది. ఈ కొత్త మారుతి ఎస్‌యూవీ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో బ్రెజ్జా, గ్రాండ్ విటారా మధ్య స్థానంలో ఉంటుంది. దీని ధరలు ఈ రెండు కార్ల మధ్య ఉండే అవకాశం ఉంది. అయితే, దీనిని గ్రాండ్ విటారాకు మరింత తక్కువ ధరతో దానికి ప్రత్యామ్నాయంగా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

కొత్త మారుతి ఎస్‌యూవీ ఇంజిన్ వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. అయితే, ఇందులో గ్రాండ్ విటారాలో ఉన్న 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ ఇవ్వవచ్చని భావిస్తున్నారు. మారుతి సుజుకి ఎస్క్యూడో ధరను తక్కువగా ఉంచడానికి, గ్రాండ్ విటారాలో కనిపించే 1.5 లీటర్ హైబ్రిడ్ ఇంజిన్‌ను ఇందులో ఇవ్వకపోవచ్చు. సైజ్ విషయానికి వస్తే, కొత్త మారుతి మిడ్‌సైజ్ ఎస్‌యూవీ బ్రెజ్జా కంటే పెద్దదిగా ఉంటుంది. దీని మొత్తం పొడవు 4,330 మి.మీ నుండి 4,365 మి.మీ మధ్య ఉంటుందని అంచనా. ఇది గ్రాండ్ విటారా (4,345 మి.మీ) కంటే పొడవుగా ఉంటుంది. ఎస్క్యూడోలో గ్రాండ్ విటారా కంటే ఎక్కువ బూట్ స్పేస్ ఉంటుందని కూడా అంచనాలు ఉన్నాయి.

ఫీచర్ల విషయానికి వస్తే 2025 ఎస్క్యూడోలో వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సన్‌రూఫ్, క్లైమేట్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు ఉంటాయని అంచనా. మారుతి ఎస్క్యూడో ఎస్‌యూవీలో భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో ఏబీఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు స్టాండర్డ్‌గా లభించవచ్చు. టాప్ మోడల్స్‌లో 360-డిగ్రీ కెమెరా, ADAS ఆప్షన్ కూడా ఇవ్వవచ్చని తెలుస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story