Maruti Suzuki: మారుతి ఈవీ ధమాకా..500 కిమీ రేంజ్‌తో తక్కువ ధరలోనే 7-సీటర్ ఎలక్ట్రిక్ కార్
7-సీటర్ ఎలక్ట్రిక్ కార్

Maruti Suzuki: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో అతిపెద్ద ధమాకాకు శ్రీకారం చుట్టింది. రాబోయే మూడేళ్లలో ఏకంగా తొమ్మిది కొత్త కార్లను రంగంలోకి దింపేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. వీటిలో ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తున్న అత్యంత చౌకైన 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎమ్‌పీవీ ప్రత్యేక వివరాలు చూద్దాం.
రూ.14 లక్షల ప్రారంభ ధర
భారతీయ కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి YMC కోడ్‌నేమ్‌తో ఈ కొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ కారును రూపుదిద్దుతోంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 14 లక్షలుగా ఉండే అవకాశం ఉంది. టాప్ మోడల్ ధర రూ. 18 లక్షల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ బడ్జెట్‌లో 7 సీట్ల సామర్థ్యం ఉన్న ఈవీ లభించడం సంచలనమనే చెప్పాలి. ఇదే వేదికపై ఆధారపడి భవిష్యత్తులో టొయోటా కూడా తన సొంత వెర్షన్‌ను తీసుకురానుంది.
సింగిల్ ఛార్జ్‌తో 500+ కిమీ రేంజ్
సాంకేతికత, పనితీరు విషయంలో ఈ కొత్త ఎలక్ట్రిక్ కార్ తన సొంత బ్రాండ్ ఈ-విటారా ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకోనుంది. ఈ-విటారాలో ఉపయోగించిన 49kWh, 61kWh బ్యాటరీ ప్యాక్‌లనే ఇందులోనూ అందించే అవకాశముంది. ఇవి ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే దాదాపు 543 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తాయి. వైఎమ్‌సి బాడీ పరిమాణం కాస్త పెద్దదిగా ఉండటం వల్ల రేంజ్ దాదాపు 500 కిలోమీటర్ల వరకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
విశాలమైన కేబిన్ స్పేస్
లీకైన పిక్చర్స్ పరిశీలిస్తే ఈ 7-సీటర్ కార్ బాక్సీ షేప్‌లో ఎత్తుగా ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఇది కేబిన్ లోపల కూర్చునే ప్రయాణికులకు అద్భుతమైన స్పేస్ ఇస్తుంది. ముందు భాగంలో బంపర్, ఏరోడైనమిక్ అలాయ్ వీల్స్ ఈ-విటారాను పోలి ఉంటాయి. వెనుక భాగంలో అకర్షణీయమైన వర్టికల్ టెయిల్ లైట్లను పొందుపరిచారు. సైడ్ డోర్ హ్యాండిల్స్ సాధారణ శైలిలోనే ఉండి వినియోగానికి ఎంతో సులభంగా ఉంటాయి.
అధునాతన ఇంటీరియర్.. బెస్ట్ సేఫ్టీ ఫీచర్లు
కారు ఇంటీరియర్ కేబిన్ ప్రయాణాన్ని ఎంతో సౌకర్యవంతంగా మార్చేలా ఉంటుంది. 10.1 ఇంచుల పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు 10.25 ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఇందులో ఉండే అవకాశముంది. భద్రత కోసం మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, హిల్-హోల్డ్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్లను అమర్చనున్నారు. 2026 చివరి నాటికి ప్రపంచ మార్కెట్లకు పరిచయమై, 2027 ప్రారంభంలో ఇది భారత రోడ్లపైకి రానుంది.

