Maruti : మారుతి సుజుకికి షాక్..కంపెనీకి తలనొప్పిగా మారిన 5 కార్లు..అవి ఏంటంటే ?
కంపెనీకి తలనొప్పిగా మారిన 5 కార్లు..అవి ఏంటంటే ?

Maruti : మారుతి సుజుకి భారతదేశపు ఆటోమొబైల్ రారాజు అనడంలో సందేహం లేదు. అయితే ఎప్పుడూ వేలల్లో అమ్మకాలు సాధించే ఈ సంస్థకు, కొన్ని మోడళ్లు జనవరి 2026లో కేవలం 2,000 లోపు అమ్మకాలతో నిరాశపరిచాయి. ఇందులో మైలేజ్ కింగ్స్ ఉన్నప్పటికీ, జనం ఎందుకు దూరం పెడుతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
1. మారుతి ఎస్-ప్రెస్సో
మారుతి నుంచి వచ్చిన ఈ చిన్న కారు జనవరిలో కేవలం 1,954 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది. దీని ధర కేవలం రూ.3.70 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. ఈ కారు పెట్రోల్ మోడల్‌లో 24 కిలోమీటర్లు, సిఎన్‌జి మోడల్‌లో ఏకంగా 32.73 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇంత తక్కువ ధర, ఎక్కువ మైలేజీ ఉన్నా కూడా ప్రజలు ఇప్పుడు సేఫ్టీ, డిజైన్ వైపు మొగ్గు చూపుతుండటంతో దీనికి ఆదరణ తగ్గుతోంది.
2. మారుతి ఇగ్నిస్
మారుతి ప్రీమియం నెట్‌వర్క్ నెక్సా ద్వారా విక్రయించే ఇగ్నిస్ కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. గత నెలలో కేవలం 1,902 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దీని ధర రూ.5.35 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. భద్రతా ప్రమాణాల విషయంలో టాటా నెక్సాన్, పంచ్ వంటి కార్ల నుంచి వస్తున్న పోటీని తట్టుకోలేకపోవడం దీనికి ప్రధాన కారణం.
3. మారుతి సెలెరియో
ఒకప్పుడు బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో చక్రం తిప్పిన సెలెరియో గత నెలలో కేవలం 1,501 యూనిట్లకు పరిమితమైంది. ఇది పెట్రోల్‌పై 26 కిలోమీటర్లు, సిఎన్‌జిపై 34.43 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో కస్టమర్లు చిన్న కార్ల కంటే మైక్రో-ఎస్‌యూవీల వైపు (టాటా పంచ్ వంటివి) ఆసక్తి చూపుతుండటం సెలెరియో అమ్మకాలను దెబ్బతీస్తోంది.
4. మారుతి జిమ్నీ
ఎస్‌యూవీ ప్రియులను ఊరించిన జిమ్నీ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. జనవరిలో కేవలం 591 యూనిట్లు మాత్రమే విక్రయించబడ్డాయి. దీని ధర రూ.12.31 లక్షల నుంచి మొదలవుతుంది. మహీంద్రా థార్ వంటి బలమైన పోటీదారులు మార్కెట్లో ఉండటంతో, జిమ్నీ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది.
5. మారుతి ఇన్విక్టో
మారుతి పోర్ట్‌ఫోలియోలో అత్యంత లగ్జరీ కారుగా పేరుగాంచిన ఇన్విక్టో గత నెలలో కేవలం 197 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది. ఇది టయోటా ఇన్నోవా హైక్రాస్‌కు రీబ్యాడ్జ్ వెర్షన్. దీని ధర రూ.24.97 లక్షల నుంచి రూ.28.61 లక్షల వరకు ఉంది. ఇంత భారీ ధర పెట్టి మారుతి లోగోతో కారు కొనడానికి కస్టమర్లు అంతగా ఇష్టపడటం లేదని ఈ గణాంకాలు చెబుతున్నాయి.
కేవలం తక్కువ ధర, ఎక్కువ మైలేజ్ ఉంటే సరిపోదు.. సేఫ్టీ, లుక్స్, కంఫర్ట్ కూడా ఉండాలని నేటి తరం వినియోగదారులు కోరుకుంటున్నారు. మారుతి తన ఎంట్రీ లెవల్ కార్లపై దృష్టి పెట్టకపోతే మున్ముందు ఈ సేల్స్ మరింత తగ్గే అవకాశం ఉంది.

