Diwali Car Offers 2025: దీపావళి బంపర్ ఆఫర్స్.. టాటా, హ్యుందాయ్ కార్లపై రూ.7 లక్షల వరకు భారీ తగ్గింపు
టాటా, హ్యుందాయ్ కార్లపై రూ.7 లక్షల వరకు భారీ తగ్గింపు

Diwali Car Offers 2025: భారతదేశంలో ఈ సంవత్సరం దీపావళి 2025 సందర్భంగా దాదాపు అన్ని ప్రధాన ఆటోమొబైల్ కంపెనీలు టాటా మోటార్స్, హ్యుందాయ్, కియా వంటివి భారీ కార్ల ఆఫర్లను ప్రకటించాయి. మీరు కొత్త కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఇదే బెస్ట్ టైం. ఈసారి కంపెనీలు రూ.5,000 నుండి ఏకంగా రూ.7 లక్షల వరకు పొదుపు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ ఆఫర్‌లలో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్, లాయల్టీ బోనస్, స్క్రాపేజ్ ప్రయోజనాలు వంటివి ఉన్నాయి.
1. టాటా మోటార్స్
టాటా మోటార్స్ సంస్థ దీపావళి 2025 కోసం తమ అత్యంత ప్రజాదరణ పొందిన కార్లపై పలు ఆఫర్లను ప్రకటించింది. కంపెనీ పెట్రోల్, డీజిల్ కార్లు రెండింటిపైనా క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తున్నాయి. టియాగో, టిగోర్, పంచ్, నెక్సాన్, కర్వ్, హారియర్, సఫారీ వంటి మోడళ్లపై రూ.5,000 నుండి రూ.50,000 వరకు ప్రయోజనాలు అందిస్తుంది. అయితే, కొత్తగా వచ్చిన ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ పై మాత్రం ఈసారి ఎలాంటి ఆఫర్‌లు లేవు. పాత వాహనాన్ని ఎక్స్ఛేంజ్ చేసి కొత్త కారు కొనాలనుకునే వారికి ఈ స్కీమ్‌లు మంచి అవకాశం ఇస్తున్నాయి.
2. కియా, హ్యుందాయ్
కియా మోటార్స్ కూడా ఈ పండుగ సీజన్‌లో తమ కస్టమర్‌ల కోసం అద్భుతమైన ఆఫర్‌లను తీసుకొచ్చింది. సోనెట్, సెల్టోస్, కారెన్స్ క్లావిస్, కార్నివాల్ వంటి మోడళ్లపై ఈసారి భారీ తగ్గింపులు ప్రకటించారు. కొన్ని మోడళ్లపై మొత్తం రూ.65,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. ఇది క్యాష్ డిస్కౌంట్ తో పాటు కార్పొరేట్, లాయల్టీ బోనస్‌లను కూడా అందిస్తుంది. ఇక హ్యుందాయ్ విషయానికి వస్తే, చవకైన గ్రాండ్ ఐ10 నియోస్ నుండి లగ్జరీ ఐయోనిక్ 5 వరకు దాదాపు ప్రతి మోడల్‌పై తగ్గింపులు ప్రకటించింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లోని ఐయోనిక్ 5 పై ఏకంగా రూ.7 లక్షల వరకు భారీ పొదుపు చేసుకునే అవకాశం ఉంది. క్రెటా, వెర్నా, వెన్యూ, అల్కాజర్‌లపై కూడా ఎక్స్ఛేంజ్, నగదు తగ్గింపులు లభిస్తున్నాయి. 15 సంవత్సరాల పాత కార్లపై స్క్రాపేజ్ బెనిఫిట్ కూడా హ్యుందాయ్ అందిస్తోంది.
3. హోండా
హోండా కార్స్ ఇండియా కూడా తమ వినియోగదారుల కోసం అద్భుతమైన దీపావళి ఆఫర్లను ప్రకటించింది. కంపెనీ అమేజ్, సిటీ, ఎలివేట్ మోడళ్లపై ఈసారి రూ.1.32 లక్షల వరకు ప్రయోజనాలు అందిస్తుంది. ఈ ఆఫర్‌లలో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బెనిఫిట్స్, కార్పొరేట్ ఆఫర్, ఎక్స్‌టెండెడ్ వారంటీ డిస్కౌంట్ వంటివి ఉన్నాయి. ముఖ్యంగా హోండా సిటీ, ఎలివేట్ మోడళ్లపై ఇచ్చిన ఆఫర్‌లు ఈ సీజన్‌లో అత్యుత్తమమైనవిగా పరిగణించబడుతున్నాయి.
కారు కొనడానికి ఇదే సరైన సమయం
పండుగ సీజన్ ఎల్లప్పుడూ ఆటోమొబైల్ రంగానికి ప్రత్యేకమైనది. ఎందుకంటే, ఈ సమయంలో కంపెనీలు తమ అమ్మకాలను పెంచడానికి అత్యంత భారీ ఆఫర్లను ప్రకటిస్తాయి. ఈ ఏడాది కూడా దీపావళి కార్ ఆఫర్స్ 2025 వినియోగదారులకు అద్భుతమైన పొదుపు అవకాశాన్ని అందిస్తున్నాయి. మీరు కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే అక్టోబర్ 2025 నెల మీకు అత్యంత సరైన సమయం.
