MATTER : మ్యాటర్ సంచలనం..భారత్‌లో తొలి ఏఐ ఆధారిత టూ-వీలర్ ప్లాట్‌ఫారమ్ లాంచ్
భారత్‌లో తొలి ఏఐ ఆధారిత టూ-వీలర్ ప్లాట్‌ఫారమ్ లాంచ్

MATTER : భారతదేశ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్ ఇప్పుడు సాదాసీదా ఈవీల నుంచి ఇంటెలిజెంట్ వాహనాల వైపు మారుతోంది. మ్యాటర్ కంపెనీ ప్రవేశపెట్టిన ఈ AI-Defined Vehicle ప్లాట్‌ఫారమ్ కేవలం ఒక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కాదు, ఇది వాహనం నిర్మాణ శైలినే మార్చేస్తుంది. సాధారణ వాహనాలు ఫ్యాక్టరీ నుంచి ఎలా వస్తాయో అలాగే పనిచేస్తాయి. కానీ ఈ ఏఐ వాహనాలు ప్రయాణించే కొద్దీ డ్రైవర్ అలవాట్లను, రోడ్డు పరిస్థితులను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా తమ పనితీరును మార్చుకుంటాయి. అంటే, మీ బైక్ పాతబడే కొద్దీ మరింత మెరుగ్గా తయారవుతుందన్నమాట.
ఈ ఏఐ టెక్నాలజీ వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటంటే.. ఇది బ్యాటరీ ఆరోగ్యాన్ని, ఇంజిన్ వేడిని, పవర్ డెలివరీని రియల్ టైమ్‌లో పర్యవేక్షిస్తుంది. ఉదాహరణకు బ్యాటరీ ఎక్కువగా వేడెక్కుతుంటే ఏఐ సిస్టమ్ దానిని గుర్తించి వెంటనే కూలింగ్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేస్తుంది. దీనివల్ల వాహనం లైఫ్ పెరగడమే కాకుండా, ప్రమాదాలు జరిగే అవకాశం కూడా తగ్గుతుంది. ఇప్పటికే మ్యాటర్ కంపెనీ తన ఏరా (AERA) బైక్ ద్వారా సాఫ్ట్‌వేర్ ఆధారిత వాహనాలను పరిచయం చేసింది. ఇప్పుడు దానికి ఏఐని జోడించడం ద్వారా ఒక సరికొత్త రికార్డు సృష్టించింది.
వచ్చే 36 నుంచి 48 నెలల్లో (3-4 ఏళ్లు) మ్యాటర్ కంపెనీ ఐదు వేర్వేరు విభాగాల్లో వాహనాలను లాంచ్ చేయబోతోంది. ఇందులో నేకెడ్ స్ట్రీట్ బైక్స్, స్ట్రీట్ ఫైటర్స్, అడ్వెంచర్ బైక్స్, యువత కోసం కమ్యూటర్ బైక్స్, చివరగా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉండబోతున్నాయి. ఈ వాహనాలన్నీ ఒకే రకమైన ఏఐ ప్లాట్‌ఫారమ్‌పై పనిచేస్తాయి. దీనికోసం కంపెనీ దాదాపు $100 మిలియన్ల (సుమారు రూ.915 కోట్లు) పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది. 2029 నాటికి ఏడాదికి 3 లక్షల వాహనాల అమ్మకాలే లక్ష్యంగా మ్యాటర్ ముందుకు సాగుతోంది.
మరో విశేషమేమిటంటే.. మ్యాటర్ కంపెనీ రేర్ ఎర్త్ లోహాలు అవసరం లేని మోటార్లను తయారు చేస్తోంది. చైనా వంటి దేశాలపై ఆధారపడకుండా సొంతంగా టెక్నాలజీని అభివృద్ధి చేస్తూ, 97కు పైగా పేటెంట్లను పొందింది. కేవలం peak performance మాత్రమే కాకుండా, రోజూవారీ వాడకంలో తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు ఉండేలా ఈ ఏఐ ప్లాట్‌ఫారమ్‌ను తీర్చిదిద్దారు. 2027 నాటికి అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతులు ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది.

