మెర్సిడెస్ సరికొత్త ఎలక్ట్రిక్ మాయాజాలం

Mercedes-Benz CLA : మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కార్ల ప్రియుల కోసం భారత్‌లోకి సరికొత్త CLA ఎలక్ట్రిక్ సెడాన్ ను తీసుకువచ్చింది. ఈ కారుకు సంబంధించిన ప్రీ-బుకింగ్స్ మార్చి 10వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా, ఏప్రిల్ నెలలో దీనిని అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్ ధర సుమారు రూ.55 లక్షల నుంచి రూ.60 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండే అవకాశం ఉంది. పోలార్ వైట్, కాస్మిక్ బ్లాక్ వంటి ఐదు ఆకర్షణీయమైన రంగుల్లో ఈ కారు లభించనుంది.

ఈ కారులోని ప్రధాన ఆకర్షణ దాని రేంజ్. మెర్సిడెస్ బెంజ్ మోడ్యులర్ ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించిన ఈ కారులో 85kWh బ్యాటరీని అమర్చారు. ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 792 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మధ్యలో ఎక్కడా ఛార్జింగ్ అవసరం లేకుండానే చేరుకోవచ్చు. కేవలం 6.7 సెకన్లలోనే ఈ కారు 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో కేవలం 20 నిమిషాల ఛార్జింగ్‌తో 400 కిలోమీటర్ల మేర ప్రయాణించవచ్చు.

డిజైన్ పరంగా ఈ కారు చాలా స్టైలిష్‌గా ఉంది. దీని ఫ్రంట్ గ్రిల్‌పై 142 మెరిసే చిన్న నక్షత్రాలు, స్టార్ షేప్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్ కారుకు ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తున్నాయి. 18 అంగుళాల అలాయ్ వీల్స్, బాడీలో కలిసిపోయే డోర్ హ్యాండిల్స్, వెనుక వైపు కనెక్టెడ్ ఎల్‌ఈడీ టైల్ ల్యాంప్స్ దీనికి మరింత అందాన్ని జోడించాయి. కారు లోపల సామాగ్రి పెట్టుకోవడానికి 405 లీటర్ల బూట్ స్పేస్‌తో పాటు, ఇంజిన్ ఉండాల్సిన చోట ముందర భాగంలో మరో 101 లీటర్ల స్టోరేజ్ (Frunk) లభిస్తుంది.

కారు ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో 14 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణ. ఇది మెర్సిడెస్ బెంజ్ సరికొత్త MB OS సిస్టమ్‌పై పనిచేస్తుంది. డ్రైవర్ కోసం 10.25 అంగుళాల డిజిటల్ డిస్ప్లే ఉంది. దీనితో పాటు ఆరు ఫాస్ట్ ఛార్జింగ్ యూఎస్‌బీ పోర్టులు, వైర్‌లెస్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, అధునాతన సేఫ్టీ ఫీచర్ అయిన లెవల్ 2 ఏడీఏఎస్ టెక్నాలజీని ఇందులో పొందుపరిచారు. లగ్జరీ, టెక్నాలజీ కలయికతో రాబోతున్న ఈ కారు ఇండియాలో ఎలక్ట్రిక్ సెడాన్ల మార్కెట్‌ను ఒక ఊపు ఊపడం ఖాయం.

PolitEnt Media

PolitEnt Media

Next Story