Mercedes Benz : భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ నైట్ ఎడిషన్ ఎస్‌యూవీలు లాంచ్.. ధర వింటే షాకవ్వాల్సిందే
ధర వింటే షాకవ్వాల్సిందే

Mercedes Benz : భారతదేశంలో ధనవంతులు, సెలబ్రిటీలు ఎంతగానో ఇష్టపడే లగ్జరీ కార్ల బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ పండగ లాంటి వార్త మోసుకొచ్చింది. దేశంలో లగ్జరీ కార్లకు పెరుగుతున్న విపరీతమైన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, తన మోస్ట్ పాపులర్ ఎస్‌యూవీ లైనప్‌లో సరికొత్త సంచలనాన్ని ప్రవేశపెట్టింది. గ్లోబల్ మార్కెట్లో ఎంతో ఫేమస్ అయిన లిమిటెడ్ సిరీస్‌లో భాగంగా మెర్సిడెస్ బెంజ్ GLE నైట్ ఎడిషన్, మెర్సిడెస్ బెంజ్ GLS నైట్ ఎడిషన్ కార్లను ఇండియన్ మార్కెట్లోకి తెచ్చింది. సాధారణ మోడళ్లతో పోలిస్తే వీటిని మరింత అగ్రెసివ్‌గా, స్పోర్టీగా, కళ్లు చెదిరే బ్లాక్ కలర్ థీమ్‌తో కంపెనీ డిజైన్ చేసింది.
ధరల విషయానికి వస్తే.. ఈ నైట్ ఎడిషన్ కార్లు కోట్లలోనే పలుకుతున్నాయి. ఎంట్రీ లెవెల్ మోడల్ అయిన మెర్సిడెస్ బెంజ్ GLE 300d నైట్ ఎడిషన్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.05 కోట్లుగా ఉంది. అలాగే పెట్రోల్ వెర్షన్ అయిన GLE 450 నైట్ ఎడిషన్ ధరను రూ.1.14 కోట్లుగా నిర్ణయించారు. ఇక మరింత పెద్దదైన, రాయల్ లుక్ ఇచ్చే ఫుల్-సైజ్ లగ్జరీ ఎస్‌యూవీ మోడల్స్ అయిన GLS 450 నైట్ ఎడిషన్ ధర రూ.1.41 కోట్లుగా ఉండగా, దీని టాప్ మోడల్ డీజిల్ వెర్షన్ GLS 450d నైట్ ఎడిషన్ ధర ఏకంగా రూ.1.43 కోట్లుగా ఉంది. లగ్జరీ ప్లస్ పవర్ కోరుకునే బడా బాబులకు ఈ కార్లు పర్ఫెక్ట్ చాయిస్.
ఈ సరికొత్త నైట్ ఎడిషన్ కార్లు ప్రధానంగా రెండు రకాల రంగులలో అందుబాటులోకి వచ్చాయి. అందులో ఒకటి క్లాసిక్ అబ్సిడియన్ బ్లాక్ కాగా, మరొకటి సరికొత్త ఆల్పైన్ గ్రే కలర్ ఆప్షన్. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ కొత్త ఆల్పైన్ గ్రే కలర్‌ను కంపెనీ కేవలం నైట్ ఎడిషన్ కార్ల కోసం మాత్రమే ప్రత్యేకంగా డిజైన్ చేసింది. సాధారణ షోరూమ్‌లలో దొరికే స్టాండర్డ్ బెంజ్ కార్లలో ఈ రంగు అస్సలు దొరకదు. దీని చుట్టూ ఉండే గ్లోసీ బ్లాక్ ఎలిమెంట్స్ వల్ల ఈ ఎస్‌యూవీలు రోడ్డుపై వెళ్తుంటే అందరూ అలా చూస్తూ ఉండిపోవాల్సిందే.
కారు లోపలికి అడుగుపెడితే రైడర్లకు సరికొత్త రాజసం ఉట్టిపడే అనుభూతి కలుగుతుంది. బెంజ్ కంపెనీ ఈ నైట్ ఎడిషన్ కార్ల లోపల ప్రీమియం క్వాలిటీ గల బ్లాక్ నాపా లెదర్ సీట్లను అమర్చింది. వీటికి అదనపు ఆకర్షణగా ఆంత్రాసైట్ ఓపెన్-పోర్ ఓక్ ఉడెన్ ట్రిమ్‌ను ఉపయోగించారు. ఈ విలాసవంతమైన ఫీచర్లు కేవలం ఈ లిమిటెడ్ ఎడిషన్ కార్లలో మాత్రమే కనిపిస్తాయి. అంతేకాదు, డ్రైవర్లు రోడ్డుపై నుండి చూపు తిప్పకుండా, వేగం, నావిగేషన్ వివరాలను నేరుగా విండ్‌షీల్డ్‌పైనే చూసుకునేలా అధునాతన హెడ్-అప్ డిస్‌ప్లే ఫీచర్‌ను కూడా ఇందులో స్టాండర్డ్‌గా ఇచ్చారు.
మెర్సిడెస్ బెంజ్ GLE నైట్ ఎడిషన్ మోడల్‌లో రైడింగ్ కంఫర్ట్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు కంపెనీ ఎయిర్‌మ్యాటిక్ ఎయిర్ సస్పెన్షన్ సిస్టమ్‌ను జత చేసింది. ఈ స్మార్ట్ సస్పెన్షన్ టెక్నాలజీ రోడ్డుపై ఉండే చిన్న చిన్న గుంతలు, స్పీడ్ బ్రేకర్ల వల్ల వచ్చే ఝలక్‌లను అసలు కారు లోపల ఉన్న వారికి తెలియనివ్వదు. ప్రయాణికులు హాయిగా సోఫాలో కూర్చుని గాల్లో తేలిపోతున్న ఫీలింగ్‌ను ఇది కలిగిస్తుంది. అందుకే ఇండియాలో బిజినెస్ మేగ్నెట్లు, సినిమా స్టార్లలో ఈ కార్లకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది.
ఇంజన్ పవర్, స్పీడ్ విషయానికి వస్తే బెంజ్ కార్లకు సాటిలేదు. GLE 300d మోడల్‌లో 2.0-లీటర్ ఫోర్-సిలిండర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది, ఇది 198 kW పవర్ మరియు 550 Nm టార్క్‌ను ఇస్తుంది. ఇది కేవలం 6.9 సెకన్లలోనే 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. ఇక పెట్రోల్ వెర్షన్ అయిన GLE 450 లో 3.0-లీటర్ ఇన్‌లైన్ 6 ఇంజన్ ఉంది, ఇది 280 kW పవర్, 500 Nm టార్క్‌తో కేవలం 5.6 సెకన్లలోనే వంద వేగాన్ని దాటేస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్లు. మరోవైపు భారీ సైజ్ ఉండే GLS 450d మోడల్‌లోని 3.0-లీటర్ డీజిల్ ఇంజన్ ఏకంగా 750 Nm భారీ టార్క్‌ను జనరేట్ చేస్తూ, కేవలం 6.1 సెకన్లలోనే వంద కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది.

