MG Comet EV: ఎలక్ట్రిక్ కారు కొనేవారికి బిగ్ షాక్..భారీగా పెరిగిన ఎంజీ కామెట్ ధర
భారీగా పెరిగిన ఎంజీ కామెట్ ధర

MG Comet EV: రోజూ ఆఫీసుకు వెళ్లడానికి, సిటీ ట్రాఫిక్‌లో సులభంగా తిరగడానికి చిన్న ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఎంజీ మోటార్స్ ప్రకటించిన కొత్త ధరల గురించి మీరు తప్పక తెలుసుకోవాలి. కంపెనీ తన పాపులర్ మినీ ఎలక్ట్రిక్ కారు ఎంజీ కామెట్ ఈవీ ధరల్లో మరోసారి మార్పులు చేసింది. కొన్ని వేరియంట్ల ధరలను రూ.10,000 పెంచిన కంపెనీ, బ్యాటరీని అద్దెకు తీసుకునే (BaaS) ప్లాన్‌లో మాత్రం కస్టమర్లకు కాస్త ఊరటనిచ్చింది. ఈ ఏడాదిలో ఈ కారు ధరలు పెరగడం ఇది రెండోసారి. గతంలోనూ కొన్ని వేరియంట్లపై రూ.17,000 వరకు ధర పెంచింది.
ఏ వేరియంట్ల ధరలు పెరిగాయి? ఎందులో తగ్గాయి?
ఎంజీ కంపెనీ కామెట్ ఈవీలోని ఎగ్జిక్యూటీవ్, ఎగ్జైట్, ఎగ్జైట్ ఎఫ్‌సీ, ఎక్స్ క్లూజివ్ డ్యూయెల్ టోన్, ఎక్స్ క్లూజివ్ ఎఫ్‌సీ డ్యూయెల్ టోన్ వేరియంట్ల ధరలను రూ.10,000 చొప్పున పెంచింది. ఇక్కడ FC అంటే ఫాస్ట్ ఛార్జింగ్ అని అర్థం. అయితే, BaaS ప్లాన్‌లో మాత్రం ఎక్స్ క్లూజివ్ ఎఫ్‌సీ డ్యూయెల్ టోన్,ఎక్స్ క్లూజివ్ డ్యూయెల్ టోన్ మోడళ్ల ప్రారంభ ధరలు రూ.10,000 తగ్గాయి. ఈ ప్లాన్ కింద కారు కొనేటప్పుడు బ్యాటరీకి పూర్తి డబ్బులు కట్టాల్సిన పనిలేదు. కారు నడిపిన దాన్ని బట్టి కిలోమీటరుకు రూ.3.3 అద్దె చెల్లిస్తే సరిపోతుంది. తాజా మార్పుల తర్వాత బ్యాటరీతో కలిపి కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.7.90 లక్షల నుంచి రూ.10.17 లక్షల వరకు ఉంది. BaaS ప్లాన్‌లో రూ.4.99 లక్షల నుంచి రూ.7.26 లక్షల మధ్యలో ఈ కారు లభిస్తుంది.
చిన్న కారులో అదిరిపోయే ప్రీమియం ఫీచర్లు
ఎంజీ కామెట్ ఈవీ నలుగురు హాయిగా కూర్చునే చిన్న ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్. రద్దీగా ఉండే సిటీ రోడ్లపై డ్రైవ్ చేయడానికి, ఇరుకు సందుల్లో పార్కింగ్ చేయడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. కారు లోపల రెండు 10.25-అంగుళాల భారీ స్క్రీన్లు ఉన్నాయి. ఒక స్క్రీన్‌లో స్పీడ్, బ్యాటరీ వివరాలు కనిపిస్తే, రెండో స్క్రీన్ మ్యూజిక్, ఇన్ఫోటైన్మెంట్ కోసం ఉపయోగపడుతుంది. వీటితో పాటు ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్లు, అడ్జస్టబుల్ స్టీరింగ్, మాన్యువల్ ఏసీ, పవర్ విండోస్, నాలుగు స్పీకర్ల ఆడియో సిస్టమ్, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి చక్కటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
సింగిల్ ఛార్జ్‌తో 230 కిలోమీటర్ల రేంజ్
ఈ ఎలక్ట్రిక్ కారులో 17.3 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ అమర్చారు. దీని ఎలక్ట్రిక్ మోటార్ 41 bhp పవర్, 110 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ కారు 230 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. దీన్ని ఛార్జ్ చేయడానికి 3.3 kW, 7 kW ఏసీ (AC) ఛార్జర్ల సపోర్ట్ ఇచ్చారు. అయితే, ఇందులో డీసీ (DC) ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం మాత్రం లేదు.
2027లో రాబోతున్న కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ
మరోవైపు ఎంజీ కంపెనీ తన మరో పాపులర్ కారు విండ్సర్ ఈవీ అప్డేటెడ్ మోడల్‌ను కూడా సిద్ధం చేస్తోంది. 2027లో ఈ కారు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త విండ్సర్ ఈవీలో 61 kWh భారీ బ్యాటరీని అందించనున్నట్లు సమాచారం. దీనివల్ల కారు డ్రైవింగ్ రేంజ్ మరింత పెరగనుంది. ప్రస్తుతం విండ్సర్ ఈవీ 38 kWh, 52.9 kWh బ్యాటరీ ఆప్షన్లతో 449 కిలోమీటర్ల రేంజ్ ఇస్తోంది. రాబోయే కొత్త మోడల్లో పెద్ద బ్యాటరీతో పాటు ఎక్స్టీరియర్ డిజైన్, క్యాబిన్ ఫీచర్లలోనూ భారీ మార్పులు ఉండబోతున్నాయి.

