MG Motors : జేఎస్‌డబ్ల్యూ ఎంజి మోటార్ ఇండియా భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో తన ప్రీమియం పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తాతో చేతులు కలిపి అత్యంత ప్రతిష్టాత్మకమైన MG Cyberster, MG M9 స్పెషల్ కుటూర్ ఎడిషన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. హై-ఫ్యాషన్, లగ్జరీ ఆటోమొబైల్ సమ్మేళనంగా రూపుదిద్దుకున్న ఈ అరుదైన లిమిటెడ్ ఎడిషన్ కార్ల బుకింగ్స్ కూడా అధికారికంగా ప్రారంభమయ్యాయి. ముంబైలో ఘనంగా నిర్వహించిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా నూతన కలెక్షన్ లైట్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ఈ ప్రత్యేక కార్లను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి JSW ఎంజి మోటార్ ఇండియా అధికారిక ఆటోమొబైల్ భాగస్వామిగా వ్యవహరించింది. కంపెనీకి చెందిన ప్రీమియం రిటైల్ ప్లాట్‌ఫామ్ MG Select ద్వారా ఈ రెండు ఎక్స్‌క్లూజివ్ మోడళ్లను ఆవిష్కరించారు. కేవలం లగ్జరీ వాహనంగానే కాకుండా, రోడ్డుపై ప్రత్యేకమైన గుర్తింపును కోరుకునే కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని వీటిని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

సర్పెంట్ ఇన్‌ఫినిటీ డిజైన్, హ్యాండ్‌క్రాఫ్టెడ్ లుక్

ఈ కుటూర్ ఎడిషన్ కార్లలో ప్రధాన మార్పులన్నీ వాటి డిజైన్, స్టైలింగ్‌లోనే కనిపించనున్నాయి. గౌరవ్ గుప్తా సిగ్నేచర్ డిజైన్ అయిన సర్పెంట్ ఇన్‌ఫినిటీ కాన్సెప్ట్ నుంచి ప్రేరణ పొంది ఈ కార్ల ఎక్స్‌టీరియర్‌ను తీర్చిదిద్దారు. ఎక్స్‌టీరియర్‌పై ప్రత్యేకమైన ఫినిషింగ్, కేబిన్‌లో బిస్పోక్ ఎలిమెంట్స్, పలుచోట్ల చేతితో చెక్కినట్లుగా ఉండే హ్యాండ్‌క్రాఫ్టెడ్ డిటైలింగ్స్ ఈ కార్లను సాధారణ మోడళ్ల కంటే అత్యంత ప్రీమియమ్‌గా నిలబెడతాయి.

ఇంజిన్, మెకానికల్ విభాగాల్లో మార్పులు లేవు

ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లలో డిజైన్ పరంగా భారీ మార్పులు చేసినప్పటికీ, సాంకేతిక విభాగంలో ఎలాంటి మార్పులూ చేయలేదు. అంటే కారు ఇంజిన్, బ్యాటరీ సామర్థ్యం, పవర్ పెర్ఫార్మెన్స్, డ్రైవింగ్ అనుభూతి, ఇతర సాంకేతిక ఫీచర్లు సాధారణ మోడళ్ల మాదిరిగానే ఉంటాయి. పరిమిత సంఖ్యలో దొరికే ప్రత్యేకమైన డిజైన్, లగ్జరీ కార్లను ఇష్టపడే ధనవంతులైన కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఈ మోడళ్లను డిజైన్ చేశారు.

ధరల ప్రకటన ఎప్పుడంటే?

ఈ కార్ల ప్రత్యేకత, అరుదైన గుర్తింపును కాపాడేందుకు కంపెనీ వీటి ఉత్పత్తిని చాలా పరిమితంగా ఉంచింది. భారత్‌లో ఎంజి సైబర్ స్టర్ కుటూర్ ఎడిషన్ లో కేవలం 50 యూనిట్లు, అలాగే ఎంజి M9 కుటూర్ ఎడిషన్ లో కూడా కేవలం 50 యూనిట్లు మాత్రమే విక్రయించనున్నారు. ఈ రెండు లిమిటెడ్ ఎడిషన్ కార్ల అధికారిక ధరలను కంపెనీ ఆగస్టు 3, 2026న ప్రకటించనుంది. లగ్జరీ, ఫ్యాషన్ కలయికను కోరుకునే ఆటోమొబైల్ ప్రియులకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story