MG Hector Hawk: ఎంజీ హెక్టార్ హాక్ దిగుతోంది..రూ.21 వేలకే బుకింగ్స్..రేంజ్, లుక్స్ చూస్తే పిచ్చెక్కాల్సిందే
లుక్స్ చూస్తే పిచ్చెక్కాల్సిందే

MG Hector Hawk: భారతీయ ఆటోమొబైల్ రంగాన్ని ఏలేందుకు జేఎస్‌డబ్ల్యూ ఎంజి మోటార్ ఇండియా మరో సరికొత్త ఎస్‌యూవీతో సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 3-రో ఎస్‌యూవీ ఎంజి హెక్టర్ హాక్ అధికారిక టీజర్‌ను తాజాగా విడుదల చేసింది. ఆగస్టు 26న భారతదేశంలో లాంచ్ కానున్న ఈ మోడల్ ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ చిత్రాలు కార్ ప్రియుల దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చైనాలో అత్యంత ఆదరణ పొందిన ఉలింగ్ స్టార్‌ల్యాట్ 560 ప్లాట్‌ఫారమ్ ఆధారంగా దీనిని రూపుదిద్దారు. కొత్త కారును కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కేవలం రూ.21,000 చెల్లించి ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.
టీజర్‌లో కనిపిస్తున్న వివరాల ప్రకారం హెక్టర్ హాక్ ఎక్స్‌టీరియర్ డిజైన్ అత్యంత మోడ్రన్, ప్రీమియం లుక్‌తో అలరిస్తోంది. ముందు భాగంలో స్ప్లిట్ డీఆర్‌ఎల్ సెటప్, క్రోమ్ ఇన్సర్ట్స్‌తో ఉన్న నల్లటి గ్రిల్, దాని మధ్యలో మెరిసే ఎంజి లోగో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దీనికి తోడు ఎల్‌ఈడీ హెడ్‌లాంప్‌లు, కొత్తగా డిజైన్ చేసిన బోనెట్ కారుకు రగ్గడ్ లుక్‌ను తీసుకొచ్చాయి. డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్, బాడీ కలర్ ఓఆర్‌విఎమ్‌లు, వెనుక వైపు ర్యాప్-అరౌండ్ ఎల్‌ఈడీ టెయిల్‌లాంప్‌లు, స్పాయ్లర్, షార్క్ ఫిన్ యాంటెన్నా వంటి ఎలిమెంట్స్ ఈ కారు ప్రీమియం అప్పీల్‌ను మరింత పెంచాయి.
కారు లోపలి భాగం బేజ్ కలర్ థీమ్‌తో అత్యంత విలాసవంతంగా దర్శనమిస్తోంది. మూడు వరుసలలోనూ అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌లు అమర్చారు. 2-స్పోక్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, పెద్ద ఫ్రీ-స్టాండింగ్ టచ్‌స్క్రీన్, పూర్తి డిజిటల్ కలర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డ్రైవింగ్ అనుభూతిని వేరే లెవెల్‌కు తీసుకెళ్తాయి. ఎంజి ప్రవేశపెట్టిన కొత్త అడాప్ట్ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందిన మొదటి ప్రాడక్ట్ ఇది. మొదటగా దీని ఎలక్ట్రిక్ వెర్షన్‌ను పరిచయం చేసే అవకాశం ఉంది. గ్లోబల్ మోడల్‌లో ఉన్న 56.7kWh బ్యాటరీ ప్యాక్ ఒకే ఛార్జ్‌పై ఏకంగా 530 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది. తదుపరి దశలో ప్లాగ్-ఇన్ హైబ్రిడ్ వేరియంట్ కూడా రానుంది.
జెఎస్‌డబ్ల్యూ గ్రూప్ నుంచి మరొక పవర్‌ఫుల్ ఎస్‌యూవీ జెటూర్ టి2 కూడా త్వరలోనే భారత రోడ్లపైకి రాబోతోంది. సుమారు 4.78 మీటర్ల పొడవు, బాక్సీ మోడ్రన్ డిజైన్‌తో వచ్చే ఈ ప్రీమియం కారును పెట్రోల్, ప్లాగ్-ఇన్ హైబ్రిడ్ ఆప్షన్లలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. పెట్రోల్ మోడల్‌లో 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్ లభించనుంది. భారత మార్కెట్లో దీని అంచనా ధర రూ. 30 లక్షల నుంచి రూ. 45 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

