MG Hector Tomahawk: ఎంజీ హెక్టర్ టొమాహాక్ ఈవీ సంచలనం.. రెండు నెలల్లోనే 10 వేలకు పైగా బుకింగ్స్
రెండు నెలల్లోనే 10 వేలకు పైగా బుకింగ్స్

MG Hector Tomahawk: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా సరికొత్త సంచలనం సృష్టించింది. కంపెనీ ఇటీవల లాంచ్ చేసిన ఎంజీ హెక్టర్ టొమాహాక్ ఈవీ ఎస్‌యూవీకి దేశవ్యాప్తంగా అపూర్వ స్పందన లభిస్తోంది. మార్కెట్లోకి వచ్చి రెండు నెలలు కూడా పూర్తికాకముందే ఈ కారు ఏకంగా 10 వేలకు పైగా బుకింగ్స్‌ను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఎలక్ట్రిక్ వెర్షన్‌తో పాటు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్ కూడా కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ ఏడాది ఆగస్టు 26న అధికారికంగా మార్కెట్లోకి విడుదలైన ఎంజీ హెక్టర్ టొమాహాక్ ఈవీ, టొమాహాక్ PHEV కార్లు ఆటోమొబైల్ రంగంలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఎంజీ కంపెనీ కొత్తగా అభివృద్ధి చేసిన ADAPT ఆర్కిటెక్చర్ ఆధారంగా తయారైన తొలి కార్లు ఇవే కావడం విశేషం. ముఖ్యంగా భారత మార్కెట్లో పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ రెండూ కలిగిన మొదటి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారు ఇదే కావడంతో వినియోగదారులు దీనిని కొనుగోలు చేయడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఈ ఎలక్ట్రిక్ మోడల్ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.19.49 లక్షలు ఉండగా, హైబ్రిడ్ మోడల్ ధర రూ.25.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
ఈ ఎస్యూవీ పనితీరు విషయానికి వస్తే.. ఎంజీ హెక్టర్ టొమాహాక్ ఈవీలో 69.2 kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ కారు ఏకంగా 517 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని కంపెనీ స్పష్టం చేస్తోంది. కస్టమర్ల అవసరాలకు తగినట్లుగా ఐదు సీట్లు లేదా ఏడు సీట్ల ఆప్షన్లలో ఈ కారు లభిస్తుంది. ఇక ఎలక్ట్రిక్ మోడల్ డెలివరీలు ఇప్పటికే సెప్టెంబర్ చివరి వారంలో ప్రారంభం కాగా, హైబ్రిడ్ మోడల్ డెలివరీలు రాబోయే నవంబర్ నుంచి ప్రారంభం కానున్నాయి.
హెక్టర్ టొమాహాక్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్లో 20.5 kWh బ్యాటరీతో పాటు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కూడా అందించారు. ఈ రెండు పవర్ సోర్స్‌లు కలిసి ఏకంగా 1,100 కిలోమీటర్లకు పైగా టోటల్ రేంజ్ అందిస్తాయని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లో మాత్రమే నడిపితే ఇది 115 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. దీనివల్ల నగరాల్లో రోజువారీ చిన్న ప్రయాణాలను ఎలక్ట్రిక్ మోడ్‌లో, సుదూర ప్రయాణాలను పెట్రోల్ ఇంజిన్ సహాయంతో సులభంగా పూర్తి చేయవచ్చు.

