ఎంజీ నుంచి భారీ ఎస్‌యూవీ మెజెస్టర్ వచ్చేస్తోంది

MG Majester SUV : భారతదేశపు రోడ్లపై సింహంలా గర్జించేందుకు ఎంజీ మోటార్స్ నుంచి మరో భారీ ఎస్‌యూవీ సిద్ధమైంది. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన ప్రీమియం మోడల్ మెజెస్టర్ లాంచ్ తేదీని ఖరారు చేసింది. ఏప్రిల్ 20, 2026న ఈ కారు ధరలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే రూ.41,000 టోకెన్ అమౌంట్‌తో బుకింగ్స్ షురూ అయ్యాయి. మే నెల నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. టయోటా ఫార్చ్యూనర్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీనిచ్చే ఈ కారు విశేషాలు చూద్దాం.

ఎంజీ మెజెస్టర్ మొత్తం నాలుగు వేరియంట్లలో లభించనుంది. అవి షార్ప్ 4X2 (7-సీటర్), శావీ 4X2 (7-సీటర్), శావీ 4X2 (6-సీటర్), టాప్ ఎండ్ మోడల్ శావీ 4X4 (7-సీటర్). అంటే కస్టమర్లు తమ అవసరాన్ని బట్టి 6 లేదా 7 సీట్ల ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.40 లక్షల నుంచి రూ.45 లక్షల మధ్య ఉండవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కారు నేరుగా టయోటా ఫార్చ్యూనర్, స్కోడా కోడియాక్, జీప్ మెరిడియన్ వంటి పవర్‌ఫుల్ ఎస్‌యూవీలతో తలపడనుంది.

ముందుగా బుక్ చేసుకునే వారి కోసం ఎంజీ మోటార్స్ అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. మొదటి 3,000 మంది కొనుగోలుదారులకు 5 ఏళ్ల అపరిమిత కిలోమీటర్ల వారంటీ, 5 ఏళ్ల పాటు ఉచిత లేబర్ సర్వీస్, 5 ఏళ్ల రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఉచితంగా లభిస్తాయి. అంటే కారు కొన్న తర్వాత ఐదేళ్ల వరకు మెయింటెనెన్స్ టెన్షన్ ఉండదు. ఈ ఆఫర్ ద్వారా కస్టమర్లను ఆకర్షించాలని ఎంజీ భావిస్తోంది.

మెజెస్టర్ లోపల 2.0 లీటర్ల భారీ ట్విన్ టర్బో డీజిల్ ఇంజన్ ఉంది. ఇది 215 బీహెచ్‌పీ పవర్, 478 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ కారులో ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా ఉంది. మూడు డిఫరెన్షియల్ లాక్స్, వివిధ డ్రైవింగ్ మోడ్స్, 810 మి.మీ వరకు నీటిలో ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం. అంటే బురద రోడ్లు, కొండ ప్రాంతాల్లో కూడా ఇది చాలా సులభంగా దూసుకుపోతుంది. దీని పొడవు 5 మీటర్ల కంటే ఎక్కువ ఉండటం వల్ల లోపల స్పేస్ కూడా చాలా విశాలంగా ఉంటుంది.

ఈ కారులో ఫీచర్లకు కొదవ లేదు. 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్, జేబీఎల్ సౌండ్ సిస్టమ్, 64 రంగుల యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్ రూఫ్ కారుకు మంచి లగ్జరీ లుక్ ఇస్తాయి. సీట్ల విషయానికి వస్తే.. ముందు వరుసలో మసాజ్ ఫంక్షన్, కూలింగ్ ఫీచర్ ఉన్న ఎలక్ట్రిక్ సీట్లు ఉన్నాయి. డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జింగ్, 360-డిగ్రీల కెమెరా, పవర్ టెయిల్‌గేట్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు లెవల్-2 అడాస్ (ADAS) టెక్నాలజీని కూడా అందించారు, ఇది రోడ్డుపై ప్రమాదాలను నివారించడంలో సహాయపడుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story