MG Majestor : 5 ఏళ్ల వారంటీ, 5 ఉచిత సర్వీసులతో బంపర్ ఆఫర్.. రూ.41 వేలకే ఎంజీ మెజెస్టర్ బుకింగ్
రూ.41 వేలకే ఎంజీ మెజెస్టర్ బుకింగ్

MG Majestor : భారతీయ రోడ్లపై మరో భారీ కాయం గర్జించడానికి సిద్ధమైంది. JSW MG మోటార్ ఇండియా తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ఎంజీ మెజస్టర్ను ఈరోజే (ఏప్రిల్ 20) మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎంజీ గ్లోస్టర్ కంటే ఇది అత్యంత ప్రీమియం, శక్తివంతమైనదిగా ఉండబోతోంది. కేవలం తన లుక్స్‌తోనే కాకుండా, ఏకంగా పట్టాలపై రైలును లాగి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించిన ఈ కారు, ఇప్పుడు టయోటా ఫార్చ్యూనర్‌కు నిద్ర లేకుండా చేసేందుకు వచ్చేస్తోంది.
ఎంజీ మెజస్టర్ గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరగడానికి ప్రధాన కారణం దాని శక్తి. పట్టాలపై ఉన్న 406 టన్నుల బరువున్న రైలును సునాయాసంగా లాగి ఈ ఎస్‌యూవీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ఈ రేంజ్ పవర్ ఉన్న కారు మార్కెట్లోకి వస్తుండటంతో ఆఫ్-రోడింగ్ ప్రియులు ఫిదా అయిపోతున్నారు. రూ.41,000 చెల్లించి ఈ కారును ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా.
ఎంజీ మెజస్టర్ డిజైన్ చాలా బోల్డ్ గా, మస్కులర్ గా ఉంటుంది. దీని ముందు భాగంలో డ్రాగన్ ఐ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, వర్టికల్ హెడ్ ల్యాంప్స్ కారుకు ఒక డిఫరెంట్ లుక్ ఇస్తాయి. భారీ గ్రిల్, 19 అంగుళాల అలాయ్ వీల్స్, క్రోమ్ సైడ్ స్టెప్స్, వెనుక వైపు కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు దీనికి ప్రీమియం లుక్ ఇస్తాయి. రోడ్డుపై ఈ కారు వెళ్తుంటే ఎవరైనా సరే ఒక్కసారి ఆగి చూడాల్సిందే.
కారు లోపల అడుగుపెడితే ఒక విలాసవంతమైన భవనంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇది 6, 7 సీట్ల ఆప్షన్లలో లభిస్తుంది. సీట్లకు స్మోక్డ్ ఎబోనీ లెదర్ ఫినిషింగ్, 8 రకాల మసాజ్ ఫీచర్లు ఉన్నాయి. డ్యాష్‌బోర్డ్‌లో 12.3 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, 12 స్పీకర్ల జేబీఎల్ సౌండ్ సిస్టమ్, 64 రంగుల యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి. అంతేకాకుండా, గెస్చర్ కంట్రోల్ టెయిల్ గేట్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
మెజస్టర్ ఇంజన్ విషయానికి వస్తే.. ఇందులో 2.0 లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజన్ ఉంది. ఇది 215 bhp పవర్, 478 Nm భారీ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్ దీని సొంతం. కేవలం సిటీ రోడ్లకే కాదు.. మంచు, ఇసుక, బురద, రాళ్లపై కూడా సునాయాసంగా వెళ్ళడానికి ఇందులో వివిధ టెర్రైన్ మోడ్స్ ఉన్నాయి. ఇది ఏకంగా 810 మిమీ లోతు వరకు ఉన్న నీటిలో కూడా సులభంగా ప్రయాణించగలదు.
ప్రయాణికుల సేఫ్టీ కోసం MG మెజస్టర్‌లో లెవల్-2 ఏడీఏఎస్ టెక్నాలజీని అందించారు. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి 17 రకాల అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు 6 ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీల కెమెరా, హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ప్రయాణాన్ని అత్యంత సురక్షితం చేస్తాయి. టయోటా ఫార్చ్యూనర్, స్కోడా కొడియాక్ వంటి కార్లకు ఇది గట్టి పోటీనివ్వడం ఖాయం.

