MG Majestor vs Jeep Meridian : భారీ ఎస్‌యూవీల యుద్ధం.. ఎంజీ మెజస్టర్ వర్సెస్ జీప్ మెరిడియన్.. ఏది బెస్ట్?
ఎంజీ మెజస్టర్ వర్సెస్ జీప్ మెరిడియన్.. ఏది బెస్ట్?

MG Majestor vs Jeep Meridian : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో లగ్జరీ త్రీ-రో ఎస్‌యూవీ కార్లకు డిమాండ్ రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరుగుతోంది. లాంగ్ హైవే రైడ్స్, వీకెండ్ ట్రిప్స్, ఆఫ్‌రోడింగ్ చేయాలనుకునే కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఎంజీ మోటార్స్, జీప్ కంపెనీలు తమ బెస్ట్ మోడళ్లను రంగంలోకి దించాయి. ఇందులో ఎంజీ మెజస్టర్ అనేది వారి పాపులర్ మోడల్ గ్లోస్టర్‌కు అప్‌గ్రేడెడ్, ప్రీమియం వర్షన్ కాగా, జీప్ మెరిడియన్ అనేది జీప్ కంపాస్ కారుకు పొడిగించిన పెద్ద మోడల్. ఈ రెండు కార్లు వేర్వేరు బడ్జెట్, ఫీచర్ల ప్యాకేజీతో కస్టమర్ల ముందుకు వచ్చాయి.
జేబుకు చిల్లు పడకుండా ఉండాలంటే ఏది బెస్ట్?
ధర విషయానికి వస్తే జీప్ మెరిడియన్ కారు ఎంజీ మెజస్టర్ కంటే చాలా చౌకగా లభిస్తుంది. ఈ రెండు కార్ల బేస్ మోడల్ ధరల మధ్యే దాదాపు రూ.15 లక్షల వరకు భారీ వ్యత్యాసం ఉంది. అలాగే టాప్ ఎండ్ మోడళ్లకు వెళ్లే కొద్దీ ఈ ప్రైస్ గ్యాప్ మరింత పెరుగుతుంది. ఎక్కువ లగ్జరీ హంగుల జోలికి వెళ్లకుండా, తక్కువ బడ్జెట్‌లోనే ఒక బ్రాండెడ్, ప్రీమియం 3-రో ఎస్‌యూవీని సొంతం చేసుకోవాలనుకునే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కస్టమర్లకు జీప్ మెరిడియన్ ఒక అద్భుతమైన ఆప్షన్‌గా నిలుస్తుంది.
సైజు, రోడ్ ప్రెజెన్స్‌లో తేడాలు
కారు సైజు, లుక్స్ పరంగా చూస్తే ఎంజీ మెజస్టర్ దాదాపు ప్రతి విషయంలోనూ జీప్ మెరిడియన్ కంటే చాలా పెద్దదిగా ఉంటుంది. మెజస్టర్ కారు పొడవు, వెడల్పు, వీల్‌బేస్ ఎక్కువగా ఉండటం వల్ల రోడ్డుపై దీని లుక్ ఒక లగ్జరీ ట్యాంక్‌లా కనిపిస్తుంది. దీనివల్ల కారు లోపల సెకండ్ రో, థర్డ్ రో సీట్లలో కూర్చునే ప్రయాణికులకు లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ చాలా విలాసవంతంగా లభిస్తుంది. అయితే, జీప్ మెరిడియన్ కాస్త కాంపాక్ట్ సైజులో ఉండటం వల్ల ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో, సన్నటి రోడ్లపై దీనిని డ్రైవ్ చేయడం, పార్కింగ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది.
కలర్ ఆప్షన్లు, స్పెషల్ ఎడిషన్లు
లుక్స్, డిజైన్ పరంగా జీప్ మెరిడియన్ కస్టమర్లకు ఎక్కువ కలర్ ఆప్షన్లను అందిస్తోంది. అంతేకాకుండా, జీప్ కంపెనీ ఇందులో ట్రాక్ అండ్ ట్రైలిస్ పేరుతో ప్రత్యేక ఎడిషన్లను కూడా అమ్ముతోంది. వీటిలో కారు లోపల, బయట ప్రత్యేకమైన స్టైలిష్ ఎలిమెంట్స్ ఉంటాయి. మరోవైపు ఎంజీ మెజస్టర్ కారు మాత్రం చాలా క్లాసిక్, ప్రీమియం కలర్ షేడ్స్‌పైనే దృష్టి పెట్టింది. ముఖ్యంగా మెజస్టర్‌లో వచ్చే డార్క్ ఎక్స్‌టీరియర్ థీమ్ కారుకు మరింత స్పోర్టీ, మాస్ లుక్‌ను తెచ్చిపెడుతుంది.
ఇంజిన్ పవర్, ఆఫ్‌రోడింగ్ సామర్థ్యం
ఇంజిన్ పర్ఫార్మెన్స్ పరంగా ఎంజీ మెజస్టర్ కారు జీప్ మెరిడియన్ కంటే చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. మెజస్టర్‌లో అమర్చిన ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్ భారీ స్థాయిలో పవర్, టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీనివల్ల హైవేలపై అతి తక్కువ సమయంలోనే ఈజీగా ఓవర్‌టేక్ చేయవచ్చు. దీనితో పాటు అడ్వాన్స్‌డ్ ఆఫ్‌రోడ్ టెక్నాలజీ ఉండటం వల్ల ఎంతటి అడవులు, కొండలు, బురద దారులనైనా ఇది సులభంగా దాటేస్తుంది. జీప్ మెరిడియన్ ఇంజిన్ అంత పవర్‌ఫుల్ కాకపోయినప్పటికీ, మైలేజ్, పర్ఫార్మెన్స్ మధ్య ఒక మంచి బ్యాలెన్స్‌ను మెయింటైన్ చేస్తుంది. ఇది సాధారణ రోడ్లతో పాటు కాస్త కఠినమైన దారుల్లోనూ సులభంగా ప్రయాణించగలదు.
ఫీచర్ల విషయానికొస్తే ఏది టాప్?
ఫీచర్ల రేసులో ఎంజీ మెజస్టర్ కారు స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఇందులో భారీ ఇన్‌ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, వెనుక సీట్లలో కూర్చునే వారి కోసం కూడా వెంటిలేటెడ్, మసాజ్ ఫంక్షన్ సీట్లు, డ్రైవర్ సీట్ అడ్జస్ట్‌మెంట్ కోసం ఎక్కువ ఆప్షన్లు, అదిరిపోయే ప్రీమియం సౌండ్ సిస్టమ్‌ను అందించారు. అయితే, రెండు కార్లలోనూ కామన్‌గా పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, అడ్వాన్స్‌డ్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ప్రీమియం ఫీచర్లను లగ్జరీగా అమర్చారు. కాబట్టి, ఎక్కువ ఫీచర్లు, పెద్ద సైజు కావాలనుకుంటే మెజస్టర్.. బడ్జెట్, సిటీ డ్రైవింగ్ ముఖ్యం అనుకుంటే మెరిడియన్ బెస్ట్ ఛాయిస్.

