MG Windsor EV : ఎంజీ విండ్సర్ EV రేట్లు పెరిగాయి..కొత్త ధరల లిస్ట్ వచ్చేసింది
కొత్త ధరల లిస్ట్ వచ్చేసింది

MG Windsor EV : ఎంజీ మోటార్స్ ఇండియా తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపులో దేశంలోనే అత్యంత ఆదరణ పొందిన ఎలక్ట్రిక్ కారు విండ్సర్ EV కూడా ఉంది. పెరిగిన ధరలు జనవరి 13, 2026 నుండి అమల్లోకి వచ్చాయి. వేరియంట్‌ను బట్టి గరిష్టంగా రూ.38,100 వరకు (సుమారు 2.52%) భారం పెరిగింది. అయితే, కొత్త కారు కొనాలనుకునే వారికి ఒక ఊరటనిచ్చే విషయం ఏంటంటే.. దీని బేస్ వేరియంట్ (Excite) ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం విండ్సర్ EV ధరలు రూ.14.0 లక్షల నుండి రూ.18.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.
38kWh బ్యాటరీ కలిగిన వేరియంట్లలో ఎక్స్‌క్లూజివ్ మోడల్‌పై అత్యధికంగా రూ.38,100 భారం పడింది. దీంతో ఈ వేరియంట్ ధర ఇప్పుడు రూ.15,52,900కు చేరింది. అలాగే ఎసెన్స్ వేరియంట్ ధర రూ.23,100 పెరిగి, ప్రస్తుతం రూ.16,52,900 వద్ద ఉంది. అయితే, ఈ కారును సామాన్యులకు అందుబాటులో ఉంచే ఉద్దేశంతో కంపెనీ దీని బేస్ వేరియంట్ అయిన ఎక్సైట్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇది ఇప్పటికీ పాత ధర రూ.13,99,800కే లభిస్తోంది.
మరోవైపు, భారీ రేంజ్ ఇచ్చే 53kWh బ్యాటరీ వేరియంట్ల పై కూడా ధరల ప్రభావం పడింది. ఇందులో ఎక్స్‌క్లూజివ్ ప్రో వేరియంట్ ధర రూ.13,100 పెరగడంతో ఇప్పుడు దీని ధర రూ.17,37,900కు చేరుకుంది. అలాగే ఈ సిరీస్‌లో అత్యంత ఖరీదైన ఎసెన్స్ ప్రో వేరియంట్ ధర రూ.10,900 మేర పెరిగింది. దీనివల్ల ప్రస్తుతం ఈ టాప్-ఎండ్ మోడల్ కొనాలంటే రూ.18,49,900 (ఎక్స్-షోరూమ్) వెచ్చించాల్సి ఉంటుంది. ఈ కొత్త ధరలు జనవరి 13, 2026 నుంచి వర్తిస్తాయని కంపెనీ స్పష్టం చేసింది.
ఎంజీ విండ్సర్ EV ఇప్పుడు రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తోంది. స్టాండర్డ్ వేరియంట్ 38kWh బ్యాటరీతో వస్తుండగా, కొత్తగా వచ్చిన ప్రో వేరియంట్లలో భారీ 52.9kWh బ్యాటరీని అమర్చారు. దీనివల్ల ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 449 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఇది కేవలం 50 నిమిషాల్లోనే 20% నుండి 80% వరకు ఛార్జ్ అయ్యేలా ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు లాంగ్ ట్రిప్స్ ప్లాన్ చేసుకునే వారైతే ఈ ప్రో వేరియంట్ పర్ఫెక్ట్ ఛాయిస్.
విండ్సర్ EV లోపల కూర్చుంటే మీరు నిజంగానే బిజినెస్ క్లాస్ విమానంలో ఉన్నట్లు అనుభూతి చెందుతారు. దీని వెనుక సీట్లు 135 డిగ్రీల వరకు వంగుతాయి, ఇది ప్రయాణికులకు అద్భుతమైన కంఫర్ట్ ఇస్తుంది. ఇందులో 15.6 అంగుళాల అతిపెద్ద టచ్‌స్క్రీన్, 9 స్పీకర్ల ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్, గ్లాస్ సన్‌రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. కొత్త ప్రో వేరియంట్‌లో ADAS లెవల్ 2 భద్రతా ఫీచర్లు, వెహికల్-టు-లోడ్ (V2L) వంటి టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చాయి.

