MG Windsor EV : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటైన ఎంజీ విండ్సర్ ఈవీని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు ఒక షాకింగ్ న్యూస్. ఎంజీ మోటార్ ఇండియా తన బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారు ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 2026 నుంచి ఈ కారులోని అన్ని వేరియంట్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. వివిధ మోడళ్లను బట్టి ఈ ధరల పెంపు రూ.40,000 నుంచి రూ.60,000 వరకు ఉంది. అంతర్జాతీయంగా ఆటోమొబైల్ రంగానికి అవసరమైన ముడి పదార్థాల ధరలు, కార్ల ఉత్పత్తి వ్యయం విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని కంపెనీ వెల్లడించింది. ఇటీవలే కియా, టయోటా వంటి ప్రముఖ సంస్థలు కూడా తమ వాహనాల ధరలను పెంచిన సంగతి తెలిసిందే.

బేస్ మోడల్‌పైనే అత్యధిక ప్రభావం

ఈ ధరల పెంపు ప్రభావం ఎంజీ విండ్సర్ ఈవీ బేస్ వేరియంట్ అయిన ఎక్సైట్ పై అత్యధికంగా పడింది. గతంలో ఈ బేస్ మోడల్ ధర రూ.14.10 లక్షలుగా ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ.60,000 పెరిగి రూ.14.70 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది. దీని తర్వాత వచ్చే ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ ధర రూ.46,900 పెరిగి ఇప్పుడు రూ.16 లక్షలుగా మారింది. అలాగే ఎసెన్స్ వేరియంట్ కూడా అదే స్థాయిలో రూ.46,900 పెరగడంతో దీని ధర రూ.17 లక్షలకు చేరుకుంది. మొత్తంగా చూసుకుంటే వివిధ వేరియంట్లపై దాదాపు 2.15 శాతం నుంచి 4.26 శాతం వరకు ధరలు పెరిగాయి.

ప్రో మోడల్స్ ధరలు కూడా అప్

కంపెనీ అందిస్తున్న హై-ఎండ్ ప్రో వేరియంట్ల ధరలు కూడా ఇప్పుడు మరింత ప్రియంగా మారాయి. అందులో ఎక్స్‌క్లూజివ్ ప్రో వేరియంట్ ధర రూ.52,000 పెరగడంతో దీని కొత్త ధర రూ.17.90 లక్షలకు చేరింది. ఇక ఈ సిరీస్‌లోనే అత్యంత లగ్జరీ, టాప్ మోడల్ అయిన ఎసెన్స్ ప్రో ధర రూ.40,000 మేర పెరిగింది. దీనితో ఈ టాప్ ఎండ్ కారును సొంతం చేసుకోవాలంటే ఇప్పుడు రూ.19.00 లక్షలు (ఎక్స్-షోరూమ్) చెల్లించాల్సి ఉంటుంది. బడ్జెట్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు అన్నింటి ధరలూ పెరగడం ఈవీ కొనుగోలుదారులకు కొంత నిరాశ కలిగించే విషయమే.

రెండు పవర్‌ఫుల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు

ధరలు పెరిగినప్పటికీ ఈ కారులో ఇచ్చే పవర్‌ఫుల్ ఫీచర్లు, బ్యాటరీ సామర్థ్యంలో ఎలాంటి మార్పులు లేవు. ఎంజీ విండ్సర్ ఈవీని కంపెనీ రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో విక్రయిస్తోంది. ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎసెన్స్ వేరియంట్లలో 38 kWh సామర్థ్యం గల బ్యాటరీ లభిస్తుంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై గరిష్టంగా 332 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇక ఎక్స్‌క్లూజివ్ ప్రో, ఎసెన్స్ ప్రో వేరియంట్లలో మరింత పెద్దదైన 52.9 kWh బ్యాటరీని అందించారు. ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 449 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ కార్లలోని మోటార్ 136 PS పవర్‌ను, 200 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.

రెండు సంవత్సరాల్లో 75,000 యూనిట్ల అమ్మకాలు

భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఎంజీ విండ్సర్ ఈవీ ఒక తిరుగులేని శక్తుగా ఎదిగింది. లాంచ్ అయినప్పటి నుంచి ఎంజీ మోటార్ ఇండియా పోర్ట్‌ఫోలియోలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా ఇది నిలిచింది. ప్రస్తుతం భారతదేశంలోనే నంబర్ వన్ బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారుగా ఇది చలామణి అవుతోంది. ఈ కారు మార్కెట్లోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో, జూలై 2026 నాటికి దేశవ్యాప్తంగా ఏకంగా 75,000 యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ అద్భుతమైన నంబర్స్ భారతీయ కస్టమర్లలో ఈ కారుకు ఉన్న క్రేజ్ మరియు నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story