యెరూషలేంలో ప్రాణాలు కాపాడిన చైనా కారు

BYD Atto 3 : యెరూషలేం వీధుల్లో మృత్యువు ముంచుకొచ్చిన వేళ.. ఒక చైనీస్ ఎలక్ట్రిక్ కారు ప్రాణదాతగా నిలిచింది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గాల్లో నుంచి దూసుకొచ్చిన మిస్సైల్ ఒక కారు పక్కనే పడి పేలింది. రోడ్డుకు పెద్ద గుంత పడేంతటి శక్తివంతమైన ఆ పేలుడు దాడిలో కారు తుత్తునియలు అవ్వాల్సింది.. కానీ, ఆ కారు అణువణువూ ప్రాణరక్షణ కవచంలా మారి లోపల ఉన్న ఐదుగురిని క్షేమంగా కాపాడింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ కారు మరేదో కాదు.. చైనాకు చెందిన ప్రముఖ సంస్థ BYD తయారు చేసిన ఆటో 3. మార్చి 1న జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

సాధారణంగా ఒక చిన్న రోడ్డు ప్రమాదం జరిగితేనే కార్ల బాడీలు నుజ్జునుజ్జవుతాయి. అలాంటిది ఒక మిస్సైల్ దాడిని తట్టుకోవడం అంటే అది అసామాన్యమైన విషయం. BYD ఆటో 3 కారును e-Platform 3.0 అనే అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించారు. ఈ ప్లాట్‌ఫారమ్ ఎలక్ట్రిక్ వాహనాలకు అత్యంత దృఢత్వాన్ని, భద్రతను ఇస్తుంది. ఈ ప్రమాదంలో కారు పక్కనే బాంబు పేలినా, కారు, మెయిన్ పిల్లర్లు (A, B, C Pillars) వంగలేదు, విరగలేదు. కారు బాడీలో 85 శాతం హై-స్ట్రెంగ్త్ స్టీల్‌ను వాడటం వల్లే ఆ భీకర పేలుడు ధాటిని కేబిన్ తట్టుకోగలిగింది. లోపల ఉన్న ప్రయాణీకులకు కనీసం చిన్న గీత కూడా పడలేదు.

ఎలక్ట్రిక్ కార్లంటే ప్రమాదం జరిగినప్పుడు బ్యాటరీ పేలి మంటలు అంటుకుంటాయనే భయం అందరిలో ఉంటుంది. కానీ BYD ఆటో 3 విషయంలో అది తప్పని నిరూపితమైంది. ఇందులో వాడిన ఎల్‌ఎఫ్‌పీ బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ అత్యంత సురక్షితమైనది. మిస్సైల్ దాడి జరిగిన తర్వాత కూడా బ్యాటరీ నుంచి పొగ రాలేదు, మంటలు అంటుకోలేదు, కనీసం షార్ట్ సర్క్యూట్ కూడా జరగలేదు. పేలుడు తర్వాత కూడా కారు డోర్లు మరియు లాక్ సిస్టమ్ సాధారణంగానే పనిచేయడం విశేషం. దీనివల్ల రెస్క్యూ టీమ్‌కు కారును కట్ చేయాల్సిన అవసరం లేకుండానే, లోపల ఉన్న వారిని సులభంగా బయటకు తీయగలిగారు.

ఈ ఘటనతో BYD ఆటో 3కి యూరోపియన్ సేఫ్టీ టెస్టుల్లో వచ్చిన 5-స్టార్ రేటింగ్ అక్షరాలా నిజమని తేలిపోయింది. కారు కేవలం చూడటానికి స్టైలిష్‌గా ఉండటమే కాదు, అత్యవసర సమయాల్లో ప్రాణాలకు గ్యారెంటీ ఇస్తుందని నిరూపించుకుంది. ఈ ఘటన తర్వాత ఇజ్రాయెల్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ చైనీస్ ఈవీ కారుకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. టెక్నాలజీ ఎంత పెరిగినా, ప్రాణ రక్షణే పరమావధిగా తయారైన వాహనాలు మాత్రమే మార్కెట్‌లో నిలబడతాయని ఈ ఇన్సిడెంట్ చాటిచెప్పింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story