Mitsubishi: ఆఫ్‌రోడింగ్ ప్రేమికుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మిత్సుబిషి పజెరో దాదాపు 20 ఏళ్ల తర్వాత సరికొత్త రూపంలో తిరిగొస్తోంది. జపాన్‌కు చెందిన దిగ్గజ కార్ల తయారీ సంస్థ మిత్సుబిషి ఈ శక్తివంతమైన ఎస్‌యూవీని సెప్టెంబర్ 2న ప్రపంచానికి పరిచయం చేయనుంది. టయోటా ల్యాండ్ క్రూయిజర్‌కు గట్టి పోటీగా ఈ కారు మార్కెట్లోకి అడుగుపెడుతోంది. ఒకప్పుడు రాళ్లదారులు, కఠినమైన రహదారులను సైతం లీలగా దాటేస్తూ ఆఫ్‌రోడింగ్ ప్రపంచాన్ని ఏలిన మిత్సుబిషి పజెరో మళ్లీ వస్తుందనే వార్త కార్ల ప్రియుల్లో తీవ్ర ఉత్సాహాన్ని నింపింది. దాదాపు రెండు దశాబ్దాల విరామం తర్వాత కంపెనీ ఈ కారును పూర్తి స్థాయి ఆధునిక హంగులతో పునరుద్ధరిస్తోంది. జపాన్, అమెరికా, యూరప్, ఆగ్నేయాసియా దేశాల మార్కెట్లలో ముందుగా దీనిని విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. భారత్‌లోకి ఈ కొత్త మోడల్‌ను తీసుకొచ్చే విషయాన్నైతే కంపెనీ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

రఫ్‌ అండ్ టఫ్ ల్యాడర్-ఫ్రేమ్ ఛాసిస్

పాత పజెరో కారు దశాబ్దాల పాటు అంత గొప్ప గుర్తింపు సాధించడానికి దాని ధృడమైన బాడీ నిర్మాణమే ప్రధాన కారణం. కొత్త తరం పజెరోను కూడా అత్యంత కఠినమైన బాడీ-ఆన్-ఫ్రేమ్ లేదా ల్యాడర్-ఫ్రేమ్ ఛాసిస్ ఆధారంగా నిర్మిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ తరహా నిర్మాణం కొండలు, రాళ్లు, బురద దారుల్లో ఎటువంటి అడ్డంకులు లేకుండా సునాయాసంగా ప్రయాణించేందుకు అద్భుతమైన స్థిరత్వాన్ని ఇస్తుంది. గ్లోబల్ మార్కెట్‌లో టోయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో మోడల్‌కు నేరుగా సవాల్ విసిరేలా దీని డిజైన్ ఉండనుంది.

అత్యంత ఆధునిక ఎస్-ఎడబ్ల్యూసి టెక్నాలజీ

కొత్త పజెరోలో మిత్సుబిషి సంస్థకు చెందిన అత్యంత అధునాతన సూపర్ ఆల్-వీల్ కంట్రోల్(S-AWC) సిస్టమ్‌ను అమర్చనున్నట్లు సమాచారం. ఈ ఆల్-వీల్ డ్రైవ్ సాంకేతికత రహదారి పరిస్థితులను బట్టి, ప్రతి చక్రానికి అందాల్సిన పవర్‌ను అత్యంత కచ్చితత్వంతో నియంత్రిస్తుంది. మంచు, వర్షం, ఇసుక దారుల్లో వాహనం స్కిడ్ అవ్వకుండా పూర్తి నియంత్రణను డ్రైవర్‌కు అందిస్తుంది. ఇప్పటికే మిత్సుబిషి ట్రిటాన్ పికప్‌లో సక్సెస్ అయిన ఈ టెక్నాలజీ పజెరో ఆఫ్‌రోడింగ్ సామర్థ్యాన్ని సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లనుంది.

పవర్‌ఫుల్ డీజిల్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్

ఇంజిన్ వివరాలను కంపెనీ గోప్యంగా ఉంచినప్పటికీ, ఇందులో శక్తివంతమైన డీజిల్ హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ వాడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇది అద్భుతమైన ఆఫ్‌రోడ్ పెర్ఫార్మెన్స్‌ను అందించడమే కాకుండా మైలేజ్ విషయంలోనూ మెరుగైన ఫలితాలను ఇస్తుంది. కార్బన్ ఉద్గారాలను తగ్గించే క్రమంలో మిత్సుబిషి తన భవిష్యత్ ఎస్‌యూవీల కోసం ఈ హైబ్రిడ్ టెక్నాలజీకే ప్రాధాన్యత ఇస్తోంది.

Next Story