Driving Tips : వర్షపు నీటిలో కారు ఆగిపోయిందా? కార్ల డ్రైవర్లు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే
కార్ల డ్రైవర్లు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే

Driving Tips : భారతదేశంలో వర్షాకాలం ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చినప్పటికీ, వాహనదారులకు మాత్రం పెద్ద పరీక్షే పెడుతుంది. ముఖ్యంగా నగరాల్లో డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదకరంగా మారుతుంది. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడం వల్ల ఏ గుంత ఎక్కడ ఉందో తెలియక డ్రైవర్లు ఇబ్బంది పడుతుంటారు. చాలా మంది హడావిడిగా నీరు నిలిచిన రోడ్ల పైకి కారును తీసుకెళ్తుంటారు, ఈ క్రమంలో కారు మధ్యలోనే ఆగిపోతుంది. అలాంటప్పుడు డ్రైవర్లు కంగారు పడి చేసే కొన్ని తప్పులు కారును పూర్తిగా పనికిరాకుండా మార్చేస్తాయి.
మళ్లీ స్టార్ట్ చేయడం ఎందుకు ప్రమాదకరం?
వర్షపు నీటిలో వెళ్తున్నప్పుడు కారు అకస్మాత్తుగా ఆగిపోతే, దాన్ని మళ్లీ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించడం మీరు చేసే అన్నిటికంటే పెద్ద తప్పు. ఎందుకంటే, కారు సైలెన్సర్ లేదా ఎయిర్ ఫిల్టర్ ద్వారా నీరు నేరుగా ఇంజన్ లోపలికి చేరుకుంటుంది. ఇలా ఇంజన్ లోపలికి నీరు వెళ్లినప్పుడు హైడ్రాలిక్ లాక్ ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో ఇంజన్ లోని పిస్టన్లు కదల్లేవు, లోపలి భాగాలు విరిగిపోతాయి. దీనివల్ల ఇంజన్ పూర్తిగా ఫెయిల్ అయిపోతుంది, దాన్ని బాగు చేయడానికి లక్షల్లో ఖర్చు అవుతుంది.
డీజిల్, టర్బో ఇంజన్ కార్ల యజమానులు తస్మాత్ జాగ్రత్త
ఈ హైడ్రాలిక్ లాక్ సమస్య సాధారణ కార్ల కంటే డీజిల్ ఇంజన్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉన్న కార్లలో చాలా తీవ్రంగా ఉంటుంది. అంతేకాకుండా, కారు కింద భాగంలో నీరు చేరడం వల్ల ఆధునిక కార్లలో ఉండే సెన్సార్లు, ఎలక్ట్రానిక్ వైరింగ్, కంప్యూటర్ సిస్టమ్స్ (ECU) పూర్తిగా దెబ్బతింటాయి. అందువల్ల, నీటిలో కారు ఆగిపోయినప్పుడు సెల్ఫ్ స్టార్ట్ కొట్టాలనే ఆలోచనను పూర్తిగా పక్కన పెట్టేయడం మీ కారు ఆరోగ్యానికి ఎంతో మంచిది.
కారు ఆగిపోతే వెంటనే ఏం చేయాలి?
ఒకవేళ మీ కారు గనుక నీటిలో ఆగిపోతే, మొదట ప్రశాంతంగా ఉండండి. ఇంజన్ ఆన్ చేయడానికి అస్సలు ప్రయత్నించవద్దు. కారు కీ ని ఆఫ్ పొజిషన్ లోనే ఉంచి, కారు లోంచి కిందకి దిగి ప్రయాణీకుల సహాయంతో లేదా చుట్టుపక్కల వారి సహాయంతో కారును నెట్టుకుంటూ నీరు లేని సురక్షితమైన పొడి ప్రాంతానికి తీసుకెళ్లండి. ఆ తర్వాత మీ కారు కంపెనీకి చెందిన రోడ్‌సైడ్ అసిస్టెన్స్ (RSA) లేదా మీకు నమ్మకమైన నిపుణుడైన మెకానిక్ ని పిలిపించి కారును వారికి చూపించండి.
వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు
వర్షం పడేటప్పుడు ఎల్లప్పుడూ నీరు నిలిచిన రోడ్ల గుండా ప్రయాణించకుండా ఉండటానికే ప్రాధాన్యత ఇవ్వండి. ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే, ముందుగా నీటి లోతును అంచనా వేయండి. నీటిలో వెళ్లేటప్పుడు ఫస్ట్ గేర్ లేదా సెకండ్ గేర్ లో పెట్టి, కారు యాక్సిలరేటర్‌ను స్థిరంగా నొక్కాలి, కారు స్పీడ్ ను అకస్మాత్తుగా పెంచడం లేదా బ్రేకులు వేయడం చేయకూడదు. కారు నిరంతరంగా పొగను బయటకు పంపడం వల్ల సైలెన్సర్ లోకి నీరు వెళ్లకుండా ఉంటుంది.
కారు కండిషన్, విజిబిలిటీ చిట్కాలు
వర్షాకాలం ప్రారంభానికి ముందే మీ కారు టైర్లు, బ్రేకులు, వైపర్ల కండిషన్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. ఇంజన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, బ్యాటరీలను రెగ్యులర్ గా సర్వీసింగ్ చేయించాలి. వర్షం పడేటప్పుడు కారు అద్దాలపై పొగమంచు పేరుకుపోతుంది, దానివల్ల ముందు రోడ్డు కనిపించదు. అలాంటప్పుడు కారు అద్దాలు దించేయకుండా, లోపల ఏసీ ఆన్ చేసి డిఫాగర్‌ను ఆన్ చేయాలి. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే మీ కారు సురక్షితంగా ఉంటుంది. మీ జేబుకి భారీ ఖర్చులు మిగలవు.

