New SUVs : 3 రోజుల్లో 2 ఎస్‌యూవీలు లాంచ్.. తడాఖా చూపించనున్న టాటా, మహీంద్రా
తడాఖా చూపించనున్న టాటా, మహీంద్రా

New SUVs : భారత మార్కెట్లో ఎస్‌యూవీల మోజు రోజురోజుకు పెరుగుతోంది. ఈ ట్రెండ్‌ను కొనసాగించడానికి ఇప్పుడు రెండు అత్యంత ఆసక్తికరమైన ఎస్‌యూవీలు మార్కెట్‌లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. నవంబర్ 25 (మంగళవారం) నాడు టాటా సియెరా లాంచ్ కానుంది. ఆ తరువాత రెండు రోజులకే, నవంబర్ 27 (గురువారం) నాడు మహీంద్రా నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు XEV 9S విడుదల కానుంది. ఈ రెండు కొత్త వాహనాల ధరలు, ఫీచర్లు, ప్రత్యేకతల వివరాలు ఇలా ఉన్నాయి.
టాటా సియెరా
టాటా సియెరా మూడు రకాల పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో (పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్) మార్కెట్‌లోకి వస్తుందని తెలుస్తోంది. ఇందులో కొత్త 1.5 లీటర్ TGDi టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. ఇది 168-170 bhp పవర్, 280 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. అలాగే, 2.0-లీటర్ Kryotech డీజిల్ ఇంజిన్ కూడా లభించే అవకాశం ఉంది. ఇది 168 bhp పవర్, 350 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ రెండింటిలోనూ మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు దొరుకుతాయి. టాటా సియెరా ఈవీ సింగిల్ లేదా డ్యూయల్ మోటార్ ఆప్షన్లతో లాంచ్ కావచ్చు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 450 నుంచి 550 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగలదని అంచనా. టాటా సియెరా ధర రూ.12.50 లక్షల నుంచి రూ.18.05 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.
మహీంద్రా XEV 9S
మహీంద్రా, ప్రీమియం 7-సీటర్ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో తమ స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి XEV 9S ను నవంబర్ 27 న లాంచ్ చేయబోతోంది. ఈ కారు రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో (59 kWh మరియు 79 kWh) లాంచ్ కావచ్చు. ఇవి రెండూ రేర్-వీల్-డ్రైవ్ సెటప్‌తో రావొచ్చు. మహీంద్రా XEV 9e ఇప్పటికే 500 కిలోమీటర్ల రేంజ్ ఇస్తున్నందున, ఈ కొత్త 7-సీటర్ కారు XEV 9S కూడా దాదాపు 500 కిలోమీటర్ల రేంజ్‌ను ఇచ్చే అవకాశం ఉంది. XEV 9S ఎస్‌యూవీ ప్రీమియం 7-సీటర్ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో పోటీ పడుతుంది. దీని ధర రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ రెండు కొత్త ఎస్‌యూవీల లాంచ్‌తో భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ మరింత ఉత్సాహంగా మారనుంది.

