Car Sales: భారతీయ ఆటోమొబైల్ రంగంలో నవరాత్రి పండుగ సీజన్ అద్భుతమైన ఊపును తెచ్చింది. దేశవ్యాప్తంగా కేవలం తొమ్మిది రోజుల నవరాత్రి కాలంలో ఏకంగా 10.32 లక్షల వాహనాల రిటైల్ విక్రయాలు నమోదయ్యాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గత ఏడాది ఇదే పండుగ సీజన్‌తో పోలిస్తే మొత్తం వాహనాల అమ్మకాల్లో 1.95 శాతం వృద్ధి నమోదైంది. ఈ లెక్కన చూస్తే నవరాత్రుల సమయంలో దేశంలో సగటున ప్రతి సెకనుకు ఒకటికి పైగా వాహనం అమ్ముడైంది. రోజువారీగా చూస్తే దాదాపు 1.15 లక్షల వాహనాలు రోడ్డెక్కాయి.

మొత్తం విక్రయాలలో ద్విచక్ర వాహనాల పాత్ర అత్యంత కీలకంగా నిలిచింది. టూ-వీలర్ల విక్రయాలు 5.78 శాతం వృద్ధితో 7.60 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. మొత్తం సేల్స్‌లో వీటి వాటా దాదాపు మూడు వంతులుగా ఉంది. అలాగే కమర్షియల్ వాహనాల అమ్మకాలు 14.21 శాతం పెరిగి 34,120 యూనిట్లకు చేరగా, ట్రాక్టర్ల విక్రయాలు 8.87 శాతం వృద్ధితో 20,912 యూనిట్లుగా నమోదయ్యాయి. మరోవైపు త్రి-వీలర్ల అమ్మకాలు మాత్రం స్వల్పంగా 1.65 శాతం తగ్గి 43,057 యూనిట్లకు పరిమితమయ్యాయి.

మొత్తం మార్కెట్ సానుకూలంగా ఉన్నప్పటికీ, ప్యాసింజర్ వాహనాలు అంటే కార్లు అలాగే ఎస్‌యూవీల విభాగంలో మాత్రం అమ్మకాలు తగ్గాశాయి. ఈ సెగ్మెంట్‌లో ఏడాది ప్రాతిపదికన 13.66 శాతం క్షీణత ఏర్పడి, కేవలం 1.72 లక్షల యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో జీఎస్టీ సంస్కరణల కారణంగా కార్ల ధరలు తగ్గడంతో భారీగా కొనుగోళ్లు జరిగాయి. దీనివల్ల ఈ ఏడాది బేస్ ఇయర్ గణాంకాలు చాలా ఎక్కువగా ఉండటంతో, కార్ల అమ్మకాల్లో తాత్కాలికంగా తగ్గుదల కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

పండుగ సీజన్ జోరుగా సాగుతున్నప్పటికీ, డీలర్ల వద్ద కార్ల నిల్వలు భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సెప్టెంబర్ చివరి నాటికి ప్యాసింజర్ వాహనాల స్టాక్ దాదాపు 45 రోజుల అమ్మకాలకు సరిపడా చేరింది. ఇది గత ఏడాది కాలంలోనే అత్యధికం. తయారీదారులు పంపిన వాహనాలు అలాగే అసలు రిజిస్ట్రేషన్ల మధ్య వ్యత్యాసం కారణంగా నిల్వలు పెరిగాయి. దీపావళి నాటికి ఈ స్టాక్‌ను క్లియర్ చేయడానికి కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటించే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో పండుగ డిమాండ్ మరింత ఊపందుకుంటుందని డీలర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Next Story