Car Safety: కార్లలో ఈ 5 వస్తువులను వదలకండి.. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు
చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు

Car Safety: నేటి ఆధునిక జీవనశైలిలో కారు కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాకుండా మన దైనందిన జీవితంలో ఒక ముఖ్య భాగమైపోయింది. ఈ క్రమంలో తొందరపాటులో అనేక వస్తువులను కారులోనే మరిచిపోతుంటాం. అయితే తీవ్రమైన ఎండలో పార్క్ చేసిన కారు లోపలి ఉష్ణోగ్రత నిమిషాల్లోనే విపరీతంగా పెరిగిపోతుంది. ఇది కారులో ఉన్న కొన్ని వస్తువులను పాడుచేయడమే కాకుండా, భద్రతాపరమైన తీవ్ర ముప్పుకు దారితీస్తుంది. వర్షాకాలంలో కూడా తేమ కారణంగా కారులోని వస్తువులు పాడైపోయే అవకాశం ఉంది.
1. ఔషధాలు
మీరు రోజూ వాడే మందులను కారులో వదిలివేయడం చాలా ప్రమాదకరం. తీవ్రమైన ఎండ, వేడి వల్ల మందులలోని రసాయన నిర్మాణం మారిపోయి, వాటి ప్రభావం తగ్గిపోతుంది. అత్యవసర సమయంలో ఆ మందులు వాడినా ఎలాంటి ఫలితం ఉండదు. కాబట్టి, మందులను ఎల్లప్పుడూ తగిన ఉష్ణోగ్రతలోనే ఉంచాలి. కారు దిగేటప్పుడు మీతో పాటు తీసుకెళ్లడం మర్చిపోకూడదు.
2. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు (ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు)
మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు లేదా పవర్ బ్యాంక్‌లను వేడి కారులో వదిలేయడం వల్ల వాటిలోని లిథియం-అయాన్ బ్యాటరీలు వేడెక్కి శాశ్వతంగా పాడైపోతాయి. కొన్నిసార్లు బ్యాటరీలు పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. అంతేకాకుండా కారు సీట్లపై ఖరీదైన గ్యాడ్జెట్లు కనిపిస్తే దొంగలు అద్దాలు పగలగొట్టి దొంగిలించే అవకాశం ఉంది. దీనివల్ల వస్తువులతో పాటు కీలక డేటా కూడా చేజారిపోతుంది.
3. సన్‌స్క్రీన్ లోషన్లు
సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడే సన్‌స్క్రీన్‌లను వేడి కారులో ఉంచితే, అధిక ఉష్ణోగ్రత వల్ల అందులోని క్రియాశీల పదార్థాలు దెబ్బతింటాయి. అంతేకాకుండా గాలి ఒత్తిడి పెరిగి సన్‌స్క్రీన్ ట్యూబ్ లేదా బాటిల్ లీక్ అయి లీక్ కావడం లేదా పగిలిపోవడం జరగవచ్చు. ఇది కారు సీట్లను, ఇంటీరియర్‌ను పాడు చేస్తుంది.
4. ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్లు
కారులో ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు ఉంచడం చాలా మందికి అలవాటు. కానీ గంటల తరబడి ఎండలో ఉన్న ప్లాస్టిక్ బాటిల్లోని నీరు తాగడం ఆరోగ్యానికి తీవ్ర హానికరం. వేడికి ప్లాస్టిక్ కరిగి హానికరమైన మైక్రోప్లాస్టిక్స్, రసాయనాలు నీటిలో కలుస్తాయి. నీరు తాగాలనుకుంటే కారులో స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిళ్లను ఉపయోగించడం లేదా ఎప్పటికప్పుడు తాజా నీటిని వెంట తీసుకెళ్లడం మంచిది.
5. పర్సులు, హ్యాండ్‌బ్యాగులు
కారు పార్క్ చేసి పర్సు లేదా హ్యాండ్‌బ్యాగ్‌లను సీటుపైనే వదిలేయడం దొంగలను ఆహ్వానించడమే అవుతుంది. కారు బయటి నుంచి చిన్న సంచి కనిపించినా దొంగలు అద్దాలు పగలగొడతారు. అత్యవసరంగా కారులోనే ఉంచాల్సి వస్తే, సీట్లపై కాకుండా కారు డిక్కీలో దాచి ఉంచడం సురక్షితం. కారు లాక్ చేసే ముందు ఒకసారి అన్ని సీట్లను చెక్ చేసుకోవడం శ్రేయస్కరం.

