Maruti Brezza : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో ఒకటైన మారుతి బ్రెజ్జా ఇప్పుడు సరికొత్త అవతారంలో అలరించడానికి సిద్ధమవుతోంది. వచ్చే నెల అంటే జూలైలో మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ 2026 షోరూమ్‌లలోకి వచ్చే అవకాశం ఉంది. కంపెనీ ఇంకా దీని లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఈ కారు టెస్టింగ్ దశలో ఉన్నప్పుడు తీసిన స్పై చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, ఈ సరికొత్త బ్రెజ్జా మోడల్‌లో కస్టమర్లను ఆకట్టుకునేలా 7 పెద్ద మార్పులు చేయబోతున్నారు.

ఈ 2026 మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌లో రాబోతున్న అత్యంత పెద్ద మార్పు దీని ఇంజన్ విభాగంలోనే ఉండనుంది. ఈసారి కంపెనీ ఇందులో సరికొత్త 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను పరిచయం చేసే అవకాశం ఉంది. ఇది దాదాపు 100 bhp పవర్, 147 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ పవర్‌ఫుల్ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో రావచ్చు. దీనితో పాటు ప్రస్తుతం అందుబాటులో ఉన్న పాత 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌ను కూడా కంపెనీ అలాగే కొనసాగించనుంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది.

అండర్ బాడీ ట్యాంక్ సిస్టమ్‌తో వస్తున్న సరికొత్త మోడల్

సాధారణంగా సీఎన్‌జీ కార్లు కొనేవారికి డిక్కీలో లగేజ్ పెట్టుకోవడానికి అస్సలు స్థలం ఉండదు. కానీ ఈ సమస్యకు మారుతి సుజుకి ఈసారి అదిరిపోయే చెక్ పెట్టింది. కొత్త బ్రెజ్జా సీఎన్‌జీ వేరియంట్‌లో ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సీఎన్‌జీ సెటప్ ఉంటుంది, అయితే ఈసారి సిలిండర్‌ను కారు లోపల కాకుండా కింద భాగంలో అంటే అండర్ బాడీలో అమర్చనున్నారు. దీనివల్ల కారు బూట్ స్పేస్ చాలా పెరుగుతుంది, కస్టమర్లు తమ సామాన్లను ఎంచక్కా సర్దుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న సీఎన్‌జీ మోడల్ 1.5 లీటర్ ఇంజన్‌తో 86 bhp పవర్ ఇస్తూ కేవలం 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తోంది.

వెడల్పైన ఫ్రంట్ గ్రిల్, క్రోమ్ స్ట్రిప్..

కారు బాహ్య డిజైన్ విషయానికి వస్తే, ఇందులో కొన్ని చిన్న కానీ చాలా అవసరమైన మార్పులు చేశారు. లీకైన చిత్రాల ప్రకారం, ఈ ఎస్‌యూవీ ముందు భాగంలో సరికొత్త, మరింత వెడల్పైన ఫ్రంట్ గ్రిల్ ఉండబోతోంది. ఈ గ్రిల్ మధ్యలో లావుపాటి క్రోమ్ స్ట్రిప్, అప్‌డేట్ చేసిన బంపర్ కారుకు మరింత అగ్రెసివ్ లుక్‌ను ఇస్తాయి. కారు ముందు ఉండే స్కిడ్ ప్లేట్ డిజైన్‌ను కూడా మార్చారు. అయితే, కారు సైడ్ ప్రొఫైల్, వెనుక భాగం డిజైన్ దాదాపు పాత మోడల్ లాగే ఉంటుంది. కారు పొడవు, వెడల్పు, ఎత్తులో ఎలాంటి మార్పులు లేవు.

10.1 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్

కారు లోపలి భాగం విషయానికి వస్తే, క్యాబిన్‌ను మరింత లగ్జరీగా మార్చేశారు. ఇందులో సరికొత్తగా 10.1 ఇంచుల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించబోతున్నారు. దీనితో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్, వేసవిలో చల్లదనాన్నిచ్చే వెంట్లేటెడ్ సీట్లు, సరికొత్త సీట్ మెటీరియల్, కారు లోపలి నుంచి ఆకాశాన్ని చూసేలా అద్భుతమైన పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వంటి మోడ్రన్ ఫీచర్లు ఉండనున్నాయి. కారును పార్కింగ్ చేయడం సులువుగా మార్చడానికి 360-డిగ్రీ కెమెరా వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు కూడా ఇందులో తోడుకానున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story