Bajaj Pulsar NS400Z : బజాజ్ ఆటో తన పవర్‌ఫుల్ బైక్ పల్సర్ NS400Zలో ఒక అనూహ్యమైన మార్పును తీసుకొచ్చింది. ఇప్పటివరకు 400cc విభాగంలో అలరించిన ఈ బైక్, ఇప్పుడు 350cc ఇంజిన్‌తో కొత్త అవతారంలో లాంచ్ అయ్యింది. ఈ మార్పు వెనుక ఉన్న అసలు కారణం వినియోగదారులకు పన్నుల భారం తగ్గించడమే. 400cc బైకులపై ప్రభుత్వం ఏకంగా 40% జీఎస్టీ వసూలు చేస్తుంటే, 350cc లోపు బైకులపై కేవలం 18% మాత్రమే పన్ను పడుతుంది. ఈ లాజిక్‌తోనే బజాజ్ తన స్ట్రాటజీని మార్చి, రాయల్ ఎన్‌ఫీల్డ్, ట్రయంఫ్ వంటి దిగ్గజాలు రాజ్యమేలుతున్న 350cc విభాగంలోకి పల్సర్‌ను దింపింది.

ఇంజిన్, పెర్ఫార్మెన్స్‌లో మార్పులు

కొత్త పల్సర్ NS400Z లో 349.13cc లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. గతంలో ఉన్న 373cc ఇంజిన్ స్థానంలో ఇది వచ్చింది. పాత మోడల్ 43 PS పవర్, 35 Nm టార్క్‌ని ఇచ్చేది. ఇప్పుడు కొత్త ఇంజిన్ 40.6 PS పవర్, 33.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే పవర్ కొంచెం తగ్గినట్లు అనిపించినా, హై RPM వద్ద ఈ బైక్ అద్భుతమైన స్పోర్టీ అనుభూతిని ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ముఖ్యంగా వేగంగా బైక్ నడపాలనుకునే వారికి ఈ మార్పు బాగా నచ్చుతుంది.

జీఎస్టీ మ్యాజిక్ - ధరల వెనుక అసలు కథ

ప్రస్తుత నిబంధనల ప్రకారం 350cc కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైకులపై భారీగా పన్ను పడుతోంది. అందుకే బజాజ్ తన ఇంజిన్ స్ట్రోక్‌ను 60 mm నుంచి 56.1 mm కి తగ్గించి, దీనిని 350cc లోపు కేటగిరీలోకి తీసుకొచ్చింది. దీనివల్ల జీఎస్టీ 40% నుంచి 18% కి తగ్గుతుంది. అయితే కంపెనీ ఈ పన్ను లాభాన్ని ధర తగ్గింపు రూపంలో కాకుండా, ఇతర ఖర్చులను సర్దుబాటు చేయడానికే వాడుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే బైక్ ధరలో పెద్దగా మార్పు రాలేదు.

డిజైన్, అదిరిపోయే ఫీచర్లు

లుక్ పరంగా పల్సర్ NS400Z ఎప్పటిలాగే మస్కులర్ బాడీలో చాలా అగ్రెసివ్‌గా కనిపిస్తుంది. ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, మజిల్ ట్యాంక్, యూఎస్‌డీ ఫ్రంట్ ఫోర్క్స్ దీనికి ప్రీమియం లుక్ ఇస్తున్నాయి. టెక్నాలజీ పరంగా చూస్తే ఇందులో రైడ్-బై-వైర్ థొరెటల్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా రోడ్, రెయిన్, స్పోర్ట్, ఆఫ్-రోడ్ అనే నాలుగు రైడింగ్ మోడ్స్ కూడా ఇందులో లభిస్తాయి.

కొత్త ఇంజిన్ క్యారెక్టర్ మునుపటి కంటే భిన్నంగా ఉండబోతోంది. పాత బైక్ తక్కువ స్పీడ్ లో ఉన్నప్పుడు కూడా మంచి పంచ్ ఇచ్చేది. కానీ ఇప్పుడు పవర్, టార్క్ రెండూ హై RPM వద్దే లభిస్తాయి. అంటే మీరు బైక్‌ను వేగంగా నడిపినప్పుడు మాత్రమే ఆ కిక్ తెలుస్తుంది. సిటీ ట్రాఫిక్‌లో కొంచెం నెమ్మదిగా అనిపించినా, హైవే మీద మాత్రం ఈ 350cc పల్సర్ రెచ్చిపోతుంది. మైలేజ్ విషయంలో పెద్ద మార్పులు లేకపోయినా, స్పోర్టీ బైక్ ప్రియులకు ఇది మంచి ఛాయిస్.

PolitEnt Media

PolitEnt Media

Next Story