BMW M 1000 RR: ప్రముఖ లగ్జరీ బైక్ తయారీ సంస్థ BMW మోటరాడ్ భారత మార్కెట్లో కొత్త M 1000 RR సూపర్‌బైక్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూమ్ ధరను రూ.59.90 లక్షలుగా నిర్ణయించింది. రేసింగ్ ట్రాక్‌పై అత్యుత్తమ పనితీరు అందించేలా రూపొందించిన ఈ బైక్‌ను పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా BMW మోటరాడ్ డీలర్‌షిప్‌లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈసారి భారత్‌లో M కాంపిటిటేషన్ ప్యాకేజ్ ను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. గత మోడల్‌తో పోలిస్తే ఇంజిన్ పవర్, ఏరోడైనమిక్స్, ఎలక్ట్రానిక్ ఫీచర్లలో మార్పులు చేశారు.

999cc ఇంజిన్.. 300 kmph దాటే వేగం

కొత్త BMW M 1000 RRలో 999cc ఇన్‌లైన్ 4 సిలిండర్ ఇంజిన్ ఇచ్చారు. ఇది 14,500 rpm వద్ద 215 bhp పవర్, 11,100 rpm వద్ద 113 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. పాత మోడల్‌తో పోలిస్తే పవర్ 6 bhp పెరిగింది. ఇంజిన్ సిలిండర్ హెడ్, పోర్ట్ డిజైన్, కంబషన్ ఛాంబర్‌లో మార్పులు చేశారు. టైటానియం వాల్వ్స్, ఎగ్జాస్ట్ వ్యవస్థను కూడా అప్‌డేట్ చేశారు. 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. గరిష్ఠ వేగం గంటకు 300 కిలోమీటర్లకు పైగా ఉంటుందని కంపెనీ స్పెసిఫికేషన్లు సూచిస్తున్నాయి. కొత్త షార్ట్ స్ట్రోక్ థ్రాటిల్‌తో పూర్తి యాక్సిలరేషన్ కోసం రైడర్ మణికట్టును కేవలం 58 డిగ్రీలు తిప్పితే సరిపోతుంది.

కార్బన్ ఫైబర్ వింగ్లెట్స్

ఈ బైక్ ముందు భాగానికి కొత్త డిజైన్ ఇచ్చారు. కార్బన్ ఫైబర్ రీన్‌ఫోర్స్‌డ్ మెటీరియల్‌తో తయారు చేసిన M Winglets 3.0 ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇవి వేగంగా ప్రయాణించే సమయంలో బైక్‌కు మరింత డౌన్‌ఫోర్స్ అందించేందుకు ఉపయోగపడతాయి. దీంతో ముందు చక్రానికి మెరుగైన స్థిరత్వం లభిస్తుంది. ఫ్రేమ్‌లోనూ మార్పులు చేశారు. ఎడమవైపు కొత్త ఇంజిన్ మౌంట్, స్టీరింగ్ హెడ్ దగ్గర ఫ్రేమ్ ఫ్లెక్సిబిలిటీని మెరుగుపరిచారు. బైక్ బరువు 194 కిలోలుగా ఉంది.

కొత్త ఎలక్ట్రానిక్ ఫీచర్లు

కొత్త M 1000 RRలో డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కు స్లైడ్ కంట్రోల్ ఫీచర్ జోడించారు. స్టీరింగ్ యాంగిల్ సెన్సార్ సాయంతో ఇది పనిచేస్తుంది. వేగంగా యాక్సిలరేట్ చేస్తున్నప్పుడు నియంత్రిత పద్ధతిలో బైక్ వెనుక చక్రం జారేలా చేసే పరిస్థితుల్లో రైడర్‌కు సహాయం చేస్తుంది. BMW రేస్ ఏబీఎస్ ప్రోతో బ్రేక్ స్లైడ్ అసిస్ట్ కూడా అందించారు. బ్రేకులు వేస్తున్న సమయంలో బైక్ అదుపు తప్పకుండా ఉండేందుకు ఈ వ్యవస్థ తోడ్పడుతుంది. ట్రాక్‌పై ఉపయోగించేందుకు ప్రత్యేక స్లైక్ ఏబీఎస్ ప్రో సెట్టింగ్ కూడా ఉంది.

3 ఏళ్ల వారంటీ

భారత్‌లో విక్రయించే ప్రతి M 1000 RRలో M కాంపిటిటేషన్ ప్యాకెజ్ స్టాండర్డ్‌గా ఉంటుంది. ఇందులో M కార్బన్ వీల్స్, కార్బన్ ఫైబర్ భాగాలు, తక్కువ బరువున్న M ఫుట్‌రెస్ట్ సిస్టమ్, DLC కోటింగ్ ఉన్న M ఎండ్యూరన్స్ చైన్, M GPS Laptrigger యాక్టివేషన్ కోడ్ ఉన్నాయి. కొత్త ఫుట్‌రెస్ట్ వ్యవస్థతో 220 గ్రాముల బరువు తగ్గుతుంది. బ్లాక్ స్ట్రోమ్ మెటాలిక్ రంగులో M గ్రాఫిక్స్‌తో ఈ బైక్ అందుబాటులో ఉంటుంది. BMW ఈ సూపర్‌బైక్‌పై మూడు సంవత్సరాల అన్‌లిమిటెడ్ కిలోమీటర్ల వారంటీ ఇస్తోంది. కావాలనుకుంటే నాలుగో, ఐదో సంవత్సరానికి కూడా వారంటీ పొడిగించుకోవచ్చు. 24 గంటల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సదుపాయం కూడా ఉంది.

Next Story