New Bolero vs Old: కొత్త బోలెరో vs పాత బోలెరో.. 5 కీలక పాయింట్లలో అప్‌గ్రేడ్స్ వివరాలు ఇవే
5 కీలక పాయింట్లలో అప్‌గ్రేడ్స్ వివరాలు ఇవే

New Bolero vs Old: మహీంద్రా తన అత్యంత ప్రజాదరణ పొందిన యుటిలిటీ వాహనాలైన బోలెరో, బోలెరో నియో ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్‌లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ కొత్త మోడళ్లలో డిజైన్, ఫీచర్లలో అనేక మార్పులు చేశారు. అయితే, వీటి పాత లుక్ మాత్రం కంపెనీ మార్చలేదు. కొత్త వెర్షన్‌లలో మెకానికల్ మార్పుల కంటే, కారులోని ఫెసిలిటీలు, ఫీచర్లు, లుక్ మెరుగుపరచడం మీదే ఎక్కువగా దృష్టి పెట్టారు.
కొత్త బోలెరో నియో ధర ఇప్పుడు రూ.8.49 లక్షల నుండి రూ.9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇక బోలెరో ధరలు రూ.7.99 లక్షల నుండి రూ.9.69 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఇంజిన్‌ల విషయానికొస్తే పాత మోడళ్లలో ఉన్న ఇంజిన్లే కొనసాగుతున్నాయి. అయితే, మహీంద్రా కొత్త రైడ్‌ఫ్లో సస్పెన్షన్ ట్యూనింగ్ కారణంగా ఈ రెండు ఎస్‌యూవీల రైడ్ క్వాలిటీ గతంలో కంటే మెరుగైందని చెప్పవచ్చు.
కొత్త డిజైన్, గ్రిల్
డిజైన్ పరంగా, బోలెరో నియో ఫేస్‌లిఫ్ట్ ముందు భాగంలో మార్పులు చేసింది. ఇందులో అడ్డంగా ఉండే క్రోమ్ స్లాట్‌లతో కూడిన కొత్త గ్రిల్ ఉంది, ఇది కారుకు మరింత ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. అదేవిధంగా, బోలెరోలో కూడా క్రోమ్ హైలైట్స్‌తో కూడిన కొత్త గ్రిల్ కనిపిస్తుంది. ఇది దాని మునుపటి బలమైన గుర్తింపును కొనసాగిస్తూనే మరింత క్లీన్, లేటెస్ట్ లుక్ ఇస్తుంది.
కలర్ ఆప్షన్లు, వేరియంట్లు
బోలెరో నియో ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు రెండు కొత్త పెయింట్ షేడ్స్‌లో లభిస్తుంది: జీన్స్ బ్లూ, కాంక్రీట్ గ్రే. ఈ కొత్త రంగులు టాప్-ఎండ్ N11 వేరియంట్‌లో లభిస్తాయి. N11 వేరియంట్ డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉంది. మరోవైపు, బోలెరోలో కొత్తగా స్టీల్త్ కలర్ ఆప్షన్ వచ్చింది. ఇది అన్ని ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. దీంతోపాటు కంపెనీ ఈ లైనప్‌ను విస్తరిస్తూ కొత్త B8 వేరియంట్‌ను కూడా ప్రవేశపెట్టింది.
ఇంటీరియర్, కేబిన్ అప్‌గ్రేడ్
కేబిన్ లోపల, మహీంద్రా రెండు మోడళ్లకూ కొత్త లుక్ ఇచ్చింది. బోలెరో నియో N11 వేరియంట్‌లో కొత్త లూనార్ గ్రే ఇంటీరియర్ థీమ్ ఉంది. ఇది పాత మోడళ్లలో ఉన్న ముదురు మోచా బ్రౌన్ రంగు కంటే కాస్త తేలికగా ఉంటుంది. సీట్లలో మెరుగైన కుషనింగ్ సౌకర్యాన్ని పెంచుతుంది. బోలెరో కూడా మరింత మృదువైన సీట్లు, డోర్ ట్రిమ్స్‌లో కొత్తగా బాటిల్ హోల్డర్లను కలిగి ఉంది. టాప్ B8 వేరియంట్‌లో లెదరెట్ అప్‌హోల్స్టరీ ఉంది. ఇది ఇంటీరియర్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.
కొత్త ఫీచర్లు, టెక్నాలజీ
డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి, టాప్ వేరియంట్లలో ఫీచర్లను అప్‌డేట్ చేశారు. బోలెరో నియో N10, N11 ట్రిమ్‌లలో ఇప్పుడు కొత్తగా 8.9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రియర్-వ్యూ కెమెరా, USB-C ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి. బోలెరో B8 వేరియంట్‌లో టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ఫాగ్ ల్యాంప్స్, USB-C పోర్ట్‌లు వంటి ఫీచర్ అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి. ఈ మార్పులు బోలెరో మోడళ్లను ఇతర లేటెస్ట్ ఎస్‌యూవీలకు దగ్గరగా తీసుకొచ్చాయి.
మెరుగైన రైడ్ క్వాలిటీ
ఇంజిన్‌లలో ఎలాంటి మార్పు చేయకపోయినప్పటికీ, రెండు ఎస్‌యూవీలకు కొత్త రైడ్‌ఫ్లో సిస్టమ్ కింద సస్పెన్షన్ సెటప్ అప్‌గ్రేడ్ చేశారు. ఇది ముఖ్యంగా గతుకుల రోడ్లపై మెరుగైన హ్యాండ్లింగ్, సౌకర్యాన్ని అందిస్తుంది. ఇది పాత బోలెరోతో పోలిస్తే కచ్చితంగా గొప్ప అప్‌గ్రేడ్ అని చెప్పవచ్చు.
