Hyundai Venue : హుందాయ్ వెన్యూ సెన్సేషన్.. ఫస్ట్ టైం వర్క్ షాప్ అవసరం లేకుండా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్
ఫస్ట్ టైం వర్క్ షాప్ అవసరం లేకుండా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్

Hyundai Venue : సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన హుందాయ్ వెన్యూ కొత్త తరం మోడల్‌తో మార్కెట్‌లో సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. నవంబర్ 4, 2025 నాడు లాంచ్ కానున్న ఈ న్యూ జనరేషన్ వెన్యూ, లుక్స్, సేఫ్టీతో పాటు టెక్నాలజీ పరంగా భారీ అప్‌డేట్‌లను పొందనుంది. భారత మార్కెట్‌లో తొలిసారిగా హుందాయ్ అడ్వాన్స్‌డ్ ccNC (Connected Car Navigation Cockpit) సిస్టమ్‌ను పరిచయం చేయబోతుంది.
న్యూ జనరేషన్ హుందాయ్ వెన్యూలో అత్యంత ముఖ్యమైన మార్పు, కంపెనీ అడ్వాన్సుడ్ కనెక్టివిటీ, నావిగేషన్ సిస్టమ్. ఈ కొత్త ఎస్‌యూవీలో హుందాయ్ తన కొత్త ccNC సిస్టమ్‌ను భారతదేశంలో మొదటిసారిగా పరిచయం చేస్తోంది. NVIDIA టెక్నాలజీతో రూపొందించబడిన ఈ సిస్టమ్, నాలుగు మీటర్ల కంటే చిన్న ఎస్‌యూవీలలో ఇన్-కార్ ఎక్స్ పీరియన్స్ నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్తుంది.
ఇందులో ఏకంగా రెండు 12.3-అంగుళాల కర్వ్‌డ్ పనోరమిక్ స్క్రీన్‌లు ఇచ్చారు. ఇవి ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలుపుతాయి. ఆన్‌బోర్డ్ నావిగేషన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. కొత్త వెన్యూ సాఫ్ట్‌వేర్-డిఫైన్డ్ వెహికల్ (SDV) టెక్నాలజీ పొందిన తొలి హ్యుందాయ్ కారుగా నిలిచింది. ఈ SDV టెక్నాలజీ ద్వారా కారుకు ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌లు లభిస్తాయి. అంటే, దాదాపు 20 వెహికల్ కంట్రోల్ సిస్టమ్స్ వర్క్‌షాప్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు అందుతాయి.
హ్యుందాయ్ బ్లూలింక్ టెక్నాలజీ కింద, రిమోట్ ఇంజిన్ స్టార్ట్/స్టాప్, క్లైమేట్ కంట్రోల్, జియోఫెన్సింగ్, వెహికల్ డయాగ్నోస్టిక్స్ వంటి 70 కనెక్టెడ్ కార్ ఫీచర్‌లను ఇందులో అందించారు. సౌండ్ క్వాలిటీ, వాయిస్ కమాండ్‌ల విషయంలో కూడా కొత్త వెన్యూ అద్భుతమైన మార్పులు తెచ్చింది. కొత్త తరం ఆంప్లిఫైయర్‌తో కూడిన బోస్ 8-స్పీకర్ల ప్రీమియం సౌండ్ సిస్టమ్‌ను ఇందులో అమర్చారు. దీనివల్ల సౌండ్ క్వాలిటీ, బాస్ మరింత మెరుగ్గా ఉంటుంది.
ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో JioSaavn యాప్ ను ముందుగానే ఇచ్చారు. మొబైల్ కనెక్ట్ చేయకుండానే నేరుగా సంగీతం వినే అవకాశం లభిస్తుంది. ccNC సిస్టమ్‌లో ఏకంగా 400 పైగా వాయిస్ కమాండ్‌లు ఉన్నాయి. వీటి ద్వారా సన్‌రూఫ్, క్లైమేట్ కంట్రోల్, నావిగేషన్ వంటి ఫీచర్లను సులభంగా ఆపరేట్ చేయవచ్చు. ఈ సిస్టమ్ హిందీ, ఇంగ్లీష్, హింగ్లీష్, బెంగాలీ, తమిళం వంటి పలు భాషల్లో పనిచేస్తుంది. కొత్త వెన్యూలో ప్రయాణికులకు సౌకర్యాన్ని, డ్రైవర్‌కు సేఫ్టీని పెంచే అనేక ఫీచర్లు యాడ్ చేశారు. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వాయిస్ ద్వారా పనిచేసే స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్, కూల్డ్ గ్లవ్‌బాక్స్, డ్రైవర్ కోసం 4-వే ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీటు ఉన్నాయి. వెనుక ప్రయాణికులకు ఏసీ వెంట్లు, రెండు-స్టెప్‌ల రెక్లైనింగ్ సీట్లు లభిస్తాయి.
సేఫ్టీ కోసం సరౌండ్ వ్యూ మానిటర్ ఉంది. ఇది 360-డిగ్రీ కెమెరా వ్యూ ఇస్తుంది. బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్ వంటి ఫీచర్లు పార్కింగ్, ఇరుకైన ప్రదేశాలలో డ్రైవింగ్‌కు సహాయపడతాయి. TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), పార్కింగ్ సెన్సార్లు కూడా ఉన్నాయి.

