Kia Seltos : పెరిగిన సైజు..అదిరిపోయే స్టెబిలిటీ..అనంతపూర్ కియా ప్లాంట్‌లో సెల్టోస్ సందడి
అనంతపూర్ కియా ప్లాంట్‌లో సెల్టోస్ సందడి

Kia Seltos : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ ప్లాంట్ నుంచి సరికొత్త కియా సెల్టోస్ మొదటి యూనిట్ విజయవంతంగా రోల్-అవుట్ అయ్యింది. 2026 జనవరి 2న ఈ కారు ధరలను అధికారికంగా ప్రకటించనుండగా, అప్పటికే మార్కెట్లో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాత మోడల్‌తో పోలిస్తే ఇది కేవలం డిజైన్ పరంగానే కాకుండా.. కొలతలు, ఫీచర్ల పరంగా కూడా భారీ మార్పులతో వస్తోంది. కొత్త కియా సెల్టోస్ ఇప్పుడు మునుపటి కంటే మరింత భారీగా మారింది. దీని పొడవు 4,460 మి.మీ., వెడల్పు 1,830 మి.మీ, వీల్‌బేస్ 2,690 మి.మీ.గా ఉంది. పాత మోడల్‌తో పోలిస్తే ఇది 95 మి.మీ. పొడవు, 80 మి.మీ. ఎక్కువ వీల్‌బేస్‌ను కలిగి ఉంది. దీనివల్ల కారు లోపల లెగ్-రూమ్ పెరగడమే కాకుండా, హైవేలపై వేగంగా వెళ్లేటప్పుడు కారుకు మంచి పట్టు లభిస్తుంది. అంతేకాకుండా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 200 మి.మీకు పెరగడంతో గుంతల రోడ్లపై ప్రయాణం మరింత సులభం కానుంది.
కొత్త సెల్టోస్ ఎక్స్‌టీరియర్ పరంగా చాలా మస్కులర్‌గా కనిపిస్తోంది. కియా సిగ్నేచర్ డిజిటల్ టైగర్ ఫేస్ గ్రిల్, నిలువుగా ఉండే ఎల్‌ఈడీ డీఆర్ఎల్స్, ఆకర్షణీయమైన సి ఆకారపు లైట్ క్లస్టర్ దీనికి అదిరిపోయే లుక్ ఇస్తున్నాయి. వెనుక భాగంలో ఒక చివర నుండి మరో చివర వరకు ఉండే ఎల్‌ఈడీ లైట్ బార్, కొత్త బంపర్, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ కారుకు రాజసాన్ని అద్దాయి. ఇందులో లగ్జరీ కార్ల మాదిరిగా బాడీలో కలిసిపోయే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి.
లోపలి భాగంలో కియా అద్భుతమైన మార్పులు చేసింది. 12.3-అంగుళాల రెండు డిస్‌ప్లేలు ఒకే కర్వ్డ్ గ్లాస్ ప్యానెల్‌లో ఉండటం హైలైట్. ఇందులో 8-స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు 65W ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. కియా కనెక్ట్ 2.0 ద్వారా స్మార్ట్‌ఫోన్ నుంచే కారులోని 90కి పైగా ఫీచర్లను కంట్రోల్ చేయవచ్చు.
సేఫ్టీ విషయంలో కియా సెల్టోస్ ఈసారి రాజీ పడలేదు. ఇందులో లెవల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్)ను అందించారు. ఇది రోడ్డుపై ప్రమాదాలను ముందుగానే పసిగట్టి డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది. అలాగే 6 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 360-డిగ్రీ కెమెరా వంటి కీలక ఫీచర్లు అన్ని వేరియంట్లలో భద్రతను నిర్ధారిస్తాయి. ఇది HTE, HTK, HTX, GTX వంటి వేరియంట్లలో లభ్యం కానుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ.11 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ఉండవచ్చని అంచనా.

