Mahindra Bolero: మరింత రఫ్ అండ్ టఫ్ లుక్‌తో మహీంద్రా బొలేరో.. అదిరిపోయే ఫీచర్లు
అదిరిపోయే ఫీచర్లు

Mahindra Bolero: ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా తమ మోస్ట్ పాపులర్ ఎస్‌యూవీ బొలేరో మోడల్‌లో బోల్డ్ ఎడిషన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఆకర్షణీయమైన బ్రాంజ్ కలర్ థీమ్, సరికొత్త రియర్ వ్యూ కెమెరాతో రూపుదిద్దుకున్న ఈ వాహనం గ్రామీణ, పట్టణ వాహన ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీని ప్రారంభ ధర రూ. 8.57 లక్షలుగా నమోదైంది. హీంద్రా బొలేరో బోల్డ్ ఎడిషన్ వెలుపలి డిజైన్ పరంగా పలు మార్పులతో దర్శనమిస్తోంది. వాహనం ముందు భాగంలో ఉండే బంపర్, గ్రిల్, ఫాగ్ లాంప్ చుట్టూ ప్రత్యేకమైన బ్రాంజ్ ఫినిషింగ్ అందించారు. వీటితో పాటు అలాయ్ వీల్స్, బయటి అద్దాల క్యాప్‌లు, డోర్ క్లాడింగ్ అలాగే రూఫ్ రెయిల్స్‌కు కూడా ఈ థీమ్ వర్తింపజేశారు. ఈ మార్పుల వల్ల బొలేరో తన పాత బాక్సీ ఆకారాన్ని నిలబెట్టుకుంటూనే మరింత ఆధునికమైన, ఆకర్షణీయమైన లుక్‌ను సొంతం చేసుకుంది. ఇది సాధారణ బొలేరో మోడల్ కొనుగోలుదారులకు డీలర్ స్థాయిలో లభించే ప్రత్యేక యాక్సెసరీ ప్యాక్‌గా లభిస్తుంది.
ఇంటీరియర్ క్యాబిన్, లగ్జరీ ఫీచర్లు
కేబిన్ లోపల కూడా సౌకర్యవంతమైన ప్రయాణం కోసం కొన్ని మెరుగుదలలు చేశారు. ఇందులో ప్రీమియం బ్లాక్ లెదరెట్ సీట్లను అమర్చారు. దీనికి తోడు ప్రత్యేకమైన ఫ్లోర్ మ్యాట్లను ఇచ్చారు. ఈ కొత్త ప్యాక్‌లో లభించే అత్యంత కీలకమైన ఫీచర్ రియర్ వ్యూ కెమెరా. దీనివల్ల ఇరుకైన ప్రాంతాలలో లేదా పార్కింగ్ చేసే సమయంలో వాహనాన్ని వెనక్కి తీయడం చాలా సులభమవుతుంది. మిగిలిన ఫీచర్ల విషయానికొస్తే పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, మ్యాన్యువల్ ఏసీ, ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల రక్షణ కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఇంజిన్ ఇమ్మోబిలైజర్ అమర్చారు.
ఇంజిన్ పనితీరు, మైలేజ్ వివరాలు
సాంకేతిక విభాగంలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో మునుపటిలాగే నమ్మకమైన 1.5 లీటర్ల 3-సిలిండర్ ఎమ్-హాక్ డీజిల్ ఇంజిన్‌ను కొనసాగించారు. ఇది 76 హెచ్‌పీ పవర్‌ను, 210 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ జత చేశారు. ఇది వెనుక చక్రాల డ్రైవ్ (RWD) వ్యవస్థతో పనిచేస్తుంది. కంపెనీ క్లెయిమ్ ప్రకారం ఇది లీటరుకు 16 నుంచి 16.5 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. సాధారణ రహదారులపై లీటరుకు 14 నుంచి 15 కిలోమీటర్ల మైలేజ్ వస్తుందని అంచనా. ఇందులో 60 లీటర్ల సామర్థ్యం ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు.
ధరలు అలాగే వేరియంట్ల సమాచారం
స్టాండర్డ్ మహీంద్రా బొలేరో ఎక్స్-షోరూమ్ ధర బి4 వేరియంట్‌కు రూ.8.57 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ బి8 ధర రూ.9.99 లక్షల వరకు ఉంటుంది. బోల్డ్ ఎడిషన్ ప్యాక్ కావాలనుకునే వారు డీలర్ వద్ద అదనపు రుసుము చెల్లించి దీనిని తమ వాహనానికి అమర్చుకోవచ్చు. రఫ్ అండ్ టఫ్ రోడ్లపై ప్రయాణించడానికి, ఎక్కువ కాలం మన్నే నమ్మకమైన ఎస్‌యూవీని కోరుకునే వారికి ఈ మోడల్ ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది.

