Mahindra Thar: కొత్త థార్ లాంచ్‌కు డేట్ ఫిక్స్.. సెప్టెంబర్ 22న మార్కెట్లోకి రానున్న సరికొత్త ఎస్‌యూవీ
సరికొత్త ఎస్‌యూవీ

Mahindra Thar: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత క్రేజ్ ఉన్న ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీ మహీంద్రా థార్ లవర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్. కంపెనీ తన సరికొత్త థార్ 3-డోర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను సెప్టెంబర్ 22న అధికారికంగా లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ కొత్త ఎస్‌యూవీకి సంబంధించిన టెస్టింగ్ రోడ్లపై అనేకసార్లు కనిపించడంతో ఆటోమొబైల్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పెద్ద మోడలైన థార్ రాక్స్ డిజైన్ స్ఫూర్తితో ఈ కొత్త త్రీ-డోర్ థార్ రూపుదిద్దుకుంది. మెకానికంగా పెద్దగా మార్పులు లేనప్పటికీ, లుక్ పరంగా, ఫీచర్ల పరంగా అనేక ఆకర్షణీయమైన అప్‌డేట్స్ ఉండనున్నాయి.
ఈ కొత్త థార్ ముందు భాగంలో అత్యధిక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖంగా సర్క్యులర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, గ్రిల్‌తో ఫ్లూష్ ఫిట్టింగ్‌లో ఇవ్వనున్నారు. ప్రస్తుత మోడల్‌లో ఉన్న లైట్ల కంటే ఇవి మరింత స్టైలిష్‌గా కనిపిస్తాయి. అంతేకాకుండా C-షేప్ LED DRLs, సిగ్నేచర్ 6-స్లాట్ గ్రిల్ కొత్త డిజైన్‌తో రానున్నాయి. సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, థార్ రాక్స్ పోలి ఉండే సరికొత్త డిజైన్ అలాయ్ వీల్స్‌ను అమర్చారు. వెనుకవైపు వర్టికల్ టెయిల్ ల్యాంప్స్ డిజైన్‌ను అలాగే ఉంచినప్పటికీ, లోపలి ఎల్ఈడీ ఎలిమెంట్స్‌లో మార్పులు చేశారు. అలాగే కొత్త కలర్ ఆప్షన్లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇంటీరియర్ పరంగా కూడా ఈ కొత్త థార్‌లో అనేక అడ్వాన్స్‌డ్ ఫీచర్లు రానున్నాయి. ఇప్పటికే ఉన్న 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో పాటు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, లెదరెట్ అప్‌హోల్స్ట్రీ వంటి అధునాతన హంగులు ఉండవచ్చు. భద్రత కోసం 360-డిగ్రీ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, ADAS వంటి ఫీచర్లు లభించే అవకాశం ఉంది. అయితే ఇంజిన్ ఆప్షన్లలో ఎలాంటి మార్పు ఉండదు. పాత మోడల్ మాదిరిగానే 2.0-లీటర్ టర్బో పెట్రోల్, 2.2-లీటర్ డీజిల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు యథావిధిగా కొనసాగుతాయి. ధర విషయానికి వస్తే, అప్‌డేట్‌ల కారణంగా ప్రస్తుత ధర కంటే సుమారు రూ.25,000 నుంచి రూ.50,000 వరకు పెరిగే అవకాశం ఉంది.

