Mahindra Thar: థార్ కొనే ఆలోచన ఉందా?.. కొద్ది రోజులు ఆగండి.. అదిరిపోయే ఫీచర్లతో ఫేస్‌లిఫ్ట్
అదిరిపోయే ఫీచర్లతో ఫేస్‌లిఫ్ట్

Mahindra Thar: ఆఫ్ రోడింగ్ ప్రేమికులను ఎంతగానో అలరిస్తున్న మహీంద్రా థార్ ఇప్పుడు సరికొత్త రూపంలో అలరించేందుకు సిద్ధమవుతోంది. తన పాపులర్ 3-డోర్ వర్షన్‌ను ఫేస్‌లిఫ్ట్ రూపంలో మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు మహీంద్రా వేగంగా అడుగులు వేస్తోంది. అధునాతన సాంకేతికతలు, లగ్జరీ ఫీచర్లతో వస్తున్న ఈ వాహనం వివరాలు ఇప్పుడు ఆటోమొబైల్ రంగాన్ని ఆకర్షిస్తున్నాయి. భారతీయ రోడ్ల పై ఇటీవల రెండు టెస్టింగ్ మోడళ్లు ఒకేసారి కనిపించడంతో ఈ న్యూ వెర్షన్‌పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వాహనం ముందు, వెనుక భాగాలను పూర్తిగా కప్పి ఉంచినప్పటికీ, ప్రధాన్ మార్పులను స్పష్టంగా గుర్తించవచ్చు. పెద్ద థార్ రోక్స్ నుంచి స్పూర్తి పొందిన రౌండ్ షేప్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఆకర్షణీయమైన ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు ఇందులో అమర్చారు. గ్రిల్ డిజైన్‌లో కూడా స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. ముందు బంపర్‌ను పూర్తిగా రీడిజైన్ చేస్తూ అందులో పార్కింగ్ సెన్సార్లను సైతం చేర్చారు.
18 ఇంచుల అల్లాయ్ వీల్స్, రాయల్ లుక్
పక్క భాగం నుంచి చూస్తే పాత మోడల్ పోలికలే కనిపించినప్పటికీ, కొత్తగా అందించిన 10-స్పోక్ 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఈ ఎస్‌యూవీకి ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. చంకీ బాడీ క్లాడింగ్, వింగ్ మిర్రర్లు, బ్లాక్ గ్రాబ్ హ్యాండిల్స్ వంటి అంశాలను అలాగే కొనసాగించారు. వెనుక భాగంలో కొత్త ఎల్‌ఈడీ టెయిల్‌లైట్లు, రీడిజైన్ చేసిన బంపర్ అమర్చారు. రివర్స్ పార్కింగ్ సెన్సార్లు కూడా వెనుక భాగంలో దర్శనమిస్తాయి.
కేబిన్‌లో భారీ టెక్నాలజీ అప్‌గ్రేడ్
డాష్‌బోర్డ్ లేఅవుట్ పాత పద్ధతిలోనే ఉన్నప్పటికీ, అంతర్గత ఫీచర్ల విషయంలో మహీంద్రా భారీ మార్పులే చేసింది. థార్ రోక్స్ నుంచి సేకరించిన 12.3-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఇందులో జోడించారు. ఈ డిజిటల్ డిస్ప్లే ద్వారా నేవిగేషన్, ఆఫ్-రోడింగ్ డేటా, వాహన మైలేజీ సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. లాంగ్ డ్రైవ్స్ చేసేవారి కోసం వెంటిలేటెడ్ సీట్లు, అద్భుతమైన మ్యూజిక్ అనుభూతిని ఇచ్చే హార్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్‌ను సైతం అందిస్తున్నారు.
ప్రయాణికుల భద్రత కోసం అడాస్ లెవెల్ 2 టెక్నాలజీని జోడించడం ఈ కార్‌లోనే అతిపెద్ద మార్పు. ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి రక్షణ ఫీచర్లు ఇందులో అందుబాటులోకి రానున్నాయి.
ఇంజిన్ విభాగంలో మార్పులు లేనట్లే
సాంకేతికపరంగా, ఫీచర్ల పరంగా భారీగా మారినప్పటికీ ఇంజిన్ విభాగంలో మాత్రం పాత పవర్‌ట్రెయిన్లనే కొనసాగించనున్నారు. 2.0-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కొనుగోలుదారులు ఎంచుకోవచ్చు. రియర్-వీల్ డ్రైవ్‌తో పాటు అవసరమైన మోడళ్లలో 4x4 సిస్టమ్‌ను కూడా అందిస్తున్నారు.

