Maruti Brezza : భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాలకు అత్యంత ఇష్టమైన కాంపాక్ట్ ఎస్‌యూవీ మారుతి సుజుకి బ్రెజ్జా సరికొత్త రూపంలో మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సరికొత్త 2026 బ్రెజ్జా మోడల్ అధికారిక బుకింగ్స్‌ను కంపెనీ ప్రారంభించింది. కేవలం రూ.11,000 టోకెన్ అమౌంట్ చెల్లించి మారుతి సుజుకి ఎరీనా డీలర్‌షిప్‌లలో లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ కారును బుక్ చేసుకోవచ్చు. జూలై 23న ఈ మోడల్ మార్కెట్లో గ్రాండ్‌గా లాంచ్ కానుంది. ఈసారి సరికొత్త స్టైలింగ్, అదిరిపోయే లగ్జరీ ఫీచర్లు, బలమైన ఇంజన్ అప్‌డేట్లతో బ్రెజ్జా కస్టమర్లను పలకరించనుంది.

టాటా నెక్సాన్, క్రెటాలకు గట్టి పోటీ

కొత్త బ్రెజ్జా 2026 క్యాబిన్ లోపల అడుగుపెడితే కస్టమర్లకు ఒక సరికొత్త లగ్జరీ ఫీల్ కలగడం ఖాయం. ఇప్పటివరకు ఉన్న 9-ఇంచుల టచ్‌స్క్రీన్‌కు బదులుగా.. ఈసారి భారీ సైజులో ఉండే 10.25-ఇంచుల సరికొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను మారుతి అమర్చింది. ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే సపోర్ట్ ఉంటుంది. దీంతో పాటు ప్రీమియం వేరియంట్లలో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, క్రూయిజ్ కంట్రోల్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, మరిన్ని స్మార్ట్ కనెక్టెడ్ ఫీచర్లను అందించనున్నారు. ఈ మార్పుల వల్ల బ్రెజ్జా తన పోటీదారులకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

కారు ఇంటీరియర్స్‌తో పాటు ఎక్స్‌టీరియర్ డిజైన్‌లోనూ మారుతి సుజుకి కీలక మార్పులు చేసింది. ఈ 2026 మోడల్‌కు సరికొత్త డిజైన్ గల ఫ్రంట్ బంపర్, సరికొత్త గ్రిల్‌ను అమర్చారు. దీనివల్ల కారు ముందు భాగం మరింత గంభీరంగా కనిపిస్తుంది. ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్, టెయిల్ లైట్స్ డిజైన్‌ను కూడా అప్‌గ్రేడ్ చేశారు. సరికొత్త ఆకర్షణీయమైన అలాయ్ వీల్స్, కొత్త రంగుల ఎంపికలతో వస్తున్న ఈ కారు రోడ్డుపై వెళ్తుంటే అందరి దృష్టిని ఆకర్షించేలా డిజైన్ చేశారు.

డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేసేందుకు మారుతి సుజుకి ఈసారి 5-స్పీడ్ గేర్‌బాక్స్ స్థానంలో సరికొత్త 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను ప్రవేశపెట్టింది. దీనివల్ల హైవేలపై ప్రయాణించేటప్పుడు మైలేజ్ పెరగడమే కాకుండా ఇంజన్ చాలా స్మూత్‌గా సాగుతుంది. ఇంజన్ ఆప్షన్ల విషయానికి వస్తే, నమ్మకమైన 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు, ఈసారి యువతను ఆకట్టుకోవడానికి ఫ్రాంక్స్ కారులో విజయవంతమైన 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను కూడా బ్రెజ్జాలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం.

సాధారణంగా సీఎన్‌జీ కార్లు కొనే మధ్యతరగతి కుటుంబాలకు ఉండే అతిపెద్ద సమస్య బూట్ స్పేస్ లేకపోవడం. డిక్కీలో పెద్ద గ్యాస్ సిలిండర్ పెట్టడం వల్ల సామాన్లు పెట్టుకోవడానికి అస్సలు స్థలం ఉండదు. అయితే ఈ సమస్యకు మారుతి సుజుకి చెక్ పెట్టింది. కొత్త బ్రెజ్జా సీఎన్‌జీ మోడల్‌లో గ్యాస్ ట్యాంకును కారు అడుగు భాగంలో అమర్చారు. దీనివల్ల డిక్కీలో లగేజ్ పెట్టుకోవడానికి ప్రయాణికులకు భారీగా స్థలం దొరుకుతుంది. ఫ్యామిలీతో లాంగ్ ట్రిప్స్ వెళ్లేవారికి ఈ ఫీచర్ ఒక వరం లాంటిదని చెప్పవచ్చు.

భారతదేశంలో 2016లో లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 14 లక్షల కంటే ఎక్కువ బ్రెజ్జా కార్లు అమ్ముడయ్యాయంటే ఈ కారుకు మార్కెట్లో ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. జూలై 23న అధికారికంగా లాంచ్ కానున్న ఈ సరికొత్త బ్రెజ్జా 2026.. మార్కెట్లో ఉన్న టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా XUV 3XO, స్కోడా కైలాక్, టయోటా టైజర్ వంటి పాపులర్ కార్లకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story