Maruti Brezza : భారతీయ ఆటోమొబైల్ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీలలో మారుతి సుజుకి బ్రెజ్జా ఒకటి. గడిచిన 10 సంవత్సరాలలో ఈ కారు దేశీయంగా, అంతర్జాతీయంగా తిరుగులేని ఆదరణ పొందింది. ఇప్పటివరకు భారత్‌లో 14,61,889 యూనిట్లు అమ్ముడవగా, విదేశాలకు 52,828 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. అంటే మొత్తం మీద 15.14 లక్షల కంటే ఎక్కువ మైలురాయిని దాటి దేశంలోనే అత్యంత విజవంతమైన కార్లలో ఒకటిగా నిలిచింది. ఈ జోరును ఇలాగే కొనసాగించేందుకు మారుతి సుజుకి సరికొత్త డిజైన్, అధునాతన ఫీచర్లతో నూతన బ్రెజ్జాను మార్కెట్లోకి విడుదల చేసింది.

కొత్త ధరలు, వేరియంట్లు

కొత్త మారుతి బ్రెజ్జా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.39 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. టాప్ వేరియంట్ ధర రూ. 13.70 లక్షల వరకు ఉంటుంది. వేరియంట్లను బట్టి ధరలు మారతాయి. కొత్త బ్రెజ్జా చూడటానికి పాత రూపురేఖలనే ప్రతిబింబించినప్పటికీ, ముందు భాగంలో సరికొత్త ఫ్రంట్ గ్రిల్, అప్‌డేటెడ్ బంపర్, కొత్త 16-ఇంచుల అలాయ్ వీల్స్, పైన అమర్చిన ఫాగ్ లాంప్స్, డార్క్ క్రోమ్ ఫినిషింగ్‌తో మరింత ఆకర్షణీయంగా మార్చారు.

డీజిల్ నుంచి టర్బో పెట్రోల్ వరకు ప్రయాణం

బ్రెజ్జా ప్రయాణం మొదట్లో కేవలం ఫియట్ 1.3-లీటర్ DDiS టర్బో డీజిల్ ఇంజిన్‌తో ప్రారంభమైంది. అయితే 2020లో బిఎస్6 నిబంధనల అమలు తర్వాత మారుతి డీజిల్ ఇంజిన్లను నిలిపివేసి, 1.5-లీటర్ K15B పెట్రోల్ ఇంజిన్‌ను తీసుకొచ్చింది. ఇది వరుసగా నాలుగేళ్ల పాటు భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా రికార్డు సృష్టించింది. కానీ ఇటీవల టాటా నెక్సాన్, టాటా పంచ్, హ్యుందాయ్ క్రెటా వంటి కార్ల పోటీ వల్ల కొంత వెనుకబడింది. ఇప్పుడు దీనికి చెక్ పెట్టేందుకు కొత్తగా 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను పరిచయం చేశారు. ఇది 110hp పవర్, 170Nm టార్క్‌ను అందిస్తుంది.

అండర్‌బోడీ సీఎన్‌జీ, అధునాతన ఫీచర్లు

కొత్త బ్రెజ్జాలో అత్యంత కీలకమైన మార్పు దాని సీఎన్‌జీ మోడల్‌లో చోటుచేసుకుంది. ఇందులో సిలిండర్‌ను కారు కింద భాగంలో అమర్చడం వల్ల బూట్ స్పేస్ సామాన్లు పెట్టుకోవడానికి పూర్తిగా అందుబాటులో ఉంటుంది. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే.. 10.1-ఇంచుల పెద్ద టచ్‌స్క్రీన్, 64-కలర్ యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్‌లెస్ ఛార్జింగ్ విత్ కూలింగ్ సిస్టమ్, అలెక్సా వాయిస్ సపోర్ట్ వంటి అనేక లగ్జరీ ఫీచర్లను జోడించారు. 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story