Mitsubishi Pajero: ఆఫ్ రోడింగ్ లవర్లకు మిత్సుబిషి కంపెనీ అదిరిపోయే తియ్యటి కబురు అందించింది. ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తన ఐకానిక్ పజేరో ఎస్‌యూవీని సరికొత్త డిజైన్, నూతన సాంకేతికతతో తిరిగి మార్కెట్లోకి తెస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 2, 2026న ఈ మోడల్ గ్లోబల్ ఆవిష్కరణ జరగనుంది. ఆటోమొబైల్ ప్రపంచంలో పజేరో పేరుకు ఉన్న క్రేజ్ ప్రత్యేకమైనది. 2021లో ఈ మోడల్ ఉత్పత్తిని నిలిపివేసిన తర్వాత, మళ్లీ ఎప్పుడు వస్తుందా అని ప్రపంచవ్యాప్తంగా కార్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఐదో జనరేషన్ పజేరోను అత్యంత ఆధునికంగా తీర్చిదిద్ది 2026 సెప్టెంబర్ 2న ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు. కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో దీనిని మొంటెరో పేరుతోనూ విక్రయించే అవకాశం ఉంది.

అత్యంత బలమైన ల్యాడర్ ఫ్రేమ్ ప్లాట్‌ఫామ్

సరికొత్త పజేరో ప్రధాన ఆకర్షణ దాని దృఢమైన ప్లాట్‌ఫామ్. మిత్సుబిషి ట్రైటాన్ పికప్ ట్రక్ ఆధారంగా తీర్చిదిద్దిన బాడీ-ఆన్-ఫ్రేమ్ ల్యాడర్ ఛాసిస్‌పై దీనిని నిర్మిస్తున్నారు. కేవలం పికప్ వెహికల్ లాగా కాకుండా, దీని కేబిన్, సస్పెన్షన్ వ్యవస్థలను ఎస్‌యూవీ ప్రయాణికులకు అత్యున్నత సౌకర్యాన్ని, విలాసవంతమైన డ్రైవింగ్ అనుభూతిని అందించేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

గుండెలాంటి ఎస్-ఎడబ్ల్యూసీ ఆఫ్ రోడింగ్ సిస్టమ్

ఎంతటి కఠినమైన రహదారులనైనా ఈజీగా దాటేసేందుకు మిత్సుబిషి తమ పేటెంట్ సూపర్ ఆల్-వీల్ కంట్రోల్ సిస్టమ్ ను ఇందులో అమర్చనుంది. ఈ టెక్నాలజీ వల్ల బురద, రాళ్లు, మంచు వంటి క్లిష్టమైన ప్రాంతాల్లోనూ వాహనంపై డ్రైవర్‌కు అద్భుతమైన నియంత్రణ లభిస్తుంది. దీనికి తోడు డీజిల్ ఆధారిత హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ మోడల్‌ను కూడా తీసుకురానున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఫార్చ్యూనర్, ప్రాడోలకు గట్టి పోటీ

ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీగా వస్తున్న పజేరో నేరుగా టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎవరెస్ట్, టయోటా ప్రాడో, ఇసుజు ఎమ్-ఎక్స్ వంటి దిగ్గజ మోడళ్లకు సవాల్ విసరనుంది. బలమైన ఇంజిన్, అదిరిపోయే ఆఫ్ రోడింగ్ సామర్థ్యాలతో రారాజుగా నిలవడానికి సిద్ధమవుతోంది.

భారత మార్కెట్లోకి వచ్చేనా?

భారత్‌లో పజేరో కారుకు ప్రత్యేకమైన అభిమాన గణం ఉందనడంలో సందేహం లేదు. పాత మోడల్ అందించిన పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇప్పటికీ భారతీయుల మనసుల్లో చెరిగిపోని ముద్ర వేసింది. అయితే ప్రస్తుతానికి భారతదేశంలో ఈ నూతన మోడల్‌ను ప్రవేశపెట్టడంపై కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సెప్టెంబర్ 2న జరగబోయే గ్లోబల్ ప్రదర్శనలో దీని రూపరేఖలు, పూర్తి స్పెసిఫికేషన్లు వెల్లడి కానున్నాయి.

Next Story